Begin typing your search above and press return to search.

ఆ నటులకు భవిష్యత్ అగమ్యగోచరమేనా ?!

రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. అధికార పార్టీని ప్రతిపక్షం ప్రశ్నించడం, అధికార పార్టీ సమాధానం ఇవ్వడం ఆనవాయితీ

By:  Tupaki Desk   |   13 July 2024 2:30 PM GMT
ఆ నటులకు భవిష్యత్ అగమ్యగోచరమేనా ?!
X

రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. అధికార పార్టీని ప్రతిపక్షం ప్రశ్నించడం, అధికార పార్టీ సమాధానం ఇవ్వడం ఆనవాయితీ. దురదృష్టవశాత్తు గత కొన్నేళ్లుగా పెరిగిన సోషల్ మీడియా మూలంగా విమర్శలు, ప్రతి విమర్శలు హద్దులు దాటి వ్యక్తిగత విషయాల మీదకు వెళ్తున్నాయి. రాజకీయ నాయకుల విమర్శలు ఒక పరిధి దాటి జుగుప్సాకరంగా ఉంటున్నాయి. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఇలా హద్దులు దాటి మాట్లాడిన కొందరు సినిమా నటుల భవిష్యత్ ఎలా ఉంటుంది అన్నది ప్రస్తుతం సినిమా పరిశ్రమలో చర్చకు దారితీసింది.

సినిమాల నుండి రాజకీయాల్లోకి వచ్చిన నటి రోజా జగన్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. అయితే మంత్రి హోదాలో ఆమె మెగా కుటుంబాన్ని, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ను విమర్శించిన తీరును అందరూ ఆక్షేపించారు. ప్రస్తుతం ఏపీలో రోజా ఓటమి, కూటమి గెలుపు, పవన్ ఉప ముఖ్యమంత్రి కావడం జరిగింది. సినిమాలను వదిలేసి బుల్లితెర జబర్దస్త్ కు మాత్రమే పరిమితం అయిన రోజా మంత్రి అయ్యాక అది కూడా మానేసింది. ప్రస్తుతం ఆమె ఖాళీగా ఉన్నా పరిశ్రమలో అవకాశాలు రావడం కష్టమేనని అంటున్నారు.

ఇక సినీనటుడు పోసాని క్రిష్ణమురళి మొదటి నుండి వైఎస్ కుటుంబానికి విధేయుడు. చంద్రబాబు నాయుడు వ్యతిరేకి. అయితే 2009 తర్వాత మెగా కుటుంబం రాజకీయాల్లోకి రావడంతో ఆయన వారిని కూడా లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నాడు. గత ఐదేళ్లలో ముఖ్యంగా ఎన్నికల సమయంలో ప్రతిసారి పోసాని హద్దులు దాటి విమర్శలు చేయడం ఆనవాయితీ. ప్రస్తుతం చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో పాటు పవన్ ఉప ముఖ్యమంత్రి కావడం పోసానికి గడ్డుకాలం దాపురించినట్లేనని చెబుతున్నారు. అనవసరంగా అతనికి అవకాశాలు ఇచ్చి తాము ఎందుకు టార్గెట్ కావాలని నిర్మాతలు, దర్శకులు భావిస్తున్నట్లు తెలుస్తుంది.

ఇక మరో నటుడు అలీ వైసీపీ ప్రభుత్వంలో పదవిని అనుభవించినా ఎన్నడూ రాజకీయ విమర్శల జోలికి వెళ్లలేదు. వైసీపీని సమర్ధించడం తప్ప పవన్, చంద్రబాబును విమర్శించలేదు. ఇక ఇటీవల ఎన్నికల్లో ఎవరికీ ప్రచారం కూడా చేయలేదు. ఎన్నికల ఫలితాల తర్వాత తనకు ఇక నుండి ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని ప్రకటించాడు. ఈ నేపథ్యంలో అలీకి పెద్దగా సమస్యలు ఉండకపోవచ్చని చెబుతున్నారు. దానికి తోడు ప్రస్తుతం అతని చేతిలో ఒక టీవీ షో మినహా మరే సినిమాలు లేవు.

వైసీపీ ప్రభుత్వంలో వెంకటేశ్వర ఛానల్ చైర్మన్ గా ఎంపికైన నటుడు ఫృద్వీరాజ్‌ లైంగిక వేధింపుల ఆరోపణలతో పదవీచ్యుతుడు అయ్యాడు. ఈ ఎన్నికల్లో కూటమికి సపోర్ట్ చేసిన నేపథ్యంలో అతడు ప్రస్తుతం హ్యాపీగా ఉన్నాడు. అయితే యాంకర్ శ్యామల పిఠాపురంలో పోటీ చేసిన పవన్ కళ్యాణ్ మీద ఎక్కుపెట్టడం, ఈ ఎన్నికల్లో పవన్ గెలవడంతో ఆమె కెరీర్ ప్రశ్నార్ధకమే అని అంటున్నారు. ఇక ఈ ఎన్నికల్లో కూటమికి మద్దతుగా ప్రచారం చేసిన హైపర్ ఆది, కిరాక్ ఆర్పీలు ప్రస్తుతం సంతోషంగా ఉన్నారు. ఎన్నికల సమయంలో రోజా విమర్శలకు కిరాక్ ఆర్పీ కౌంటర్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎన్నికల్లో కూటమి గెలుపు తర్వాత ఇంటర్వ్యూలు కూడా బాగా వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పుడైనా, ఎప్పుడైనా రాజకీయాల్లో విమర్శలు హద్దులు దాటొద్దని రాజకీయ పరిశీలకులు సూచిస్తున్నారు.