టీడీపీకి పదకొండు సర్వేలు...పబ్లిక్ వైసీపీకి ఎన్ని...?
తాజాగా ఉమ్మడి క్రిష్ణా జిల్లా సభలో చంద్రబాబు మాట్లాడుతూ టీడీపీ కూటమికి అనుకూలంగా పదకొండు సర్వేలు వచ్చాయని నంబర్ తో సహా జనాలకు చెప్పారు.
By: Tupaki Desk | 18 April 2024 4:09 AM GMTఏపీలో ఆఖరుకు రాజకీయం ఎంతదాకా వచ్చిందంటే సర్వేలు మాకు అని చెప్పుకుని మీటింగులలో మాట్లాడుతున్నారు. జనాలు సర్వేలను నమ్మి ఫలానా పార్టీ గెలుస్తుందని ఓట్లు వేస్తారా అలా అయితే ప్రతీ వారూ పెయిడ్ సర్వేలు చేయించుకుని గెలుస్తారు కదా. గెలుపునకు అది దగ్గరి రూటు కదా అని అంటున్నారు. మాకు ఇన్ని సర్వేలు అనుకూలం అని ఒక పార్టీ చెబితే మా నంబర్ అంతకంటే ఎక్కువ అని మరో పార్టీ అంటోంది.
ఆఖరుకు జనాల వద్దకు వెళ్ళి తాము ఏమి చేశామో చెప్పి ఏమి చేయబోతున్నామో చెప్పి ఓట్లు అడగడం అటుంచి సర్వేలు మాకు అనుకూలం అని చెప్పుకోవడం రాజకీయంగా దివాళాకోరుతనమే అంటున్నారు. తాజాగా ఉమ్మడి క్రిష్ణా జిల్లా సభలో చంద్రబాబు మాట్లాడుతూ టీడీపీ కూటమికి అనుకూలంగా పదకొండు సర్వేలు వచ్చాయని నంబర్ తో సహా జనాలకు చెప్పారు. మేము గెలవబోతున్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఇప్పటిదాకా చూస్తే చాలా సర్వేలు వచ్చాయి. చివరిగా 11 సర్వేలు వస్తే ఆ 11 సర్వేల్లో 17 నుంచి 23 ఎంపీ స్థానాలు టీడీపీనే గెలుస్తున్నట్లుగా వచ్చిందని చంద్రబాబు గుర్తు చేశారు. అంతే కాదు మళ్లీ పోలింగ్ తర్వాతే సర్వేలు వస్తాయని ఆయన చెప్పారు. ఏపీలో రాజకీయం పూర్తిగా టీడీపీకి అనుకూలంగా ఉంది అని చంద్రబాబు చెప్పారు.
ఇదిలా ఉంటే పదకొండు సర్వేలు టీడీపీకి అనుకూలం అని బాబు చెప్పడం కాదు టీడీపీ తన అఫీషియల్ ట్విట్టర్ లో కూడా పెట్టింది అని అంటున్నారు దాని మీద వైసీపీ ట్వీట్ చేస్తూ అవన్నీ తప్పుడు సర్వేలు అని కౌంటర్ వేసింది. మాకే ఎక్కువగా సర్వేలు అనుకూలం అని చెబుతోంది. మేము మళ్ళీ వస్తామని సర్వేలు చెబుతున్నాయని వైసీపీ అంటోంది.
ఇంతకీ సర్వేలతోనే పార్టీలు నెగ్గుతాయా అన్నది పెద్ద ప్రశ్న. అదే జరిగితే తెలంగాణా ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ గెలుస్తుందని అనేక సర్వేలు వచ్చాయి. కానీ ఓటమి పాలు అయింది. కర్నాటకలో బీజేపీ గెలుస్తుందని సర్వేలు వచ్చినా ఆ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. మొత్తం నాలుగు కోట్లకు పైగా ఓటర్లు ఉన్నారు. సర్వేలు చేసే సంస్థలు అతి పెద్ద శాంపిల్స్ అని తీసుకుంటే లక్షా యాభై వేలు మొత్తం స్టేట్ అంతా చూస్తే కనిపించడం లేదు.
మరి ఈ శాంపిల్స్ తో జనాల మూడ్ కనిపెట్టగలరా అన్నది ఒక చర్చ. అయితే సర్వేల వల్ల కొంత అంచనా అయితే దొరుకుతుంది. కానీ అదే నిజం కాదు. అలాగని ప్రతీ సర్వే కూడా నిజం కాదు, సర్వేలు కూడా వన్ సైడెడ్ గా చేస్తున్నారు అన్న విమర్శలు ఉన్నాయి. జాతీయ స్థాయిలో వస్తున్న సర్వేలు ఒక పార్టీకి అనుకూలంగా చేస్తున్నారు అని ఇప్పటికే విమర్శలు ఉన్నాయి.
ఈ నేపధ్యంలో సర్వేలను పట్టుకుని గెలుస్తున్నామని ఎవరైనా అంటే ఆనక వేరేగా రిజల్ట్ వచ్చి అభాసుపాలు అయితే అపుడు ఎలా జవాబు చెప్పుకుంటారు అన్నది కీలక ప్రశ్న. వైసీపీ అయినా టీడీపీ అయినా సర్వేలను నమ్ముకుని రాజకీయాలు చేయడం కంటే జనాలను నమ్ముకుని రాజకీయాలు చేయడం బెటర్ అంటున్నారు. మేమే గెలుస్తున్నామని అంటే రెండు పార్టీలలో నేతలు ఇప్పటి నుంచే పని చేయడం మానేస్తే అసలుకే ఎసరు వస్తుందని గుర్తించాలని అంటున్నారు.