Begin typing your search above and press return to search.

అప్సర హత్య కేసు: పూజారికి జీవిత ఖైదు.. కేసు వివరాలివీ

ఈ జరిమానాలో రూ. 9.70 లక్షలు అప్సర కుటుంబానికి నష్టపరిహారంగా చెల్లించాలని కోర్టు ఆదేశించింది.

By:  Tupaki Desk   |   26 March 2025 3:40 PM
Apsara case for accused venakt sai
X

సంచలనం సృష్టించిన 2023 అప్సర హత్య కేసులో నిందితుడు, పూజారి ఎ. వెంకట్ సాయి సూర్య కృష్ణకు రంగారెడ్డి జిల్లా కోర్టు బుధవారం జీవిత ఖైదు విధించింది. దాదాపు రెండేళ్ల క్రితం జరిగిన ఈ దారుణమైన నేరంలో తన ప్రియురాలు కె. అప్సరను దారుణంగా హత్య చేసి, ఆమె శరీరాన్ని నీటి సంపులో దాచిపెట్టినందుకు కోర్టు కృష్ణను దోషిగా నిర్ధారించింది. కోర్టు కృష్ణకు సాక్ష్యాలను తారుమారు చేసినందుకు అదనంగా ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా రూ. 10 లక్షల జరిమానా విధించింది. ఈ జరిమానాలో రూ. 9.70 లక్షలు అప్సర కుటుంబానికి నష్టపరిహారంగా చెల్లించాలని కోర్టు ఆదేశించింది.

చెన్నైకి చెందిన అప్సర అనే యువ నటి 2022లో తన తల్లితో కలిసి హైదరాబాద్‌కు వచ్చింది. సరూర్‌నగర్‌లో నివాసం ఉంటున్న ఆమెకు అదే ప్రాంతంలోని బంగారు మైసమ్మ ఆలయ పూజారి వెంకట సాయికృష్ణతో పరిచయం ఏర్పడింది. తరచూ ఆలయానికి వెళ్లే అప్సరతో సాయికృష్ణ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అప్పటికే వివాహితుడైన సాయికృష్ణకు ఒక కుమార్తె కూడా ఉంది. అప్సర తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో విసిగిపోయిన సాయికృష్ణ ఆమెను హత్య చేయాలని పథకం వేశాడు.

2023 జూన్ 3న కోయంబత్తూరు వెళ్లేందుకు విమాన టిక్కెట్లు కొనుగోలు చేశానని అప్సరను నమ్మించాడు. నిజమని భావించిన అప్సర ప్రయాణానికి సిద్ధమైంది. తన కుమార్తెను శంషాబాద్‌లో దిగబెట్టి వస్తానని సాయికృష్ణ ఆమె తల్లికి చెప్పాడు. ఆ రోజు రాత్రి 8.15 గంటలకు వారు కారులో బయలుదేరారు. రాత్రి 10 గంటలకు శంషాబాద్ సమీపంలోని రాళ్లగూడలో భోజనం చేశారు. అనంతరం సుల్తాన్‌పల్లిలోని గోశాలకు చేరుకున్నారు. అక్కడ బెల్లం దంచే రాయిని కారులో దాచిపెట్టాడు.

జూన్ 4న తెల్లవారుజామున 3.50 గంటల సమయంలో గోశాల సమీపంలోని నర్కుడలో నిర్మానుష్యమైన స్థలానికి కారును పోనిచ్చాడు. అప్సర నిద్రపోగానే కారు సీటు కవర్‌తో ఆమె ముఖాన్ని అదిమి ఊపిరాడకుండా చేశాడు. ఆ తర్వాత బెల్లం దంచే రాయితో తల వెనుక భాగంలో బలంగా పదిసార్లు కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. మృతదేహాన్ని కారు కవర్‌తో కప్పి, కారును సరూర్‌నగర్‌లోని తన ఇంటికి తీసుకెళ్లి పార్క్ చేశాడు.

రెండు రోజుల పాటు కారులోనే ఉంచిన మృతదేహాన్ని కవర్‌లో చుట్టి బంగారు మైసమ్మ ఆలయం దగ్గర ఉన్న మ్యాన్‌హోల్‌లో పడేశాడు. దుర్వాసన రాకుండా ఎల్బీనగర్ నుంచి కూలీలను పిలిపించి రెండు లారీల మట్టిని తెప్పించి మ్యాన్‌హోల్‌ను పూడ్చి సిమెంట్ చేశాడు.

అప్సర అదృశ్యంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్న సమయంలో అతడిని త్వరగా పట్టుకున్నారు. ఈ కేసులో అన్ని సాక్ష్యాలను పరిశీలించిన అనంతరం కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది.