Begin typing your search above and press return to search.

ప్రీ పోల్...మూడ్ ఆఫ్ ఏపీ సర్వే...!

ఏపీ మూడ్ ఎలా ఉంది. ఈ ఉత్కంఠ ఇపుడు అందరిలో ఉంది. ఎందుకంటే ఎన్నికల సీజన్ వచ్చేసింది

By:  Tupaki Desk   |   25 Jan 2024 10:24 AM GMT
ప్రీ పోల్...మూడ్ ఆఫ్ ఏపీ సర్వే...!
X

ఏపీ మూడ్ ఎలా ఉంది. ఈ ఉత్కంఠ ఇపుడు అందరిలో ఉంది. ఎందుకంటే ఎన్నికల సీజన్ వచ్చేసింది. దాంతో ఏపీలో ఎన్నికలు జరిగితే ఎవరికి అధికారం వస్తుంది. ఎవరికి అందలం దక్కుతుంది అన్నది ఆసక్తిని కలిగించే విషయం. అందుకే రకరకాల సర్వేలు వస్తూంటాయి. ప్రజలు వాటిని ఆసక్తిగా చూస్తూంటారు.

ఇపుడు అలాంటిదే ఒక సర్వే అయితే వచ్చింది. మూడ్ ఆఫ్ ఏపీ సర్వేను పాపులర్ ప్రీ పోల్ సర్వే పేరిట ఒక సంస్థ వెలుగులోనికి తెచ్చింది. దీని ప్రకారం చూస్తే ఏ పార్టీకి ఎన్ని ఎంపీ సీట్లు అని మాత్రమే ఉంది. దాన్ని అసెంబ్లీ సీట్లకు కన్వర్ట్ చేసుకోవచ్చు. అయితే ఏపీలో మొత్తం పాతిక సీట్లు ఉంటే ఇప్పటికిపుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి పది ఎంపీ సీట్లు వస్తాయని ఆ సర్వే చెప్పుకొచ్చింది.

అలాగే టీడీపీ జనసేన కూటమికి తొమ్మిది సీట్లు వస్తాయని తెల్చింది. హోరా హోరీ పోరుగా ఉండే సీట్లు అయితే ఆరు అని డిసైడ్ చేసింది. ఇందులో వైసీపీకి వచ్చే పది ఎంపీ సీట్ల వివరాలు ఉన్నాయి. అవేంటి అంటే విజయనగరం, అరకు, అమలాపురం, ఏలూరు, కడప, రాజంపేట, చితూరు, తిరుపతి, విజయవాడ, అరకు నంద్యాలలలో వైసీపీ ఎంపీ సీట్లు గెలుచుకుంటుందని ఆ సర్వే పేర్కొంది.

ఇక తెలుగుదేశం జనసేన గెలుచుకునే ఎంపీ సీట్లు చూస్తే శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, నరసారావుపేట, బాపట్ల, నర్సాపురం, కాకినాడ, కర్నూల్, హిందూపుర్ గా ఉన్నాయి. అదే టైం లో హోరా హోరీ పోరుగా ఉన్న ఆరు సీట్లు ఏంటి అంటే రాజమండ్రి, అనంతపూర్, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, మచిలీపట్నంగా ఉన్నాయి.

ఒక విధంగా ఇది చాలా ఇంటరెస్టింగ్ సర్వే అనే చెప్పాలి. ఎందుకంటే ఇపుడు ఈ సర్వే ప్రకారం చూస్తే ఏపీలో ఎవరికి అధికారం వస్తుంది అన్నది చూడాల్సి ఉంటుంది. ప్రతీ ఎంపీ సీటు పరిధిలో ఏడు అసెంబ్లీ సీట్లు ఉంటాయి. అలా చూసుకుంటే వైసీపీకి డెబ్బై అసెంబ్లీ సీట్లు, టీడీపీ జనసేన కూటమికి 63 సీట్లు రావచ్చు అని ఈ సర్వే ప్రకారం తెలుస్తోంది.

ఇక ఆరు ఎంపీ సీట్లలో హోరా హోరీ పోరు ఉందని అంటే 48 అసెంబ్లీ సీట్లు అన్న మాట. ఇందులోనే ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో చూడాల్సి ఉంది అని అంటున్నారు. ఏపీలో ఎవరైనా ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 88 అసెంబ్లీ సీట్లు రావాలి. అది మ్యాజిక్ ఫిగర్, ఆ లెక్కన వైసీపీకి ఇంకా 18 సీట్లు అవసరం పడతాయి. అదే టీడీపీ జనసేన కాంబోకు పాతిక సీట్లు అవసరం పడతాయి.

అంటే ఈ నలభై ఎనిమిది అసెంబ్లీ సీట్లలో ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వారే ఏపీకి రేపటి కొత్త ప్రభుత్వ సారధి అన్న మాట. సో ఏ విధంగా చూసుకున్నా ఈ సర్వే వాస్తవానికి కొంచెం దగ్గరగానే ఉందని అంటున్నారు. ఎందుకంటే ఏపీలో వైసీపీ టీడీపీ జనసేనల మధ్య హోరా హోరీ పోరు అయితే సాగుతోంది. దాన్నే ఈ సర్వే ప్రతిబింబించింది అనుకోవాలి. అయితే ఈ సర్వే ఇప్పటికిప్పుడు ఎన్నికలు అయితే అంటోంది.

ఇంకా అభ్యర్ధులు డిసైడ్ అయి నోటిఫికేషన్ వచ్చాక నామినేషన్లు వేశాక జరిగే ఎన్నికల ప్రచారం నాటికి సన్నివేశం మరింతంగా మారవచ్చు. అపుడు ఎవరు పై చేయి సాధిస్తారు అన్నది కూడా చెప్పవచ్చు. ఏది ఏమైనా ఏపీలో ఎవరి ప్రభుత్వం అంటే ఈ రోజుకు కూడా గట్టిగా చెప్పలేని పరిస్థితి అని అంటున్నారు.