మెగా అభిమానులకు అర్థమవుతోందా?
అంతే కాక చిరు ఆ విమర్శ చేయగానే.. భోళా శంకర్ టికెట్ల ధరలు పెంపు దరఖాస్తున్న పక్కన పడేయించారు.
By: Tupaki Desk | 10 Aug 2023 5:30 AM GMTమెగా అభిమానులు గత కొన్నేళ్లలో కొన్ని వర్గాలుగా విడిపోయిన మాట వాస్తవం. ఫ్యామిలీలో అందరు హీరోలనూ అభిమానించే వర్గం చిన్నదైపోగా.. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్‌లను మాత్రమే అభిమానించేవాళ్లు అని... అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని.. ఇలా వర్గాలు అయిపోయాయి. చివరికి చిరు, పవన్ ఫ్యాన్స్ మధ్య కూడా కొంత అంతరాలు వచ్చాయంటే అతిశయోక్తి కాదు. చిరును మాత్రమే అభిమానిస్తూ పవన్‌ను వ్యతిరేకించే వాళ్లు.. జనసేన పార్టీకి మద్దతు ఇవ్వని వాళ్లు కూడా ఉన్నారు.
అలాంటి వాళ్లలో కొంతమేర వైసీపీ పట్ల సానుకూలంగా లేకపోలేదు. అందుక్కారణం.. చిరు, జగన్‌ల మధ్య పరస్పర గౌరవం ఉందని.. చిరు పట్ల జగన్ సానుకూలంగా కనిపిస్తారనే అభిప్రాయం ఉండటమే.
కానీ టికెట్ల ధరల సమస్య తలెత్తినపుడు జగన్ ముందు చిరు చేతులు జోడించి వేడుకోవడం.. కనీసం జగన్ ఆయన్ని ఆపే ప్రయత్నం చేయకపోవడం, నమస్కారానికి ప్రతినమస్కారం కూడా చేయకపోవడం చూసి చాలామంది కలత చెందారు.
కానీ ఈ పరిణామం తర్వాత కూడా జగన్ పట్ల సానుకూలంగా వ్యవహరించిన మెగా అభిమానులు కొందరు లేకపోలేదు. కానీ తాజాగా ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చిరు.. ఒక చిన్న విమర్శ చేసేసరికి వైసీపీ వాళ్లు అస్సలు తట్టుకోలేకపోయారు. చిరు మీద తీవ్రాతి తీవ్రమైన స్థాయిలో దాడి చేశారు.
ఇంతకుముందు పవన్‌ను టార్గెట్ చేస్తూనే చిరును మాత్రం పొగుడుతూ.. ఆయన అభిమానులను ఆకట్టుకోవడానికి ప్రయత్నించిన వైసీపీ నేతలు.. ఇప్పుడు మాత్రం చిరును దారుణమైన మాటలు అంటున్నారు. అంతే కాక చిరు ఆ విమర్శ చేయగానే.. భోళా శంకర్ టికెట్ల ధరలు పెంపు దరఖాస్తున్న పక్కన పడేయించారు.
దీన్ని బట్టి చిరు మీద ఇప్పటిదాకా వైసీపీ నేతలు చూపించింది కపట ప్రేమ అని.. చిన్న తేడా వచ్చినా ఎదురు దాడి తీవ్రంగా ఉంటుందని మెగా అభిమానులు అర్థం చేసుకునే ఉంటారు. దీన్ని అనుసరించే వైసీపీ విషయంలో ఎలా వ్యవహరించాలో మెగా అభిమానులు ఒక నిర్ణయానికి వస్తారనడంలో సందేహం లేదు.