Begin typing your search above and press return to search.

ఏపీకి శాపం.. క‌లిసి రాని పార్టీలు!!

వాస్త‌వానికి త‌మిళ‌నాడులో రాజ‌కీయ పార్టీల‌కు ఉన్న ఈక‌ట్టుబాటు.. ఇప్ప‌టిది కాదు. గ‌తంలో క‌రుణానిధి, జ‌య‌ల‌లిత‌ల నుంచి ఉన్న‌దే

By:  Tupaki Desk   |   21 July 2024 1:30 PM GMT
ఏపీకి శాపం.. క‌లిసి రాని పార్టీలు!!
X

సోమ‌వారం నుంచి పార్ల‌మెంటు స‌మావేశాలు ప్రారంభ‌మ‌వుతున్నాయి. ఈ క్ర‌మంలో రాష్ట్రానికి ఏం కావాలి? కేంద్రాన్ని ఏయే అంశాల‌పై ఒప్పించాలి? ఇప్ప‌టికిప్పుడు త‌క్ష‌ణ అవ‌స‌రం కింద‌.. కేంద్రం నుంచి తీసుకురావాల్సిన‌వి ఏంటి? అనే విష‌యాల‌పై త‌మిళ‌నాడులో చ‌ర్చ జ‌రిగింది. గ‌త రెండు రోజుల కింద‌ట‌.. బ‌ద్ధ‌శ‌త్రువులే అయినా.. డీఎంకే.. అన్నాడీఎంకే.. ఆఖ‌రికి బీజేపీ ఎంపీలు కూడా.. క‌లుసుకుని చ‌ర్చించుకున్నారు. దీనికి ఆ మూడు పార్టీల నాయ‌కులు కూడా హాజ‌ర‌య్యారు. ఉమ్మ‌డి అజెండాలో కొన్ని అంశాల‌ను చ‌ర్చించి.. తీర్మానం చేసుకున్నారు. ఈ అంశాల‌పై కేంద్రాన్నిఒప్పించాల‌ని భావించారు. దీనికి త‌గిన విధంగా సోమ‌వారం.. నుంచి ప్రారంభ‌మ‌య్యే స‌భ‌ల్లో వారు త‌మ వాణిని వినిపించ‌నున్నారు.

వాస్త‌వానికి త‌మిళ‌నాడులో రాజ‌కీయ పార్టీల‌కు ఉన్న ఈక‌ట్టుబాటు.. ఇప్ప‌టిది కాదు. గ‌తంలో క‌రుణానిధి, జ‌య‌ల‌లిత‌ల నుంచి ఉన్న‌దే. అప్ప‌ట్లోనూ కేంద్రాన్ని ప్ర‌శ్నించాల్సి వ‌స్తే.. క‌లిసి ప్ర‌శ్నించేవారు. కేంద్రం నుంచి ఏదైనా సాధించాల్సి వ‌స్తే.. క‌లిసి అడిగేవా రు. రాష్ట్రంలో మాత్రం రాజ‌కీయాలు చేసుకునేవారు. అంటే.. ఢిల్లీ ద‌గ్గ‌ర మాత్రం క‌ల‌సి క‌ట్టుగానే ముందుకు సాగారు. ఈ ప‌రిస్థితి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ లేవు. మ‌రీముఖ్యంగా ఏపీలో అయితే అస‌లే లేవు. ఇక్క‌డ ఇంకో చిత్ర‌మైన ప‌రిస్థితి ఉంది. ఏపీలో 2014 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు(మ‌ధ్య‌లో ఆరేడు మాసాలు 2019 ఎన్నిక‌ల‌కుముందు) ప్రాంతీయ పార్టీలుగా ఉన్న టీడీపీ, వైసీపీ.. కేంద్రంలోని బీజేపీకి.. ముఖ్యంగా మోడీకి మ‌ద్ద‌తిస్తున్నాయి.

టీడీపీ ప్ర‌త్య‌క్షంగా మ‌ద్ద‌తిస్తే.. వైసీపీ ప‌రోక్షంగా మ‌ద్ద‌తిస్తోంది. ఇటీవ‌ల స్పీక‌ర్ ఎన్నిక వ‌చ్చిన‌ప్పుడు కూడా.. వైసీపీ త‌న‌కున్న న‌లుగురు ఎమ్మెల్యేల‌తోనూ.. మోడీకి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది. ఇక‌, బిల్లుల విష‌యంలోనూ ఇరు పార్టీలూ అంతే. కానీ, ఏపీ అంశాల‌పై కేంద్రాన్ని ఒప్పించి.. మెప్పించి.. సాధించే విష‌యంలో మాత్రం ఈ రెండు పార్టీలూ.. క‌డుదూరంగా ఉండిపోతున్నాయి. ఒక‌రిపై ఒక‌రు క‌త్తులు నూరుతున్నాయి. తాజాగా సోమ‌వారం నుంచి ప్రారంభం అవుతున్న పార్ల‌మెంటు స‌మావేశాల విష‌యాన్ని తీసుకున్నా.. ఎవ‌రి దారి వారిదే అన్న‌ట్టుగా టీడీపీ-వైసీపీలు వ్య‌వ‌హ‌రిస్తున్నాయి.

వైసీపీ... ఏపీలో జ‌రుగుతున్న హ‌త్యారాజ‌కీయాలు, విధ్వంసాల‌ను(ఆ పార్టీ చెబుతున్న‌ట్టు) పార్ల‌మెంటులో చ‌ర్చించాల‌ని నిర్ణయించింది. ఈ విష‌యాన్ని పార్టీ ఎంపీలు.. 15 మందికి(లోక్‌స‌భ 4, రాజ్య‌స‌భ 11) జ‌గ‌న్ నూరిపోశారు. ఇక‌, తానే స్వ‌యంగా ఈ నెల 24న ఢిల్లీ వెళ్లి రాష్ట్ర రాజకీయాల‌పై ఉద్య‌మించ‌నున్నారు. మ‌రోవైపు.. చంద్ర‌బాబు త‌న పార్టీ ఎంపీల‌కు నిధులు తీసుకురా వాల‌ని, కేంద్ర ప‌థ‌కాల‌ను తీసుకురావాల‌ని చెప్పారు. ఇలా.. ఒక‌రు రాష్ట్ర అంశాల‌ను, మ‌రొక‌రు నిధుల అంశాల‌ను ప్ర‌స్తావించ డం ద్వారా.. క‌లివిడి త‌నం క‌నుమ‌రుగై.. కేంద్రం ముందు..ఏపీ ఒంట‌రిగా నిల‌బ‌డుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. అందుకే.. ఏపీకి శాపంగా.. పార్టీలు మారాయ‌నే వాద‌న వినిపిస్తోంది.