ఏపీ పోల్ పల్స్ : రెండు శాతం తేడా ఎవరి కొంప ముంచుతుంది ?
ఏపీలో ఈసారి భారీ ఎత్తున పోలింగ్ జరిగింది. మొత్తం 26 జిల్లాలకు చెందిన పోలింగ్ శాతం డేటా మొత్తం వచ్చేసింది
By: Tupaki Desk | 14 May 2024 5:36 PM GMTఏపీలో ఈసారి భారీ ఎత్తున పోలింగ్ జరిగింది. మొత్తం 26 జిల్లాలకు చెందిన పోలింగ్ శాతం డేటా మొత్తం వచ్చేసింది. దాని ప్రకారం చూసుకుంటే కనుక కళ్ళు చెదిరిపోయే విధంగా భారీ పోలింగ్ కనిపిస్తోంది. శ్రీకాకుళం తో మొదలుపెడితే అనంతపురం దాకా మొత్తం 175 అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ ఎక్కడా డెబ్బై శాతానికి తగ్గకుండా నమోదు అయింది. అలాగే 80 శాతాలను కూడా దాటింది.
గత సారి చూస్తే 79 శాతం పోలింగ్ పర్సంటేజ్ ఉంటే ఈసారి అది కాస్తా 81 కి ఎగబాకింది. మరి పెరిగిన ఈ రెండు శాతం దేనికి సంకేతం అన్నది ఒక కీలకమైన మౌలికమైన ప్రశ్న. ఊరకే పోలింగ్ శాతం పెరగదు కదా. ఓటర్లు అర్ధ రాత్రి వరకూ క్యూ కట్టి మరీ ఓటేసారు అంటే వారి మనోభావాలు ఎలా ఉంటాయో కూడా అంతా ఆలోచించాల్సిందే అంటున్నారు.
ఇక్కడ రెండు విషయాలను ప్రస్తావించుకోవచ్చు అని అంటున్నారు. ఎవరి మీద అయినా విపరీతంగా కసి కోపం ఉంటే అది పట్టుదలగా మారుతుంది. అలాగే ఎవరి మీద అయినా అలవిమాలిన ప్రేమాభిమానాలు ఉన్నా కూడా అది కూడా వారిని కట్టిపడేస్తుంది. ఎంత కష్టమైనా భరించమంటుంది.
ఓటరు కోణంలో చూసినపుడు ఈ రెండు విషయాలు చాలా ముఖ్యంగా పరిశీలించాల్సి ఉంటుంది. ఓటర్ తన మాట బయటకు చెప్పలేకపోవచ్చు. పోలింగ్ ఎలా జరిగింది అన్న దానిని బట్టి ఓటర్ల నిబద్ధత వారి తీరుని బట్టి అంచనాలు వేసుకోవచ్చు అని అంటున్నారు.
ఇక్కడ మరో విషయం కూడా చూసుకోవాల్సి ఉంది. 2004లో 1999 కంటే అధిక పోలింగ్ నమోదు అయింది. ఫలితంగా వైఎస్సార్ నాయకత్వంలోని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇక 2009లో కూడా అధిక పోలింగ్ నమోదు అయింది అయినా రెండోసారి వైఎస్సార్ పవర్ లోకి వచ్చారు. దాని అర్ధం ఏమిటి అంటే వైఎస్సార్ పట్ల జనాలలో అవ్యాజమైన ప్రేమ అని చెప్పుకున్నారు.
ఇక విభజన ఏపీలో తీసుకుంటే 2014లో కూడా పోలింగ్ శాతం పెరిగింది, అది చంద్రబాబుని అధికారంలోకి తెచ్చింది. ఇక 2019లో పెరిగిన పోలింగ్ శాతం వైసీపీకి అనుకూలంగా మారింది. ఇపుడు పెరిగిన పోలింగ్ శాతం ఎవరికి అనుకూలం అన్నదే చర్చ.
మళ్ళీ అవే దృశ్యాలు. అయిదేళ్ళ క్రితం నాటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఆనాడూ అర్ధరాత్రి దాకా ఉండి మరీ పోలింగ్ చేశారు. ఆ తరువాత తెలిసింది అది అధికార పార్టీ పట్ల కోపంతో పెరిగిన ఓటింగ్ అని. ఇపుడు కూడా అర్ధరాత్రి దాకా జనాలు ఉండి ఓట్లు వేశారు అంటే ఇది కూడా అధికార పార్టీ పట్ల కసి కోపం అని టీడీపీ అంటోంది.
అయితే అన్ని సార్లూ నెగిటివ్ ఓటింగ్ జరగదని కొన్ని సార్లూ అది పాజిటివ్ ఓటింగ్ గా కూడా మారుతుందని పశ్చిమ బెంగాల్ లో 2022లో జరిగిన దాన్ని కూడా రాజకీయ విశ్లేషకులు ఉదహరిస్తున్నారు. అలాగే యూపీలో రెండవసారి యోగీ ఆదిత్యనాధ్ అధికారంలోకి వచ్చింది భారీ పోలింగ్ తోనే అంటున్నారు. గుజరాత్ లో ఆరు సార్లు బీజేపీ గెలిచినా ఒడిసాలో అయిదు సార్లు నవీన్ పట్నాయక్ గెలిచినా కూడా అంతకంతకు పోలింగ్ శాతాలు పెరగడం వల్లనే అని అంటున్నారు.
తెలంగాణాలో 2018లో జరిగిన భారీ పోలింగ్ కేసీఆర్ ని అధికారంలోకి రెండవసారి తెచ్చింది కదా అని గుర్తు చేస్తున్నారు. ఇదంతా వైసీపీ వైపు నుంచి వాదన. అయితే పెరిగిన ఓటింగ్ శాతం ఎపుడూ ఎక్కువగా నెగిటివ్ ఓటింగ్ కే దారి తీసింది అది చాలా సార్లు అధికార పార్టీని గద్దె దించింది అన్నది టీడీపీ వైపు నుంచి వస్తున్న వాదన.
రెండు శాతం తేడా అంటే టోటల్ ఫలితాల్లోనే తేడా వస్తుందని, మ్యాజిక్ ఫిగర్ కి దూరం చేయడమో లేక మరింత దగ్గర చేయడమో కూడా జరుగుతుందని అంటున్నారు. ఏపీలో నాలుగు కోట్ల 14 లక్షల మంది ఓటర్లు ఉంటే అందులో ఎనభై ఒక్క శాతం ప్రజలు ఓటు చేశారు అంటే ఏకంగా మూడున్నర కోట్ల మంది అని అర్థం అంటున్నారు.
ఇంత పెద్ద స్థాయిలో పోలింగ్ జరిగినపుడు బలమైన అభిప్రాయంతోనే ఓటెత్తారు అన్నది స్పష్టంగా తెలుస్తోంది అని అంటున్నారు. ఓటర్లకు అంతటి బలమైన భావోద్వేగం కలిగించే విషయం ఏమి ఉంది అన్నది ఫలితాలను బట్టే తెలుసుకోవాల్సి ఉంది. ఏది ఏమైనా ఈసారి భారీ పోలింగ్ మాత్రం ఏపీలో రాజకీయ జాతకాన్నే మలుపు తిప్పేదిగా ఉంటుంది అన్నది వాస్తవం అంటున్నారు.