ఏపీ రాజకీయం: ఆగంతకులు - అధికార సూత్రాలు..!
అయితే.. తాజాగా విగ్రహం పాదాల చివరన ఏర్పాటు చేసిన జగన్ పేరును కొందరు తొలగించారు. దీనిని వైసీపీ తీవ్రంగా తీసుకుంటే.. కూటమి సర్కారు అత్యంత లైట్ తీసుకుంది.
By: Tupaki Desk | 11 Aug 2024 3:53 AM GMTఒకనాడు టీడీపీ.. ఇప్పుడు వైసీపీ. రేపు మళ్లీ టీడీపీ కాదని ఎవరూ చెప్పలేరు. ప్రజామోదం, ప్రజాభీష్టం పరమావధిగానే రాజకీయాలు మారుతున్నాయి. అదికార మార్పిడి కూడా జరుగుతోంది. ఈ సూత్రాన్ని కూటమి పాలకులు మరిచిపోతున్నారా? లేక, గతంలో జగన్ అనుకున్నట్టుగా తమదే 30 ఏళ్ల రాజ్యమని భావిస్తున్నారో తెలియదు. వారు చెబుతున్న మాటలు.. చేస్తున్న వ్యాఖ్యలు కూడా ఆశ్చర్యంగా ఉంటున్నాయి. విజయవాడలో జరిగిన ఘటన తర్వాత.. ఈ అనుమానాలు మరిన్ని పెరుగుతున్నాయి.
విజయవాడ నడిబొడ్డున ఉన్న పీడబ్ల్యూడీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎనలేని పేరు వచ్చిన విషయం తెలిసిందే. దీని వల్ల కార్పొరేషన్‌కు కూడా మంచి పేరు వచ్చిం ది. ఆదాయం కూడా వస్తోంది. ప్రస్తుతం జరిగింది... 50 శాతం నిర్మాణమే.. ఇంకా నిర్మాణం జరగాల్సి ఉంది. సగం నిర్మాణానికే నెలకు 10 లక్షలకు పైగా నగర పాలక సంస్థకు ఆదాయం సమకూరుతోంది. దీనిని ఎవరు నిర్మించారనే విషయాన్ని పక్కన పెడితే.. అభివృద్ధి ఎవరు చేసినా.. హర్షించాల్సిందే.
అయితే.. తాజాగా విగ్రహం పాదాల చివరన ఏర్పాటు చేసిన జగన్ పేరును కొందరు తొలగించారు. దీనిని వైసీపీ తీవ్రంగా తీసుకుంటే.. కూటమి సర్కారు అత్యంత లైట్ తీసుకుంది. దీనికి ఆగంతకులు అని ముద్ర వేసింది. మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి నుంచి పలువురు టీడీపీ నాయకులు స్పంది స్తూ.. ఆగంతకులు ఏదో చేస్తే.. దీనిని కూటమి ప్రభుత్వానికి అంటగడతారా? అంటూ.. నిప్పులు చెరిగారు. నిజమే. చేసింది దారుణమే.. అని నర్మగర్భంగా ఒప్పుకొంటూనే ఆగంతకులు అనే ముద్ర వేశారు.
దీనిని ఎలా చూడాలి? అనేది ఇప్పుడు ప్రశ్న. ఎందుకంటే.. ఏ ప్రభుత్వం ఉన్నా.. ఆగంతకులు చేశారని తప్పించుకుంటే.. రేపు ఇదే పరిస్థితి కూటమి ప్రభుత్వానికి మాత్రం వర్తించదా? చేసిన దానిని ఖండించి, దీని వెనుక ఎవరున్నారనే విషయాన్ని వెలుగులోకి తీసుకువస్తామని చెప్పి ఉంటే వేరేగా ఉండేది. కానీ, దీనికి ఆగంతకులు అని ముద్రవేసి తప్పించుకుని, వైసీపీనే దోషిగా చిత్రీకరిస్తే.. ప్రజలంటూ ఉన్నారు. అన్నీ గమనిస్తున్నారన్న వాస్తవాన్ని మరిచిపోయినట్టే!
అంతగా జగన్ పేరును ఇష్టపడకపోతే.. తీసేసే అధికారం ప్రభుత్వానికి ఉంది. గతంలో ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరును జగన్ తీసేసి.. వైఎస్ పేరు పెట్టారు. దానిని కూటమి ప్రభుత్వం తీసేయలేదా? దీనికి అనుసరించిన మార్గాన్నే అనుసరించి ఉంటే పరిస్థితి వేరేగా ఉంది. కానీ, ఆగంతకుల పేరు చెప్పి.. నేడు వైసీపీ నోళ్లు మూయించవచ్చు. కానీ.. రేపు ప్రజల నోళ్లను మూయించలేరు కదా!!