100 కోట్లు... 40 కోట్లు పుంజులు దొరకడం లేదా...!?
ఈ విధంగా చూస్తే కనుక ఎంపీ టికెట్ కి వంద కోట్ల రూపాయలు పట్టుకోవాల్సిందే అంటున్నారు. అదే విధంగా ఎమ్మెల్యే టికెట్ కి 40 కోట్లు తీసి పక్కన పెట్టాల్సిందే అని అంటున్నారు.
By: Tupaki Desk | 16 Jan 2024 9:33 AM GMTరాజకీయాలు అన్నవి ప్రతీ ఎన్నికకూ అత్యంత ఖరీదు అయిపోతున్నాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలు వెరీ కాస్ట్ లీ గా మారితే అందులోనూ తెలంగాణా కంటే ఏపీలోనే ఎన్నికలు మరీ మనీ పవర్ తో సాగుతున్నాయని విశ్లేషణలు ఉన్నాయి.
ఏపీలో తొందరలోనే లోక్ సభతో పాటు అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ఈసారి ఎన్నికల్లో కులం బలం అన్నిటితో పాటుగా ధన బలం కూడా ప్రధాన అర్హతగా ఉంటోంది అని ప్రచారం సాగుతోంది. ఎవరు ఎక్కువ బరువుగా తూగుతారు అంటే వారికే టికెట్ అన్నట్లుగా పరిస్థితి ఉంది అని అంటున్నారు.
ఈ విధంగా చూస్తే కనుక ఎంపీ టికెట్ కి వంద కోట్ల రూపాయలు పట్టుకోవాల్సిందే అంటున్నారు. అదే విధంగా ఎమ్మెల్యే టికెట్ కి 40 కోట్లు తీసి పక్కన పెట్టాల్సిందే అని అంటున్నారు. ఇక ఇదే బేరంతోనే వైసీపీ టీడీపీలో లొల్లి స్టార్ట్ అయింది అని అంటున్నారు.
ఇలా ఒక బెంచ్ మార్క్ ని క్రియేట్ చేయడంతో ఎంపీ అభ్యర్ధులు అయితే రెండు ప్రధాన పార్టీలకు దొరకని పరిస్థితి ఉంది అని అంటున్నారు. ఎందుకంటే ఏకంగా వంద కోట్ల రూపాయలు తీయాలంటే ఆలోచించాల్సిందే అంటున్నారు.
అంతే కాదు ఎమ్మెల్యే సీట్ల విషయం తీసుకున్నా నలభై కోట్ల రూపాయలు ఒక్కో అభ్యర్ధి పెట్టాలంటే దానికి కూడా చాలా సీట్లలో అనుకున్న వారు ఎవరూ దొరకడంలేదు అని అంటున్నారు. ఏపీలో చూస్తే ఇదీ ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న రియల్ పొజిషన్ అని అంటున్నారు.
ఇక టీడీపీలో చూస్తే ఇంకా అభ్యర్ధులు ఎవరూ అన్నది తెలియడంలేదు. ఇప్పటిదాకా ఎవరినీ ప్రకటించలేదు. అదే విధంగా వైసీపీలో చూసుకున్నా ఇప్పటికి మూడు విడతలుగా అభ్యర్ధుల లిస్టులను రిలీజ్ చేశారు. ఇంకా నాలుగవ లిస్ట్ రిలీజ్ ఉంది.
అయితే ఇపుడు ప్రకటించిన వారే ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తారా అన్నది చివరి వరకూ తెలియదు అని అంటున్నారు. ఎందుకంటే బీ ఫారం ఇచ్చేవరకూ కూడా అది అంతు తెలియని కధలాగే సాగుతుంది అని అంటున్నారు. అంటే దీనిని బట్టి చూస్తే ఎన్నికలు ముంచుకు వస్తున్నా కూడా రాజకీయ పార్టీలు అభ్యర్థుల విషయంలో పెట్టిన ఈ ధన పరీక్షను తట్టుకుని ఎవరు ముందుకు వస్తారో వారికే టికెట్లు ఇద్దామని కూర్చున్నాయని అంటున్నారు.
ఇక చూస్తే ఈసారి ఎన్నికలు హోరాహోరీగా సాగుతాయి. మరి ఇంత పెద్ద ఎత్తున డబ్బు ముందు పెట్టి రాజకీయ జూదం ఆడినా గెలిచిన వాడు ఇంట్లో కూర్చుని ఏడవాలి. ఓడిన వాడు ఎటూ కౌంటింగ్ కేంద్రంలో ఏడ్చేందుకు చాన్స్ ఉంటుంది. ఈ మధ్యనే మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఒక మంచి మాట చెప్పారు. ఎన్నికలు ఖరీదుగా మారిపోయాయని, ఎన్నికల్లో పోటీ చేద్దామని ఉబలాటం పడిపోయి చివరికి తమ కుటుంబ సభ్యులకు అన్యాయం చేయవద్దని ఆయన కోరారు.
గెలిచినా కూడా ప్రాంతీయ పార్టీలలో ఉన్న సెంట్రలైజెడ్ పాలిటిక్స్ వల్ల ఎమ్మెల్యేలు అయినా ఎంపీలు అయినా ఉత్సవ విగ్రహాలుగానే మిగిలిపోతున్నారని, అయిదేళ్ళూ వారు చేసింది ఏమీ ఉండదని ఆయన తేల్చేశారు. వాస్తవం చూస్తే అలాగే ఉంది. అయిదేళ్ళ కాలం గిర్రున తిరిగి వచ్చేస్తోంది. కానీ అప్పు చేసో మరోటి చేసే తెచ్చిన రాజకీయ పెట్టుబడికి ఏ మాత్రం గిట్టుబాటు కాని రోజులు ఇవి అని అంటున్నారు.
ఏది ఏమైనా ఎన్నికలు ఇంత ఖరీదుగా మారిపోవడం ప్రజాస్వామ్యానికి మేలు చేసే విషయమేనా అన్న చర్చ వస్తోంది. ఇప్పటికి నలభై ఏళ్ల క్రితం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే అన్న గారు టీడీపీ పెట్టినపుడు చాలా మంది కొత్తవారికి టికెట్లు ఇచ్చారు. కేవలం ఆ రోజులల్లో పది వేల లోపే ఎమ్మెల్యేలు ఎంపీలుగా గెలిచేశారు. ఖర్చు కూడా చాలా పరిమితం. మరి అలాంటి రోజులు వస్తాయా అంటే చెప్పలేమనే చెప్పాల్సి ఉంటుంది.