యాపిల్ వాచ్ తో కుమార్తె మృతదేహాన్ని గుర్తించిన తండ్రి..!
అవును... ఇజ్రాయేల్ - హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇప్పటికే వేల మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 18 Oct 2023 4:30 PM GMTఇజ్రాయేల్ - హమాస్ యుద్ధం నేపథ్యంలో ఎన్నో విషాధరక సంఘటనలు వెలుగులోకి వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా మ్యూజికల్ ఫెస్ట్ లో హమాస్ దాడుల సందర్భంగా వెలుగులోకి వచ్చిన ఘటనలు ఎంతో విషాదకరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో యాపిల్ వాచ్ సాయంతో తన కూతురు మృతదేహాన్ని గుర్తించారు ఒక తండ్రి. ఈ కన్నీటి ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
అవును... ఇజ్రాయేల్ - హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇప్పటికే వేల మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. లక్షల మంది నిరాశ్రయులయ్యారని అంటున్నారు! ఈ సమయంలో... ఐఫోన్, ఆపిల్ వాచ్ ద్వారా ఓ తండ్రి.. ఇజ్రాయెల్ లో హమాస్ మిలిటెంట్ల దాడిలో మరణించిన తన కుమార్తె మృతదేహాన్ని గుర్తించాడు. ఈ విషాదఘటన తాజాగా వెలుగులోకి వచ్చి వైరల్ అవుతోంది.
వివరాళ్లోకి వెళ్తే... అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పై హమాస్ ఉగ్రవాదులు అకస్మికంగా దాడిచేసిన సంగతి తెలిసిందే. ఒకవైపు కేవలం 20 నిమిషాల్లో ఐదు వేల రాకెట్లుతో దాడులు చేస్తూ... మరోవైపు ఇజ్రాయెల్ లోకి ప్రవేశించి తుపాకులతో మారణహోమం సృష్టించారు. ఈ ఘటనలో వందల మంది ప్రాణాలు కోల్పోగా... మరికొంత మందిని హమాస్ మిలిటెంట్లు బందీలుగా చేసుకున్నారు.
ఈ ఘటనలో మెల్లనాక్స్ సంస్థ వ్యవస్థాపకుడు ఇయల్ వోల్డ్ మాన్ కుమార్తె డేనియన్ కూడా మరణించారు. ఇజ్రాయెల్ లోని మ్యూజిక్ల్ ఫెస్ట్ కు స్నేహితుడితో వెళ్లిన డేనియల్... హమాస్ ఉగ్రమూకలు చేసిన దాడిలో మరణించారు. అయితే... ఈ ఘటన అనంతరం డేనియల్ ఫోన్ నుంచి వోల్డమన్ ఫోన్ కు ఎమర్జన్సీ కాల్ వచ్చిందట కానీ ఎటువంటి సమాచారం అందలేదు. దీంతో... ఆమెను హమాస్ మిలిటెంట్లు బందీలుగా చేసుకొని ఉంటారని భావించారు.
అనంతరం తన కుమార్తె వినియోగిస్తున్న ఐఫోన్, ఆపిల్ వాచ్ ద్వారా లోకేషన్ ను ట్రాక్ చేసేందుకు ప్రయత్నం చేశాడట వోల్డ్ మాన్. దీంతో... ఆ ఫోన్ & వాచ్ లొకేషన్ ఘటన స్థలానికి సమీపంలోనే ఉన్నట్లు సిగ్నల్ వచ్చిందట. దీంతో హుటాహుటున సిగ్నల్ అందిన ప్రాంతానికి వెళ్లిన తండ్రికి... హృదయ విదారకరమైన దృశ్యం కనిపించిందట. అవును... సిగ్నల్ అందిన చోటుకి వెళ్లి చూడగా.. వోల్డ్ మాన్ కు తన కుమార్తె మృతదేహం కనిపించింది.
ఇదే సమయంలో... ఆమె మృతదేహానికి సమీపంలో ఆమెతోపాటు వెళ్లిన డేనియల్ స్నేహితుడు మృతదేహం కూడా అక్కడే కనిపించిందట. దీంతో గుండెలు పగిలేలా రోదించిన వోల్డ్ మాన్... తర్వాత కార్యక్రమాలు పూర్తిచేశారంట. ఈ విషయాలపై స్పందించిన ఆయన... వారద్దరికి త్వరలో పెళ్లి చేయాలనుకున్నామని, అంతలోనే ఈ ఘోరం జరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.