ఈ ఏడుగురు స్పెషల్ గురూ!
సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో మొన్నటివరకూ పొలిటికల్ హీట్ కనిపించింది
By: Tupaki Desk | 22 May 2024 9:46 AM GMTసార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో మొన్నటివరకూ పొలిటికల్ హీట్ కనిపించింది. ఇప్పుడు ఇక్కడ పోలింగ్ ముగిసింది. దీంతో ఆయా పార్టీలు గెలుపోటములపై బేరీజు వేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల బరిలో నిలిచిన ఏడుగురు అభ్యర్థులు మాత్రం స్పెషల్‌గా కనిపిస్తున్నారు. వీళ్ల తండ్రులు మాజీ సీఎంలు కావడమే అందుకు కారణం. మరి తండ్రుల బాటలో సాగుతున్న వీళ్లు ఈ ఎన్నికల్లో విజయదుందుభి మోగిస్తారా? అన్నది చర్చనీయాంశంగా మారింది.
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తనయుడు జగన్మోహన్, కూతురు షర్మిల ఎన్నికల సమరంలో పాల్గొన్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీని అధికారంలోకి తెచ్చి సీఎం అయిన జగన్ మరోసారి విజయంపై ధీమాతో ఉన్నారు. పులివెందుల నియోజకవర్గంలో ఆయన గెలుపు ఖాయమే. కానీ రాష్ట్రంలో మరోసారి వైసీపీ అధికారంలోకి రావడం కష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా ఉన్న షర్మిల కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అవినాష్‌ను ఓడించడమే లక్ష్యంగా ఆమె ప్రచారం చేశారు.
మరోవైపు మామ అల్లుడు బాలకృష్ణ, లోకేష్ కూడా విజయంపై నమ్మకంతో ఉన్నారు. హిందూపురంలో వరుసగా రెండు సార్లు గెలిచిన బాలకృష్ణ.. దివంగత ఎన్టీఆర్ తనయుడు అన్న సంగతి తెలిసిందే. ఈ సారి బాలయ్య హ్యాట్రిక్ పక్కా అని అంటున్నారు. ఇక 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు కొడుకైన లోకేష్ మంగళగిరిలో గెలిచి బోణీ కొట్టాలని చూస్తున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ ఓటమిపాలైన లోకేష్ ఈ సారి గెలుస్తాననే విశ్వాసంతో కనిపిస్తున్నారు. అలాగే మాజీ సీఎంలు నాదెండ్ల భాస్కరరావు తనయుడు నాదెండ్ల మనోహర్ (తెనాలిలో జనసేన నుంచి), కోట్ల విజయభాస్కర్ రెడ్డి కొడుకు సూర్య ప్రకాశ్ రెడ్డి (డోన్‌లో టీడీపీ నుంచి), నేదురుమిల్లి జనార్ధన్‌రెడ్డి కుమారుడు రామ్‌కుమార్ (వెంకటగిరిలో వైసీపీ నుంచి) కూడా అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.