Begin typing your search above and press return to search.

పోస్ట్ పోల్ సీన్ : లెక్కలు పక్కాగా ఉన్నాయట..!

పోలింగ్ పూర్తి అయింది. కౌంటింగ్ కి టైం ఉంది. దాంతో భారీ ఎత్తున జరిగిన పోలింగ్ ఎవరికి మేలు ఎవరికి చేటు అన్న చర్చ ఒక వైపు సాగుతోంది

By:  Tupaki Desk   |   14 May 2024 12:56 PM GMT
పోస్ట్ పోల్ సీన్  : లెక్కలు పక్కాగా ఉన్నాయట..!
X

పోలింగ్ పూర్తి అయింది. కౌంటింగ్ కి టైం ఉంది. దాంతో భారీ ఎత్తున జరిగిన పోలింగ్ ఎవరికి మేలు ఎవరికి చేటు అన్న చర్చ ఒక వైపు సాగుతోంది. ఇక రాజకీయ పార్టీల అధినేతలు కీలక నేతలతో పాటు ఆయా సీట్లలో పోటీ చేసిన అభ్యర్ధులు లెక్కలు చూసుకునే పనిలో పడ్డారు.

తమకు పట్టున్న సెగ్మెంట్లలో ఓటింగ్ ఎలా సాగింది. తమకు బలం తక్కువగా ఉన్నవి వీక్ అయిన చోట పోలింగ్ ఏ విధంగా సాగింది అన్న విశ్లేషణలు చేస్తున్నారు. ప్రతీ చోటా అభ్యర్థులు తమకు గెలుపు దారులు ఉన్నాయా అని వెతుకులాటలో పడ్డారు. పైకి ఎన్ని మాటలు చెప్పినా పోలింగ్ సరళి మాత్రం ఎవరికీ అంతు పట్టడంలేదు. ఈసారి అనేక రకాలైన కొత్త సమీకరణలు జత కూడడంతో అభ్యర్ధులు తాము బయటపడతామా లేదా అని గ్రౌండ్ లెవెల్ లి వెళ్లి మరీ అధ్యయనం చేస్తున్నారు.

ఇక ప్రాంతాల వారీగా వైసీపీ టీడీపీలకు నాయకత్వం వహిస్తున్న సీనియర్లు తమ గెలుపు తో పాటు పర్టీ గెలుపుని కూడా అంచనా వేసే పనిలో పడ్డారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇపుడు లెక్కలు తెప్పించుకుంటున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎక్కడ పార్టీకి అనుకూలంగా ఉంది ఎక్కడ ఇబ్బంది గా ఉంది అని బేరీజు వేసుకునే పనిలో పడ్డారు.

పెద్దిరెడ్డి పుంగనూరు నుంచి పోటీ చేస్తే ఆయన కుమారుడు రాజంపేట నుంచి ఎంపీగా పోటీ చేశారు. ఇక పెద్దిరెడ్డి తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డి తంబళ్ళపల్లె నుంచి పోటీ చేశారు. ఇలా అనేక నియోజకవర్గాల నుంచి గ్రౌండ్ రిపోర్ట్ ని తెప్పించుకుంటున్నారు.

ఉత్తరాంధ్రా జిల్లాలలో పోస్ట్ పోల్ సీక్వెన్స్ మీద సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ తనదైన శైలిలో వాకబు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉత్తరాంధ్రాలో వైసీపీకే అనుకూలమైన పరిస్థితి ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ కూటమి ఎన్నో రకాలైన ఇబ్బందులకు గురి చేసిందని ఆయన అంటూ అయినా తాము వాటిని అధిగమించామని చెప్పారు. ఆఖరుకు తాను వైసీపీకి రాజీనామా చేసినట్లుగా ఫేక్ లెటర్ ని కూడా క్రియేట్ చేశారు అన్నారు.

ఇక దక్షిణ కోస్తా జిల్లాలో సీట్ల విషయంలో వైసీపీ ధీమా వ్యక్తం చేస్తోంది. నెల్లూరు పార్లమెంట్ పరిధిలో మొత్తం అసెంబ్లీ సీట్లను తాము గెలుచుకుంటామని సీనియర్ నేత విజయసాయిరెడ్డి చెబుతున్నారు. అలాగే గోదావరి జిల్లాలలో కూడా వైసీపీ నేతలు ప్లస్ మైనస్ లను మధింపు చేసుకుంటున్నారు.

మరో వైపు చూస్తే టీడీపీ సీనియర్ నేతలు కూడా తమ విజయాన్ని ఎవరూ ఆపలేరని చెబుతున్నారు. గ్రౌండ్ లెవెల్ రిపోర్టుల బట్టి చూస్తే ఏపీలో పాతికకు 24 ఎంపీ సీట్లు తమకు దక్కుతాయని అనకాపల్లి నుంచి కూటమి అభ్యర్ధిగా పోటీ చేసిన సీఎం రమేష్ ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో రాబోయేది టీడీపీ ప్రభుత్వం అని ఆయన అన్నారు.

అలాగే శ్రీకాకుళం విశాఖ రూరల్ జిల్లాలలో టీడీపీకి పూర్తి స్థాయిలో అనుకూలత కనిపించింది అని ఆ పార్టీకి చెందిన నేతలు చెబుతున్నారు. మహిళలు తమకే ఓటు వేసారని వారు అంటున్నారు. సూపర్ సిక్స్ పధకాలు జనంలోకి బలంగా వెళ్ళాయని అంటున్నారు. మొత్తం మీద గ్రౌండ్ రిపోర్టుని ఏ పార్టీకి ఆ పార్టీ తెప్పించుకుంటోంది. దానిని పూర్తిగా అధ్యయనం చేస్తోంది. క్షేత్ర స్థాయిలో బలంగా వీచిన వేవ్ తమకే అనుకూలంగా ఉందని చెబుతోంది. మరి అసలు ఫలితాలు ఎలా ఉంటాయో చూడాల్సిన అవసరం ఉంది.