ఏపీలో ఏ పార్టీ గెలుస్తుంది... బీజేపీ దగ్గర సర్వే నివేదిక...?
ఏపీలో వచ్చే ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ గెలుస్తుంది, ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు అన్న దాని మీద బీజేపీ పెద్దల వద్ద సర్వే నివేదిక ఉందని ప్రచారం సాగుతోంది.
By: Tupaki Desk | 7 Sep 2023 3:22 AM GMTఏపీలో వచ్చే ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ గెలుస్తుంది, ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు అన్న దాని మీద బీజేపీ పెద్దల వద్ద సర్వే నివేదిక ఉందని ప్రచారం సాగుతోంది. ఎప్పటికపుడు కొందరు ముఖ్యులు ఏపీలోని రాజకీయ పరిస్థితుల మీద సర్వేలు చేయిస్తూ దానిని బీజేపీ పెద్దలకు అందిస్తున్నారు అని చెబుతున్నారు.
దీని వల్ల ఏపీలో బీజేపీ రూట్ మ్యాప్ ని రెడీ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అని అంటున్నారు. ఇదిలా ఉంటే లేటెస్ట్ గా చేసిన సర్వేలో వైసీపీకే ఆధిక్యం ఏపీలో ఉందని అంటున్నారు. ఏపీలో ఈ రోజుకీ 53 శాతానికి పైగా ఓటింగ్ వైసీపీ వైపు ఉందని అంటున్నారు. అలాగ 18 ఎంపీ సీట్లకు తక్కువ కాకుండా వైసీపీకి వస్తాయని కూడా ఆ సర్వే నివేదికలో తేలిందని అంటున్నారు.
దాంతోనే ఏపీలో పొత్తుల విషయంలో బీజేపీ ఎలాంటి తొందర పడడం లేదని అంటున్నారు. ఏపీలో ఎన్నికలు జరగడానికి ఇంకా ఏడెనిమిది నెలల సమయం ఉంది. అప్పటిదాకా పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలని అంటున్నారు. అలాగే రాజకీయంగా చూస్తే విపక్షాలు పూర్తి స్థాయిలో గ్రిప్ ని సాధించలేకపోతున్నాయని అంటున్నారు.
వైసీపీ విజయానికి కారణం ఆ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలే అని అంటున్నారు. అదే సమయంలో దాన్ని ఓడిసి పట్టుకుని తెలుగుదేశం పార్టీ కూడా రెట్టింపు సంక్షేమం అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నా అనుకున్న స్థాయిలో స్పందన రావడం లేదని అంటున్నారు. మరో వైపు చూస్తే వైసీపీ పూర్తిగా సంక్షేమాన్నే నమ్ముకుంది. ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అయితే నేను చేసిన మంచి మీ ఇంట్లో కనిపిస్తేనే ఓటేయండి అని డేరింగ్ గానే జనాలను అడుగుతున్నారు.
ప్రత్యక్ష నగదు బదిలీ కింద ప్రతీ ఇంటికీ లక్షల రూపాయల లబ్ది అయితే జరిగింది. ఇక విపక్షాలు ఇంతకు మించి లబ్ది ఇస్తామని అంటున్నా ప్రస్తుతం జరుగుతున్న దాన్ని వదిలేసి జనాలు కొత్త మోజులో పడతారా అన్నది ఈ రోజుకు అయితే సందేహమే. దాని కంటే ముందు మరోటి కూడా జనాలు చూస్తున్నారు అని అంటున్నారు. అదేంటి అంటే 2014 నుంచి 2019 దాకా ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం నాడే ఎందుకు సంక్షేమ పధకాలు ఈ తరహాలో అమలు చేయలేదన్న ప్రశ్న వస్తోంది.
వైసీపీ చేస్తే మేము చేస్తామని చెప్పడం కాదు టీడీపీకి ఆ ఆలోచన మొదటే ఎందుకు రాలేదన్న దాని మీద కూడా జనాలకు సందేహాలు ఉన్నాయని అంటున్నారు. మరో వైపు చూస్తే వాలంటరీ వ్యవస్థ మీద కూడా విపక్షాల విమర్శలు వారికే చేటు తెస్తున్నాయని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే ఏపీలో గ్రామీణ ప్రాంతాల ప్రజల వద్దకు పాలన చేరువ అయింది అన్న దాని మీద అంతా ఏకీభవిస్తున్నారు.
ఈ నేపధ్యంలో వైసీపీకి ఇవన్నీ ప్లస్ అవుతున్నాయని అంటున్నారు. ఇక పొత్తుల విషయం తీసుకుంటే 2014 నాటి పరిస్థితులు 2024లో ఉంటాయా అన్నది కూడా బీజేపీ ఆలోచిస్తున్న విషయంగా ఉంది అంటున్నారు. 2024లో కేంద్రంలో మూడవసారి అధికారంలోకి రావాలని బీజేపీ తపన తాపత్రయంగా ఉంది. అందువల్ల ఆ పార్టీకి ఏపీలో ఉన్న ఎంపీ సీట్లు ముఖ్యం. అదే టైం లో తమకు నమ్మకమైన మిత్రుడు కూడా ఉండాలని కోరుకుంటోంది.
ఈ కారణంతోనే టీడీపీ పొత్తుల విషయంలో పెద్దగా రియాక్ట్ కావడంలేదు అని అంటున్నారు. రేపటి రోజున వైసీపీకి ఎక్కువ ఎంపీ సీట్లు వస్తే టీడీపీతో పొత్తులో బీజేపీ ఉంటే వైసీపీ నుంచి మద్దతు కోరలేమని కూడా భావిస్తూ పొత్తుల విషయంలో అనేక రకాలుగా ఆలోచిస్తోంది అని అంటున్నారు.
ఏది ఏమైనా ఏపీ వరకూ చూసుకుంటే బీజేపీ న్యూట్రల్ గా ఉండడమే బెటర్ అన్న ఆలోచనకు రావచ్చు అంటున్నారు. ఆ విధంగా చేయడం వల్ల మొత్తానికి మొత్తం పాతిక ఎంపీ సీట్ల నుంచి కూడా పూర్తి మద్దతు తనకే దక్కేలా చూసుకోవడం అన్న ప్లాన్ ఉందని అంటున్నారు. సో సర్వేలు వైసీపీకి అనుకూలంగా వస్తూండటం, బీజేపీకి ఏపీ మద్దతు అవసరం కావడంతోనే పొత్తుల విషయంలో రియాక్ట్ కావడంలేదు అని అంటున్నారు. చూడాలి మరి బీజేపీ తీరు ఏపీ రాజకీయాలలో ఏ రకమైన మార్పుని తీసుకుని వస్తుందో.