Begin typing your search above and press return to search.

పులివెందుల, కుప్పం, మంగళగిరి... వామ్మో ఇన్నేసి నామినేషన్లా?

ఇందులో భాగంగా... గురువారం మధ్యాహ్నం 3గంటలతో లోక్‌ సభ, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ గడువు ముగిసిందని అధికారులు ప్రకటించారు

By:  Tupaki Desk   |   26 April 2024 2:30 AM GMT
పులివెందుల, కుప్పం, మంగళగిరి... వామ్మో ఇన్నేసి నామినేషన్లా?
X

ఆంధ్రప్రదేశ్‌ లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. ఇందులో భాగంగా... గురువారం మధ్యాహ్నం 3గంటలతో లోక్‌ సభ, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ గడువు ముగిసిందని అధికారులు ప్రకటించారు. ఇదే సమయంలో... ఈనెల 29 నామినేషన్ల ఉపసంహరణకు తుదిగడువని వెల్లడించారు!

ఈ సమయంలో... రాష్ట్రంలోని 25 లోక్‌ సభ స్థానాలకు గానూ 731 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా.. 175 అసెంబ్లీ నియోజకవర్గాలకూ 4,210 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఈ క్రమంలో ఈ నెల 26న (శుక్రవారం) నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఆ సంగతి అలా ఉంటే... కొన్ని కీలక నియోజకవర్గాల్లో భారీ ఎత్తున నామినేషన్లు దాఖలవ్వడం ఆసక్తిగా మారింది.

ఇందులో భాగంగా... ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోటీ చేస్తున్న పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో 39 నామినేషన్లు దాఖలవ్వగా.. టీడీపీ అధినేత చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పం నియోజకవర్గంలో 32 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇదే క్రమంలో జనసేన అధినేత పవన్ పోటీ చేస్తున్న పిఠాపురంలో 21 నామినేషన్లు వేశారు.

ఇదే క్రమంలో... నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో అనూహ్యంగా 68 నామినేషన్లు దాఖలయ్యాయి! ఇదే సమయంలో రాష్ట్రంలోని మరికొన్ని కీలక నియోజకవర్గాల విషయానికొస్తే... పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పోటీ చేస్తున్న పుంగనూరులో 35, కొడాలి నాని పోటీ చేస్తున్న గుడివాడ లో 32 నామినేషన్లు దాఖలవ్వగా... పేర్ని నాని కుమారుడు పోటీ చేస్తున్న మచిలీపట్నంలో 34 నామినేషన్లు దాఖలయ్యాయి!

అదేవిధంగా... ఆర్కే రోజా పోటీచేస్తున్న నగరిలో 36, అంబటి రాంబాబు బరిలోకి దిగుతున్న సత్తెనపల్లిలో 38, గుడివాడ అమర్నాథ్ పోటీ చేస్తున్న గాజువాకలో 32, విజయవాడ లోక్ సభ స్థానంలో 46 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈనెల 29 నామినేషన్ల ఉపసంహరణకు తుదిగడువు కావడంతో... ఆ తర్వాత ఏయే నియోజకవర్గాల్లో ఎంత మంది అభ్యర్థులు పోటీ చేయబోతున్నారనే విషయంపై క్లారిటీ వస్తుంది!