Begin typing your search above and press return to search.

ఇక ముందు చేయాల్సింది చాలానే ఉంది!

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగున్నర నెలల తరువాత ఏపీపీఎస్సీకి కొత్తగా నియామకం జరిగింది.

By:  Tupaki Desk   |   24 Oct 2024 4:06 AM GMT
ఇక ముందు చేయాల్సింది చాలానే ఉంది!
X

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగున్నర నెలల తరువాత ఏపీపీఎస్సీకి కొత్తగా నియామకం జరిగింది. చైర్ పర్సన్ గా రిటైర్డ్ ఐపీఎస్ అధికారిణి అనూరాధను నియమించారు. ఆమె తన పదవీకాలంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా హోం శాఖ సెక్రటరీగా కీలకమైన బాధ్యతలనే నిర్వహించారు. ఇక వైసీపీ హయాంలో మాజీ డీజీపీ గౌతం సవాంగ్ ని నియమించారు. కూటమి గెలవడంతోనే ఆయన తన పదవికి రాజీనామా చేశారు.

కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ పదవి భర్తీ చేయాల్సి ఉంది. ఎందుకంటే ఎన్నికల్లో నిరుద్యోగులకు కూటమి పెద్దలు హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే పెద్ద ఎత్తున గ్రూపు పోస్టులను తీస్తమని సర్వీస్ కమిషన్ ద్వారా అన్ని ఖాళీలు భర్తీ చేస్తామని చెప్పారు. వైసీపీ హయాంలో పోస్టుల భర్తీ అయితే పెద్దగా జరగలేదు.

దాంతో ఏళ్ల తరబడి కోచింగ్ తీసుకుంటూ కాలాన్ని ధనాన్ని అంతకు మించి తమ వయసుని కోల్పోతున్న వారు అంతా కూటమి మీదనే చూపు నిలిపారు. ఇక నెలల తరబడి ఈ పోస్టు భర్తీ కాకపోవడంతో వివిధ ప్రజా సంఘాలతో పాటు వామపక్షాల నేతలు కూడా దీన్నే డిమాండ్ చేశారు. సత్వరమే ఏపీపీఎస్సీ చైర్ పర్సన్ నియామకం చేపట్టాలన్నది కూడా ఇటీవల కాలంలో కూటమి ముందుకు వచ్చిన ఒక డిమాండ్.

మొత్తానికి ఈ నియామకం జరిగిపోయింది. సీనియర్ ఐపీఎస్ అధికారిణి చేతికే పగ్గాలు అందించారు. పైగా ఈ సెలక్షన్ చంద్రబాబు ఎంతో ఆలోచించి చేశారు అని అంటున్నారు. ఇక ముందు చేయాల్సింది చాలానే ఉంది అని అంటున్నారు.

చైర్మన్ లేకపోవడంతో చాలా నియామకాలు ఆగిపోయాయి. ఇక మీదట కొత్త ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు వరసబెట్టి రావాల్సి ఉంది. మరో వైపు చూస్తే తెలంగాణాలో గ్రూపు పరీక్షలు జరుగుతున్నాయి ఏపీలోనే ఏ కదలికా లేదు. దాంతో జరగాల్సిన పరీక్షలు చాలా ఆగిపోయాయి. వరసబెట్టి నోటిఫికేషన్లు ఇచ్చుకుంటూ డేట్లు షెడ్యూల్ ప్రకటిస్తూ ఖాళీలను అన్నీ వరస ప్రకారం భర్తీ చేయాలి. దానికి కూటమి ప్రభుత్వం కూడా అనుమతించాల్సి ఉంది.

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాలు లక్షలలో ఖాళీలు ఉన్నాయని గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలు ప్రకటించాయి. ఇపుడు టీడీపీ కూటమే ఎటూ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఏ మాత్రం ఆలస్యం లేకుండా ఖాళీలను భర్తీ చేయాల్సి ఉందని అంటున్నారు. అపుడే కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు న్యాయం జరుగుతుందని అంటున్నారు.

అయితే సర్కార్ కూడా ఖజానాను చూసుకోవాలి. కొత్త నియామకాలు ఎంతమేరకు చేపట్టవచ్చు అన్నది కూడా చూడాల్సి ఉంది. మెల్లగా ఒక్కోటి నోటిఫికేషన్ ఇచ్చుకుంటూ వెళ్ళినా నిరుద్యోగులు ఎంతో కొంత ఊరట చెందుతారు అని అంటున్నారు. ఏది ఏమైనా ఏపీలో ఆశగా చూస్తున్న నిరుద్యోగులకు ఇది ఒక శుభవార్తగానే ఉంది. సో ఇక మీదట సర్వీస్ కమిషన్ ఉద్యోగాల విషయంలో అంతా వేచి చూడవచ్చు అన్న మాట.