Begin typing your search above and press return to search.

ఇండిపెండెంట్లు లేరు.. ఇక అన్నీ పార్టీల‌దే హ‌వా..!

స‌హ‌జంగా ఎన్నిక‌లు అన‌గానే ప్రాంతీయ‌, జాతీయ పార్టీల‌తోపాటు.. అసంతృప్తులైన ఇండిపెండెంట్ అభ్య‌ర్థులు కూడా బ‌రిలో ఉండ‌డం అంద‌రికీ తెలిసిందే

By:  Tupaki Desk   |   21 March 2024 9:27 AM GMT
ఇండిపెండెంట్లు లేరు.. ఇక అన్నీ పార్టీల‌దే హ‌వా..!
X

స‌హ‌జంగా ఎన్నిక‌లు అన‌గానే ప్రాంతీయ‌, జాతీయ పార్టీల‌తోపాటు.. అసంతృప్తులైన ఇండిపెండెంట్ అభ్య‌ర్థులు కూడా బ‌రిలో ఉండ‌డం అంద‌రికీ తెలిసిందే. ఇలా పోటీ చేసిన వారు కూడా.. చాలా మంది గెలిచిన ప‌రిస్థితి ఉంది. ఉమ్మ‌డిఏపీలో ప్ర‌స్తుతం విజ‌య‌వాడతూర్పు నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యేగా ఉన్న గ‌ద్దె రామ్మోహ‌న్‌కు అప్ప‌ట్లో అన్న‌గారు 1994లో టికెట్ నిరాక‌రించారు. దీంతో ఆయ‌న గ‌న్న‌వ‌రం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకున్నారు.

2014లో చీరాల నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆమంచి కృష్ణ‌మోహ‌న్‌కు ఏ పార్టీ కూడా టికెట్ ఇవ్వ‌క‌పోతే.. ఆయన కూడా.. ఇండిపెండెంట్‌గానే పోటీ చేసి విజ‌యం సాధించారు. ఇలా ఇండిపెండెంట్లుగా పోటిచేసిన చాలా మంది గెలిచిన సంద‌ర్భాలు.. అదేస‌మ‌యంలో అంత‌కు రెట్టింపు సంఖ్య‌లో ఓడిన నాయ‌కులు కూడా ఉన్నారు. అయితే.. 2019తో పోలిస్తే.. ఈ ఏడాది జ‌రుగుతున్న ఎన్నిక‌ల విష‌యానికి వ‌స్తే.. ఇండిపెండెంట్ల మాట వినిపించ‌డ‌మే లేదు.

అలాగ‌ని అడిగిన వారికల్లా ప్ర‌ధాన పార్టీలు టికెట్లు ఇస్తున్నాయా? అంటే.. అది కూడా కాదు. వైసీపీలో అయినా.. టీడీపీలో అయినా.. చాలా మందికి టికెట్లు నిరాక‌రించారు. మ‌రి వీరు రాజ‌కీయాల‌కు దూరం అవుతున్నారా? అంటే అది కూడా కాదు. పోనీ.. ఇండిపెండెంట్లుగా బ‌రిలో నిలుస్తున్నారా? అంటే అస‌లు అది చ‌ర్చ‌లో కూడా లేదు. ఇప్పుడు ఎవ‌రూ ఇండిపెండెంటుగా పోటీచేసే అవ‌కాశం లేకుండా.. అనే పార్టీలు పుట్టుకొచ్చాయి.

దీంతో టికెట్లు రాని వారు.. తొలిసారి రాజ‌కీయాల్లోకి వ‌చ్చి ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని భావిస్తున్న వారు.. ఇలా పుట్ట‌గొడుగుల మాదిరిగా పుట్టుకొస్తున్న పార్టీల్లోకి చేరుతున్నారు. రాష్ట్రంలో ప్ర‌ధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ, జ‌న‌సేన‌తోపాటు.. జాతీయ పార్టీలైన సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్‌, బీజేపీలు ప్ర‌ధానంగా చ‌క్రం తిప్పుతున్నాయి. అయితే.. ఇవే కాకుండా.. మ‌రికొన్ని కొత్త‌పార్టీలు తెర‌మీదికి వ‌చ్చాయి. జైభారత్ నేష‌న‌ల్ పార్టీ, జైభార‌త్ భీం రావ్ పార్టీ, భార‌తీయ చైత‌న్య యువ‌జ‌న పార్టీ, ప్ర‌జాశాంతి, ఆమ్ ఆద్మీ పార్టీ, బీఎస్పీ, రాయ‌ల‌సీమ హ‌క్కుల పార్టీ(ఆర్ ఎస్ ఆర్ పీ), లోక్‌స‌త్తా పార్టీ వంటివి ఉన్నాయి.

దీంతో టికెట్ రాని వారు.. పోటీ చేయాల‌ని అనుకుంటున్న‌వారు.. ఈ పార్టీలవైపు చూస్తున్నారు. ఆ పార్టీలు కూడావ‌చ్చిన వారిని వ‌చ్చిన‌ట్టు పార్ట‌ల్లోకి తీసుకుంటున్నాయి. దీంతో అభ్య‌ర్థులు కూడా త‌మ‌కు అనూహ్య ప్ర‌చారం వ‌స్తుంద‌ని.. అదేవిదంగా ఖ‌ర్చు కూడా త‌గ్గుతుంద‌ని లెక్క‌లు వేసుకుంటుండ‌డంతో ఇండిపెండెంట్లుగా బ‌రిలోకి దిగుతున్న వారి సంఖ్య నానాటికీ త‌గ్గుతుండ‌డం గ‌మ‌నార్హం.