ఏపీ రాజకీయం ఆంధ్రోళ్లను ఎక్కడకు తీసుకెళ్లనుంది?
కాకుంటే.. మన దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని ప్రత్యేక రాజకీయ వాతావరణం ఆంధ్రప్రదేశ్ లో నెలకొందని చెప్పాలి.
By: Tupaki Desk | 3 Jun 2024 4:30 AM GMTవాట్సాప్ లో ఈ మధ్యన ఒక చిట్టి వీడియో వైరల్ అయ్యింది. అందులో గ్రౌండ్ బయట ఉన్న ఒక ఔత్సాహికుడు.. గ్రౌండ్ లో ఉన్న ఆటగాళ్లు ఎలా ఆడాలో చెబుతూ చేసే విన్యాసాలను చూసినోళ్లందరు సరదాగా నవ్వేశారు. కొందరు మాత్రం.. ఈ వీడియో అచ్చం తమ మాదిరే ఉందనుకున్నోళ్లు ఉన్నారు. దేశం ఏదైనా కానీ రాజకీయ అంశాలు ప్రజల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ఇందుకు మన దేశం సైతం మినహాయింపు కాదు. కాకుంటే.. మన దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని ప్రత్యేక రాజకీయ వాతావరణం ఆంధ్రప్రదేశ్ లో నెలకొందని చెప్పాలి. ఇక్కడి రాజకీయాల పుణ్యమా అని రాజకీయ వైరం వ్యక్తిగత స్థాయికి వెళ్లిపోయింది.
దీని వల్ల రాజకీయ నాయకుల కంటే కూడా వ్యక్తుల మీద చూపే ప్రభావం ఎక్కువ. రాజకీయ వైరం ఒక మోతాదు వరకు ఉంటే సరిపోతుంది. కానీ.. దాని హద్దులు దాటేసి ఐదేళ్లు అవుతుంది. పొలిటికల్ పట్టు కోసం ఒక్కో అధినేత ఒక్కోలాంటి ఫార్మాలను ప్రయోగిస్తుంటారు. రాజకీయంగా వైరం కొంత మేర బాగానే ఉంటుంది.అయితే.. అదెప్పటికి వ్యక్తిగత స్థాయికి వెళ్లకూడదు. గతంలో సైద్ధాంతికంగా.. రాజకీయంగా ఎంత వైరం ఉన్నప్పటికీ.. హద్దులు దాటకుండా జాగ్రత్తలు తీసుకునే వారు.
గతంలో అసెంబ్లీ సమావేశాలు జరిగితే.. సభలో ఉన్నప్పుడు అధికార.. విపక్షాల మధ్య హాట్ హాట్ గా చర్చ సాగినప్పటికీ.. ఒకసారి సభ వాయిదా వేసిన తర్వాత.. ఇరు పార్టీల సభ్యులు కలిసి మెలిసి కులాసాగా కబుర్లు చెప్పుకోవటమే కాదు.. జోకులు వేసుకునేవారు. వారి తీరును చూసినోళ్లకు షాక్ తగిలేది. అప్పటివరకు అంతలా పోట్లాడుకొని.. సభ బయట ఇంత స్నేహపూర్వకంగా ఉండటమా? అన్న చర్చ జరిగేది.
ఆ రోజులున్నంత కాలం దాని విలువ తెలీలేదు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. సరదాగా మాట్లాడుకోవటం తర్వాత.. కనీసం బాగోగుల గురించి వాకబు చేసే పరిస్థితి లేదు. ఆ మాటకు వస్తే.. తన ప్రత్యర్థి నాశనం అయిపోవాలన్నట్లుగా ఆలోచిస్తున్న తీరు. ఇంతటి రాజకీయ వైరం మరో తెలుగురాష్ట్రమైన తెలంగాణలోనూ లేదు. ఒక్క ఏపీలోనే ఉంది. ఎన్నికలు జరిగాయి. ఫలితం మరో రోజులో రానుంది. ఇలాంటి వేళ.. ఏపీ ప్రజలంతా వచ్చే ఫలితం ఎలా ఉంటుంది? తాము కోరుకున్న వారికి అధికారం దక్కుతుందా? అన్న అంశంపై తీవ్రమైన టెన్షన్ తో ఉన్నారు.
ఇలాంటివేళలోనే ఇప్పుడు ఆలోచించుకోవాల్సిన విషయం మరొకటి ఉంది. రాజకీయాల్ని వ్యక్తిగత వైరం స్థాయికి తీసుకెళ్లిన ఆంధ్రా రాజకీయ నేతలు.. ఇకనైనా మారాల్సిన అవసరం ఉండదు. వైరం పెరిగే కొద్దీ అశాంతి పెరుగుతుంది. రాష్ట్ర ఇమేజ్ దెబ్బ తీస్తుంది. ప్రగతి కుంటుబడుతుంది. పగలు.. ప్రతీకారాలే తప్పించి ప్రశాంత వాతావరణం ఉండదు. విభజనలో భాగంగా రాజధాని కోల్పోయి పదేళ్లు అవుతుంది. పునాది రాయి.. కొన్ని కట్టడాలు తప్పించి ఇంకేమీ లేదు. ఆ మాటకు వస్తే ఏపీ రాజధాని ఏది? అంటే క్లారిటీ లేని పరిస్థితి.
ఇలాంటివేళలో.. రాజకీయాన్ని రాజకీయంగా చూడాలే తప్పించి.. ఆ రాజకీయంలో సమిధలుగా ప్రజలు మారకూడదు. అలాంటి పరిస్థితి ఏపీ ఇమేజ్ ను మాత్రమే కాదు భవిష్యత్తును కూడా దెబ్బ తీస్తుందన్నది మర్చిపోకూడదు. రాజకీయం ఉండాలి. అది ప్రజల భవితను మరింత సౌకర్యవంతంగా చేసేలా ఉండాలే తప్పించి.. వైరంతో పగలు.. ప్రతీకారాలతో రగిలిపోయేలా మాత్రం ఉండకూడదు. ప్రభుత్వాన్ని ఎవరైనా ఏర్పాటు చేయొచ్చు. కానీ.. ఈసారి కొలువు తీరే ప్రభుత్వం ఏదైనా సరే.. ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాతావరణాన్ని మార్చేలా.. స్నేహపూర్వకం వాతావరణం ఉండేలా చేయాలి. అందుకు రాజకీయ పార్టీలు కంకణబద్ధులై ఉండటం అత్యవసరం.