Begin typing your search above and press return to search.

ప్రత్యేకహోదా గుర్తు చేసిన వీహెచ్...పవన్ పై సీరియస్ కామెంట్స్!

అది సెప్టెంబర్ నెల 2016వ సంవత్సరం... ఏపీకి ప్రత్యేక హోదా అనే అంశం సీరియస్ గా తెరపైన ఉన్న సందర్భం

By:  Tupaki Desk   |   8 Nov 2023 11:59 AM GMT
ప్రత్యేకహోదా గుర్తు చేసిన వీహెచ్...పవన్ పై సీరియస్ కామెంట్స్!
X

అది సెప్టెంబర్ నెల 2016వ సంవత్సరం... ఏపీకి ప్రత్యేక హోదా అనే అంశం సీరియస్ గా తెరపైన ఉన్న సందర్భం. ఈ సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇండిపెండెంట్ గా ఫుల్ ఫాం లో ఉన్నట్లు కనిపించిన కాలం. ఈ సమయంలో తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జేఎన్‌టీయూ గ్రౌండ్స్‌ లో జనసేన ఆధ్వర్యంలో సీమాంధ్రుల ఆత్మగౌరవ సభలో పవన్‌ కల్యాణ్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ చర్చనీయాంశమే!

అవును... ప్రత్యేక హోదా అంశాన్ని ప్రభుత్వం చంపేస్తుందనే విమర్శలు వచ్చిన ఆ సమయంలో పవన్ కల్యాణ్ కాకినాడలో భారీ మీటింగ్ కండక్ట్ చేశారు. ఏపీకి హోదా బదులు కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీని పాచిపోయిన లడ్డూలుగా నాడు పవన్ అభివర్ణించారు. ఆ లడ్డూలను తీసుకుంటారో, విసిరిపారేస్తారో సీఎం చంద్రబాబే తేల్చుకోవాలని సీరియస్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్, బీజేపీలు సీమాంధ్ర ప్రజలను మోసం చేశాయని... ఇందులో కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడిస్తే, బీజేపీ నేరుగా పొట్టలో పొడిచిందని మండిపడ్డారు!

కట్ చేస్తే ప్రస్తుతం పవన్ కల్యాణ్ బీజేపీ కీలకంగా ఉన్న ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. త్వరలో జరగనున్న తెలంగాణ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీచేయబోతున్నారు. ఇందులో భాగంగా 8 సీట్లలో పోటీ చేస్తున్న పవన్... తాజాగా మోడీ ఆధ్వర్యంలో జరిగిన బీసీ సభలో పాల్గొన్నారు. ఏపీలో తన ప్రసంగ శైలికి పూర్తి భిన్నమైన రీతిలో ప్రసంగించారు. ఈ సమయంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ హనుమంత రావు స్పందించారు.

తెలంగాణ ఎన్నికల్లో బీజేపీతో కలిసి జనసేన పోటీ చేస్తుండటం.. ఈ క్రమంలో మోడీతో కలిసి పవన్ వేదిక పంచుకొవడం మొదలైన అంశాలపై వీహెచ్ స్పందించారు. ఇందులో భాగంగా... పవన్ కల్యాణ్ ని బీజేపీ తన అవసరానికి అనుగుణంగా వాడుకుంటోందని విమర్శించారు. అదేవిధంగా... ఏపీకి ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేసిన పవన్, ఇప్పుడు మోడీ పక్కన ఎలా చేరారని ప్రశ్నించారు.

ఇదే సమయంలో... పవన్ కల్యాణ్ కాపు కదా.. కాపులను బీసీల్లో కలిపారా?.. లేక, కలుపుతారని హామీ ఇచ్చారా? మరి మోడీ వెంట ఎందుకెళ్తున్నావ్? అంటూ సూటిగా ప్రశ్నించారు వీహెచ్. పవన్ సినిమాలు చూసేవాళ్లలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు ఎక్కువ అని, ఆయన యువతకు ఎలాంటి సందేశం ఇస్తున్నారని అడిగుతూ.. మోసపోవద్దని హితవు పలికారు! ఈ సందర్భంగా మోడీ ఎవరికి లాభం చేశారో పవన్ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇదే క్రమంలో... బడుగు, బలహీన వర్గాలకు న్యాయం చేసింది కాంగ్రెస్ మాత్రమేనని స్పష్టం చేసిన వీహెచ్... మోడీ మూడోసారి ప్రధాని అవుతారని ఎలా చెబుతారని ప్రశ్నించారు. కనీసం స్పెషల్ స్టేటస్ ఏమైందని.. అదానీకి ఇచ్చిన స్టీల్ ప్లాంట్ ను తిరిగి ఇవ్వాలని అయినా పవన్ కల్యాణ్.. మోడీని ప్రశ్నించాలని వీహెచ్ సూచించారు.

ఇక చివరిగా... పవన్ కళ్యాణ్ మంచోడే కానీ అప్పుడప్పుడు తొందరపాటు నిర్ణయం తీసుకుంటారని.. అయితే అది మంచిది కాదని సూచించిన వీహెచ్... పవన్ కళ్యాణ్ అంటే తనకు అభిమానమని చెప్పుకొచ్చారు! దీంతో పవన్, తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తానని, అది కూడా బీజేపీతో కలిసి వేళ్తానని ప్రకటించిన తర్వాత ఎదురవుతున్న మరో సమస్య ఇదని అంటున్నారు పరిశీలకులు!