Begin typing your search above and press return to search.

జగన్..బాబు...ఎవరినీ తొక్కేసేది లేదట ?

ఏపీలో ఇద్దరు ప్రత్యర్ధులు. దశాబ్దాల వైరం. అది రాజకీయంగా పీక్స్ కి చేరింది.

By:  Tupaki Desk   |   31 May 2024 3:38 AM GMT
జగన్..బాబు...ఎవరినీ తొక్కేసేది లేదట ?
X

ఏపీలో ఇద్దరు ప్రత్యర్ధులు. దశాబ్దాల వైరం. అది రాజకీయంగా పీక్స్ కి చేరింది. అదేదో పాత సినిమాలో రావు గోపాలరావు డైలాగు ఒకటి ఉంది ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలకూడదు అని. అలాంటి వైరమే ఏపీలో అటు వైసీపీ ఇటు టీడీపీల మధ్య సాగుతోంది. ఇది రాజకీయాలను మించినది. గత సంప్రదాయాన్ని పూర్తిగా ముంచినది.

ఏది ఏమైనా ఏపీలో ఒక చర్చ అయితే జోరుగా సాగుతోంది. ఏపీలో ఎవరు అధికారంలోకి వచ్చినా ప్రత్యర్థిని వెంటాడి వేటాడుతారు అని. అంటే జూన్ 4 తరువాత కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చిన వారు సైతం ప్రతీకార రాజకీయాలకు తెర తీస్తారు అని.

ఆ విధంగా ఏపీలో రావణ కాష్టం రాజకీయంగా అలా రగులుతూనే ఉంటుంది అని అంటున్నారు. అయితే ఈ రకమైన ఆలోచనలు తప్పు అనే వారూ ఉన్నారు. దానికి కారణం కేంద్ర రాజకీయాలు అని చెబుతున్నారు. ఏపీలో ఏమి చేయాలన్నా కేంద్రంలో బీజేపీ సహకారం కూడా కావాలి. మామూలుగా జరిగే గల్లీ తగవులు పక్కన పెడితే బిగ్ షాట్స్ గా ఉన్న చంద్రబాబుని కానీ జగన్ ని కానీ టచ్ చేస్తే ఏపీ అట్టుడికిపోతోంది.

దాని వల్ల వచ్చే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. దాంతో కేంద్రంలో ఉండే బీజేపీ కూడా ఈ తరహా పీక్స్ కి చేరే రివెంజ్ పాలిటిక్స్ కి ఏ మాత్రం ఆస్కారం ఇవ్వదని అంటున్నారు. వాటికి ఆదిలోనే అడ్డు చెబుతుంది అని అంటున్నారు.

దానికి కారణం ఏమిటి అంటే బీజేపీకి ఏపీ అవసరాలు చాలా ఉన్నాయి. వాటితో పాటే బాబు జగన్ ల అవసరాలు ఇంకా ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. వైసీపీ గెలిస్తే ఎటూ ఆ పార్టీతో కేంద్ర బీజేపీ మంచిగానే ఉంటుంది. ఒకవేళ ఓడితే అంటే అపుడు కూడా సాఫ్ట్ కార్నర్ తోనే ఉంటుంది అని అంటున్నారు.

అదెలా అంటే వైసీపీకి కూడా ఎన్నో కొన్ని ఎంపీ సీట్లు దక్కుతాయి కదా. ఆ సీట్లు కూడా లోక్ సభలో బీజేపీకి కావాలి. వాటికి మించి రాజ్యసభలో అవసరాలు నిండా బీజేపీకి ఉన్నాయి. అక్కడ వైసీపీకి 11 మంది ఎంపీలు ఉన్నారు. టీడీపీ అక్కడ ఖాతా తెరవలేదు. మరో రెండేళ్ల పాటు వెయిట్ చేస్తేనే తప్ప రాజ్యసభలో ఖాళీలు ఉండవు. టీడీపీకి ఎంట్రీ ఉండదు.

మరి ఈ రెండేళ్ళలోనూ వైసీపీ అవసరం కూడా చాలానే ఉంటుంది. అదే సమయంలో రెండేళ్లలో నాలుగు సీట్లకు ఎన్నికలు జరిగితే అందులో కూడా చెరి సగం వైసీపీ టీడీపీ పంచుకునే పరిస్థితి రావచ్చు. లేదా అధికార పార్టీకి మూడు వచ్చినా విపక్షానికి ఒకటి అయినా వస్తుంది కదా అలా చూస్తే రాజ్యసభలో మరో నాలుగేళ్ల కాలం వరకూ వైసీపీ నంబర్ 8 దగ్గర స్టాండ్ అవడం ఖాయం గానే ఉంటుంది.

ఇలాంటి లెక్కలు అన్నీ బీజేపీకి బాగా తెలుసు. అందుకే ఏపీలో కక్ష పూరిత పాలిటిక్స్ కి ఏ పార్టీ అయినా తెర తీసినా నో అనే చెబుతుంది అని అంటున్నారు. 2023లో చంద్రబాబుని వైసీపీ ప్రభుత్వం అరెస్ట్ చేసినపుడు బీజేపీ ఎందుకు మాట్లాడలేదు అన్న ప్రశ్న రావచ్చు. అపుడు టీడీపీ ఎన్డీయేలో లేదు.

ఈసారి అలా కాదు టీడీపీ బహిరంగ మిత్రుడు. సో అలా బాబుకు సపోర్ట్ గా బీజేపీ ఉంటుంది. అలాగే వైసీపీ ఆంతరంగిక మిత్రుడు కాబట్టి ఆ పార్టీతోనూ లోపాయికారీ వ్యవహారాలు ఉంటాయి. అందువల్ల అటూ ఇటూ క్యాడర్ కానీ లేదా రాజకీయ విశ్లేషకులు కానీ అతి ఉత్సాహం చూపించి వారు వస్తే వీరిని లోపలేస్తారు వీరు వస్తే వారిని తొక్కేస్తారు అన్న డైలాగులు కొడితే అవి మీడియా వరకే బాగుంటాయి తప్ప ఆచరణలో అయ్యే పని కానే కాదు అని అంటున్నారు.

మరో వైపు చూస్తే ఏపీ ప్రజలు కూడా ఈ తరహా పాలిటిక్స్ ని కోరుకోవడం లేదు అని అంటున్నారు. మరి కేంద్ర పెద్దల హితవుతో పాటు జనాల మూడ్ తెలుసుకునే అధికారంలోకి వచ్చే పార్టీ బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుందని అంటున్నారు. చూద్దాం మరి ఏమి జరుగుతుందో.