Begin typing your search above and press return to search.

అర్థరాత్రి హైటెన్షన్: సాగర్ ప్రాజెక్టు వద్దకు భారీగా ఏపీ పోలీసులు

ఎప్పుడూ లేని రీతిలో ఎలాంటి కారణం లేకుండానే ఏపీకి చెందిన పోలీసు బలగాలు తెలంగాణ పరిధిలోని నాగార్జున సాగర్

By:  Tupaki Desk   |   30 Nov 2023 5:12 AM GMT
అర్థరాత్రి హైటెన్షన్: సాగర్ ప్రాజెక్టు వద్దకు భారీగా ఏపీ పోలీసులు
X

అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎప్పుడూ లేని రీతిలో ఎలాంటి కారణం లేకుండానే ఏపీకి చెందిన పోలీసు బలగాలు తెలంగాణ పరిధిలోని నాగార్జున సాగర్ డ్యామ్ వద్దకు చేరుకున్న వైనం సంచలనంగా మారింది. డ్యామ్ వద్దకు చేరుకున్న ఏపీ పోలీసులు అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ఎస్పీఎఫ్ పోలీసులపై దాడి చేయటం ఒక ఎత్తు అయితే..డ్యామ్ పై ఉన్న సీసీ కెమేరాల్ని.. విద్యుత్ సరఫరాను నిలిపివేసిన వైనం హైటెన్షన్ కు తావిస్తోంది. కీలకమైన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మరికొద్ది గంటల వ్యవధిలో మొదలుకానున్న వేళలో.. ఈ పరిణామం చోటు చేసుకోవటం గమనార్హం.

నాగార్జున సాగర్ ప్రాజెక్టు మొత్తం 26 గేట్లు ఉండగా.. అందులో సగ భాగమైన13వ గేట్ తమ పరిధిలోకి వస్తుందని ఏపీ పోలీసు శాఖకు చెందిన ఉన్నతాధికారులు సుమారు 500 మంది పోలీసు సిబ్బందితో సాగర్ ప్రాజెక్టు వద్దకు వచ్చారు. వారిని అక్కడే ఉన్న డ్యామ్ ఎస్పీఎఫ్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. వారి మొబైల్ ఫోన్లను.. డ్యామ్ భద్రత కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమేరాల్ని ధ్వంసం చేశారు. ఆపై వారు పదమూడోగేట్ వద్దకు చేరుకొని ముళ్లకంచెను ఏర్పాటు చేసి డ్యామ్ ను తమ అధీనంలోకి తీసుకోవటం షాకింగ్ గా మారింది.

డ్యామ్ మీదకు ఏపీ పోలీసులు పెద్ద ఎత్తున వచ్చి.. దాడికి పాల్పడిన వైనానికి సంబంధించిన సమాచారాన్ని అందుకున్న మిర్యాలగూడ డీఎస్పీ వెంకటగిరి డ్యామ్ పైకి చేరుకొని ఏపీ పోలీసులతో మాట్లాడారు. డ్యామ్ నిర్వాహణ విషక్ష్ం నీటిపారుదల శాఖకు చెందినదని.. ఏపీ పోలీసులు ఏర్పాటు చేసిన ముళ్ల కంచెను తీసేయాలని ఏపీ పోలీసులకు సూచించారు.

అయితే.. ఏపీ పోలీసులు వారి మాటల్ని పట్టించుకోకపోవటం.. స్పందించకపోవటంతో తన సిబ్బందితో ఆయన వెనుదిరిగి వెళ్లిపోయారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వేళ.. విభజనలో భాగంగా నాగార్జున సాగర్ నిర్వాహణను క్రిష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు తెలంగాణ ప్రభుత్వానకి అప్పగించటం తెలిసిందే.అయితే.. గతంలోనూ రెండురాష్ట్రాలకు చెందిన డీఎస్పీల మధ్య వాగ్వాదం జరగటం... ఆ వెంటనే అనూహ్య పరిణామాలు చోటు చేసుకొని ఇరు రాష్ట్రాలకు చెందిన పోలీసు సిబ్బంది మొహరించటం తెలిసిందే. అనంతరం అప్పటి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అయి.. వివాదాన్ని సమసిపోయేలా చేయటం తెలిసిందే.

అయితే.. తాజా ఉదంతంలో మాత్రం ఎలాంటి కారణం లేకుండానే ఏపీ పోలీసులు డ్యామ్ వద్దకు చేరుకొని.. కబ్జా తీరులో వ్యవహరించిన వైనంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ వేళలో ఇలాంటి ఉదంతం చోటు చేసుకోవటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకిలా వ్యవహరించారన్న దానిపై ఏపీ ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది.