Begin typing your search above and press return to search.

ఏపీ తొలి ఫలితం నందిగామ/మచిలీపట్నం/పామర్రు

దీంతో జూన్ 4న వెలువడే ఫలితాలపై అందరి చూపూ ఉంది.

By:  Tupaki Desk   |   28 May 2024 5:19 PM GMT
ఏపీ తొలి ఫలితం నందిగామ/మచిలీపట్నం/పామర్రు
X

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరిగి ఉండొచ్చు.. ఏపీతో పాటు మరో మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీకి ఎన్నికలు జరిగి ఉండొచ్చు.. ఇండియా కూటమి బీజేపీని గట్టిగా ఢీకొడుతుండొచ్చు.. ప్రధానిగా మోదీ మూడోసారి ప్రమాణం చేయాలని ఉవ్విళ్లూరుతుండొచ్చు.. తెలంగాణలో కాంగ్రెస్ కు ఎక్కువ ఎంపీ సీట్లు సాధించాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తుండొచ్చు.. కానీ, అందరి కళ్లూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఫలితాల మీదేనే.. వైసీపీ అధినేత సీఎం జగన్ మళ్లీ గెలుస్తారా? బీజేపీ-టీడీపీ-జన సేన కూటమి ఆయనను నిలువరిస్తుందా..? దీంతో జూన్ 4న వెలువడే ఫలితాలపై అందరి చూపూ ఉంది.

వచ్చే వారం ఈ వేళకు..

వచ్చే మంగళవారం ఈ సమయానికి అంతా తేలిపోతుంది. ఐదేళ్లూ ఏపీని పాలించేది ఎవరో తెలిసిపోతుంది. అటు కేంద్రంలో మోదీనా? రాహుల్ గాంధీనా? అనేది కూడా స్పష్టమవుతుంది. అయితే, ఏపీలో మాత్రం ఎవరు గెలుస్తారా? అనేది ముఖ్యం కానుంది. ఎందుకంటే దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. ఈ నేపథ్యంలో కౌంటింగ్ ప్రక్రియ గురించి పరిశీలిస్తే జూన్‌ 4న ఉదయం 8 గంటల నుంచి పోస్టల్‌ బ్యాలట్లతో మొదలవుతుంది. 8.30 నుంచి ఈవీఎం (కంట్రోల్‌ యూనిట్లు)లను లెక్కిస్తారు.

చైతన్యవంతమైన కృష్ణా నుంచే..

పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు నుంచి మొదలై మొదటి గంటలోనే ఫలితాల ట్రెండ్ తెలిసిపోతుంది. అయితే, ఏపీలో మొదటి ఫలితం కృష్ణా జిల్లా మచిలీపట్నం లేదా పామర్రు నియోజకవర్గంది కానున్నదని లేదా ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ నుంచి రావొచ్చని అంచనా. ఒక్కో రౌండ్‌ పూర్తి కావడానికి 20 నుంచి 25 నిమిషాలు పడుతుంది. అభ్యర్థులు ఎక్కువగా ఉంటే అదనపు సమయం తీసుకుంటారు.

మచిలీపట్నం నుంచి వైసీపీ అభ్యర్థిగా పేర్ని కిట్టు, టీడీపీ నుంచి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర బరిలో దిగారు. ఇక పామర్రులో వైసీపీ అభ్యర్థిగా కైలే అనిల్ కుమార్, టీడీపీ నుంచి వర్ల కుమార్ రాజా పోటీ చేశారు. నందిగామలో వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు, టీడీపీ నుంచి తంగిరాల సౌమ్య బరిలో నిలిచారు. అంటే.. తొలి ఫలితం రానున్న మూడు సీట్లలోనూ ఏపీలో అధికార వైసీపీ, టీడీపీనే ముఖాముఖి తలపడుతున్నాయన్నమాట.