ఏపీ రౌడీ షీటర్ అరెస్టుకు భయపడి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు
ఒక హత్య కేసులో భాగంగా నిందితుడి ఆచూకీ కోసం హైదరాబాద్ కు వచ్చిన ఏపీ పోలీసుల్ని చూసి భయపడి పారిపోయే ప్రయత్నం చేశాడో యువకుడు
By: Tupaki Desk | 21 Sep 2023 5:01 AM GMTఏపీ పోలీసులకు మస్కా కొట్టేందుకు హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో రహస్యంగా ఉంటున్న ఒక నిందితుడు చేసిన ప్రయత్నం బెడిసి కొట్టటమే కాదు.. ప్రాణాల మీదకు తీసుకొచ్చిన ఉదంతమిది. ఒక హత్య కేసులో భాగంగా నిందితుడి ఆచూకీ కోసం హైదరాబాద్ కు వచ్చిన ఏపీ పోలీసుల్ని చూసి భయపడి పారిపోయే ప్రయత్నం చేశాడో యువకుడు. ఈ క్రమంలో సినిమా స్టైల్ లో పక్క భవనం పైకి దూకి తీవ్రంగా గాయపడి.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఆలస్యంగా బయటకు వచ్చిన ఈ ఉదంతంలోకి వెళితే.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం పరిధిలోని ఈదరపల్లిలో ఈ నెల (సెప్టెంబరు) ఒకటిన కిశోర్.. సాయి లక్ష్మణ్ పై కొందరు దాడికి పాల్పడ్డారు. ఈ ఉదంతంలో కిశోర్ మరణించాడు. ఈ హత్యకు సంబంధించి నిందితుల సమాచారం అందుకున్న అమలాపురం పోలీసులు హైదరాబాద్ కు వచ్చారు.
హత్య కేసులో నిందితులకు మాదాపూర్ లో ఉద్యోగం చేసే ఫణిశంకర్ ను తొలుత అదుపులోకి తీసుకున్నారు. అయితే.. తనకు ఏమీ తెలీదని ఫణి శంకర్ చెప్పారు. కేపీహెచ్ బీలో ఉండే ఫణిశ్రీనివాస్ వద్ద సమాచారం ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీంతో.. అతడి కోసం కేపీహెచ్ బీకు వెళ్లారు ఏపీ పోలీసులు. అక్కడి హాస్టల్ లో ఉంటున్న విషయాన్ని తెలుసుకున్న పోలీసులు రాత్రి ఎనిమిదిన్నర వేళలో అక్కడకు చేరుకున్నారు.
తన కోసం పోలీసులు వస్తున్నారన్న విషయాన్ని తెలుసుకున్న ఫణి శ్రీనివాస్ తన రూంకు తాళం వేసి.. నాలుగో అంతస్తు మీద నుంచి పక్కనున్న బిల్డింగ్ పైకి దూకాడు. ఈ క్రమంలో పట్టుతప్పి మూడో అంతస్తులోని పెంట్ హౌస్ మీద పడిపోయాడు. దీంతో.. తీవ్ర గాయాలు అయ్యాయి. అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆసుపత్రిలో చేర్చారు. సినిమాటిక్ స్టైల్ లో తప్పించుకునే ప్రయత్నంలో ప్రాణాలు మీదకు తెచ్చుకున్నట్లుగా చెబుతున్నారు.