Begin typing your search above and press return to search.

పేర్ల మార్పులో టీడీపీకి జనసేనకు పేచీ!?

ఎన్నికల వరకే రాజకీయాలను పరిమితం చేసి గెలిచిన తరువాత మొత్తం అందరికీ బాధ్యత వహించేదే ప్రభుత్వం

By:  Tupaki Desk   |   29 Jun 2024 2:30 AM GMT
పేర్ల మార్పులో టీడీపీకి జనసేనకు పేచీ!?
X

ప్రభుత్వం అంటే రంగు రుచి వాసన లేనిది అని అర్ధం. అంటే దానికి రాజకీయాలు ఉండకూడదు, పార్టీ జెండాలు అజెండాలు అసలు ఉండకూడదు, అది అందరిదీ అన్న భావన కలగాలి. ఎన్నికల వరకే రాజకీయాలను పరిమితం చేసి గెలిచిన తరువాత మొత్తం అందరికీ బాధ్యత వహించేదే ప్రభుత్వం. ప్రభుత్వం చేసే పాలనలో ఓడిన పక్షం కూడా పాలితులురాలిగా ఉంటుంది అన్నది మరవరాదు.

అంటే ఒక పార్టీకి ఓటేసినా మరో పార్టీ అధికారంలోకి వచ్చినపుడు ఆ పౌరుడు తనకు ఉన్న అన్ని రకాలైన ప్రభుత్వ ప్రయోజనాలకు పొందేందుకు అర్హుడు. అదే అసలైన డెమోక్రసీ. అలాంటపుడు ఆ ప్రభుత్వం తన రాజకీయ రంగును చాటుకునేలా పాలన చేస్తే అపుడు వేరే పార్టీని అభిమానించే వారి మనోభావాలు దెబ్బ తిన్నట్లుగానే ఉంటాయి.

కానీ భారతదేశంలో మాత్రం ఏ రాజకీయ పార్టీ అధికారం చేపట్టినా కూడా తన పార్టీ ఫిలాసఫీని అమలు చేయడానికి చూడడం గత ఏడున్నర పదుల స్వతంత్ర భారత దేశంలో సాగుతూనే ఉంది. తొలి పాలకుల నుంచి ఇది అలాగే ఉంది. ప్రజలు తమను ఎన్నుకుంది కేవలం అయిదేళ్లకు మాత్రమే అని ప్రభుత్వాలు శాశ్వతమని తమ రాజకీయాలు అవతల పెట్టి ప్రభుత్వం లోకి రావాలని ఏ రాజకీయ పార్టీ తలవకపోవడం బాధాకరమే.

ఇక ఏపీ లాంటి చోట్ల చూస్తే ఏకంగా ప్రజలు పన్ను గట్టి ఖజనాకు చేరిన సొమ్ముతో ఇచ్చే పధకాలకు దర్జాగా తమ పార్టీ పూర్వ నాయకుల పేర్లు, తమ పార్టీ గుర్తుకు వచ్చేలా పేర్లూ పెట్టుకోవడం ఎక్కువ అయిపోవడం కాదు ఈ ప్రచార యావ పీక్స్ కి చేరింది. గత ప్రభుత్వంలో జగన్ బొమ్మ ప్రతీ పధకం మీద ఉంది. అలానే పదుల సంఖ్యలో పధకాలకు జగనన్న పేర్లు వినిపించాయి, కనిపించాయి. అనేక చోట్ల దివంగత నేత వైఎస్సార్ పేరు కూడా పెట్టిన పరిస్థితి ఉంది.

ఇపుడు ప్రభుత్వం మారింది, ఆయా పధకాల పేర్లను మార్పు చేస్తున్నారు. చేయాలి కూడా. కానీ అలా మార్చిన వాటికి తమ పార్టీ గుర్తుకు వచ్చేలా పేర్లు పెట్టుకోవడం మొదలైంది. ఇది మొదటిసారి కానే కాదు, 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు ఇలాగే చేసింది.

అయితే ఈసారి కూటమి ప్రభుత్వం ఉంది. జనసేన కీలకంగా ఉంది. దాంతో పధకాల పేర్ల విషయంలో టీడీపీ జనసేనల మధ్యన పేచీ వస్తోందని అంటున్నారు. నిజానికి కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ముందుగా పధకాల పేర్లనే పెద్ద ఎత్తున మార్చుకుంటూ పోతున్నారు. అది ఒక భారీ కార్యక్రమంగా సాగుతోంది.

ఇక 2014 నుంచి 2019 దాకా ప్రతీ పధకం మీద చంద్రన్న రామన్న పేర్లు ఉండేవి, చంద్రన్న సంక్రాంతి కానుక పెళ్లి కానుక తోఫా ఇలా అనేక పధకాలు ఉండేవి, ఎన్టీఆర్ భరోసా అని కూడా ఆనాడు ఉండేది. ఇపుడు కూడా ఆ పధకాలను పేర్లను అవే పెడుతున్నారు.

ఇపుడు చూస్తే కూటమిలో జనసేన బీజేపీ కూడా చేరింది. దాంతో వారికి కూడా పధకాల విషయంలో ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందని అంటున్నారు. దాంతో సరికొత్త పేచీగా ఇది మారుతోందని అంటున్నారు. పైగా అన్నింటికీ చంద్రన్న ఎన్టీఆర్ పేర్లు మాత్రమే పెడితే కుదరదు అని అంటున్నారు.

ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయమే తీసుకుంటే ఆయన ఎపుడూ తమ పేర్లు పధకాలకు పెట్టుకోవాలని కోరరు. దేశంలో ఎంతో మంది ప్రముఖులు ఉన్నారు. మరణించినా ప్రజల గుండెలలో చిరస్థాయిగా ఉన్న వారు ఉన్నారు. వారందరి పేర్లూ పెట్టాలని పవన్ కోరుతూ ఉంటారు. ఆయన అనేక సభలలో ఇదే చెప్పారు ప్రజల సొమ్ముతో ఇచ్చే పధకాలకు అధినాయకుల పేర్లు ఏమిటి అని ఆయన గత వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీశారు కూడా.

బీజేపీ విషయం తీసుకుంటే ఆధ్యాత్మికంగా ఉండే పేర్లను ఆ పార్టీ ఇష్టపడుతుంది. లేదా పండిట్ దీన్ దయాళ్ వంటి తమ పార్టీ వారి పేర్లను సూచిస్తుంది. ఏది ఏమైనా పేర్లు కాదు పధకాలు ప్రజలకు అందాలి, అవి మన్నన పొందాలి. జనాలకు ఆనందం కలగాలి. అదే విధంగా ముందే చెప్పుకున్నట్లుగా ప్రభుత్వం అంటే ఏ రాజకీయ రంగూ లేనిదిగా ఉండాలి. చంద్రబాబు ప్రభుత్వం జగన్ ప్రభుత్వం అని రాయడం కూడా తప్పే అని అంటున్నారు. అది మీడియా సృష్టించిన పదజాలం రాష్ట్ర ప్రభుత్వమని రాయడమే సబబు. మరి ఈ విధంగా ఉన్నత విలువలతో రాజకీయం నడిపే రోజులు ఎపుడు వస్తాయో అన్నదే ప్రజాస్వామ్య ప్రియుల ఆలోచనగా ఉంది.