Begin typing your search above and press return to search.

ఏపీలో అన్ని పార్టీలూ ఎన్డీయేలో నేనా ?

ఏపీలో అన్ని పార్టీలూ ఎన్డీయేలోనే ఉన్నాయని అంటున్నారు. గత పదేళ్ళుగా ఇదే పొలిటికల్ సినారియో ఉంది

By:  Tupaki Desk   |   26 Jun 2024 12:39 AM GMT
ఏపీలో అన్ని పార్టీలూ ఎన్డీయేలో నేనా ?
X

ఏపీలో అన్ని పార్టీలూ ఎన్డీయేలోనే ఉన్నాయని అంటున్నారు. గత పదేళ్ళుగా ఇదే పొలిటికల్ సినారియో ఉంది. ఇపుడు కూడా అలాగే ఉంది అని అంటున్నారు. కాకపోతే అధికారంలో ఉన్న వైసీపీ ప్రతిపక్షంలోకి వచ్చింది. ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ అధికారంలోకి వచ్చింది అంతే తేడా అని అంటున్నారు.

లోక్ సభ స్పీకర్ కి ఎన్నిక బుధవారం జరుగుతున్న నేపధ్యంలో వైసీపీ తన నిర్ణయాన్ని ప్రకటించినట్లుగా ప్రచారం సాగుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే నిలబెట్టిన లోక్ సభ అభ్యర్థి ఓం బిర్లాకు మద్దతు ఇవ్వడానికి వైసీపీ నిర్ణయం తీసుకుందని అంటున్నారు.

ఈ మేరకు బీజేపీ వర్గాలు వైసీపీ అధినాయకత్వాన్ని సంప్రదించాయని తెలుస్తోంది. దానికి వైసీపీ నుంచి సుముఖత వ్యక్తం అయింది అని అంటున్నారు. దాంతో లోక్ సభలో ఎన్డీయే బలం ఏకంగా 297కి పెరిగింది. నలుగురు వైసీపీ ఎంపీల మద్దతుతోనే ఈ స్కోర్ పెరిగింది అన్న మాట.

ఏపీ నుంచి చూస్తే పాతిక మంది ఎంపీలు గెలిచారు. అందులో ఎన్డీయే కూటమి నుంచి 21 మంది గెలిస్తే వైసీపీ నుంచి నలుగురు గెలిచారు. ఇపుడు పాతిక మంది కూడా ఎన్డీయేలో ఉన్నట్లుగా తేలింది. బీజేపీకి సౌత్ లో బలం చూస్తే గట్టిగా ఎక్కడా లేదు. నార్త్ లో కొన్ని స్టేట్స్ లో బీజేపీకి పాతిక మంది ఎంపీల బలం ఉండవచ్చు. కానీ సౌత్ లో ఒక స్టేట్ లో మొత్తానికి మొత్తం ఎంపీల మద్దతు ఈ విధంగా లభించడం అంటే అది ఎన్డీయే చేసుకున్న పుణ్యమనే చెప్పాలి.

మరి ఎన్డీయేకు మద్దతు ఇస్తున్న పార్టీలు ఏపీకి ఏమి న్యాయం చేస్తున్నాయని అంతా ప్రశ్నిస్తున్నారు. బీజేపీకి ఈ రోజున కేంద్రంలో సొంత బలం లేదు దాంతో ఏపీ నుంచే పాతిక మంది ఎంపీలు కొమ్ము కాసే పరిస్థితి ఉంది. మరి ఈ పాతిక మంది ఎంపీలు ఒక్క మాట మీద నిలబడి ప్రత్యేక హోదా అలాగే పోలవరానికి నిధులు రాజధానికి భారీ మొత్తంలో నిధులు తేవచ్చు కదా అని అయిదు కోట్ల మంది ప్రజలు కోరుతున్నారు. అంతే కాదు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపడం విభజన హామీలను నెరవేర్చేలా చూడడం చేస్తే ఎన్డీయేకు మద్దతు ఎంతలా ఇచ్చినా జనాల నుంచి ఏ రకంగానూ ఇబ్బంది ఉండదని అంటున్నారు.

అలా కాకుండా ఎన్డీయేకు మద్దతు ఇవ్వడం అన్నది ఎవరికి వారుగా తమ రాజకీయ కోణాలలోనే చూసుకుంటే మాత్రం రాష్ట్రం దాని ప్రగతి పక్కకు పోతాయనే చెప్పాలి. ఇక్కడ రాజకీయ తమాషా ఏంటి అంటే ఏపీలోని పాతిక ఎంపీల మద్దతు చూసుకునే ఎన్డీయే లోక్ సభ స్పీకర్ పదవికి పోటీ అయినా మరే బిల్లులకు అయినా సిద్దపడుతోందని అంటున్నారు.

ఇక ఎన్డీయే పెద్దలు లాంచనంగా మద్దతు ఇవ్వాలని కోరుతారు. కానీ ఏ కండిషన్ లేకుండా ఇస్తున్నమని చెప్పడమేంటని కూడా వైసీపీ సహా ఇతర పక్షాల మీద విమర్శలు వస్తున్నాయి. ఏది ఏమైనా ఏపీలో ప్రజల తీర్పు మారింది కానీ రాజకీయ పార్టీల తీరు అయితే ఎక్కడా మారలేదు అని అంటున్నారు.