Begin typing your search above and press return to search.

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బిల్... గేమ్ చేంజర్ నా...!?

ఇక మే మొదలవుతూనే టీడీపీ కూటమి ఒక ఎమోషనల్ ఇష్యూతో రోడ్ల మీదకు వచ్చింది. అదే ల్యాండ్ టైటిలింగ్ చట్టం.

By:  Tupaki Desk   |   8 May 2024 3:00 AM GMT
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బిల్... గేమ్ చేంజర్ నా...!?
X

రాజకీయాల్లో భావోద్వేగాలు ఉండాలి అపుడే ఓట్ల పంట పండుతుంది. రాజకీయంగా పాజిటివ్ అంశాలు ఎంతలా ఉన్నా అలాగే విమర్శలు ఎంత ధాటీగా చేసినా జనాల బుర్రల్లోకి ఎక్కవు. అదే టైం లో భయాలు కలవరపాట్లు ఆందోళనలు నిరసనలు మాత్రం మనిషిని తీరిగ్గా ఉండనీయవు. అమ్మో ఏదో జరిగిపోతోంది అన్న టెన్షన్ కనుక జనాల మెదడులోకి పంపితే కనుక కచ్చితంగా అది అతి పెద్ద దెబ్బ తీస్తుంది.

ఓట్ల పంటనూ పండిస్తుంది. ఏపీలో ఏప్రిల్ నెలాఖరు వరకూ రాజకీయం చప్పచప్పగా సాగింది. ఇక మే మొదలవుతూనే టీడీపీ కూటమి ఒక ఎమోషనల్ ఇష్యూతో రోడ్ల మీదకు వచ్చింది. అదే ల్యాండ్ టైటిలింగ్ చట్టం. ఈ చట్టాన్ని ఏపీలో జగన్ ప్రభుత్వం అమలు చేస్తుందని ఈ చట్టం కనుక ఉంటే మీ భూములు మీవి కావు అంటూ అటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ ఊదరగొడుతూ జనాల్లోకి వెళ్తున్నారు.

భూమి అన్నది సెంటిమెంట్, అదే ఎమోషనల్ టచ్ ఉన్న సబ్జెక్ట్. ముఖ్యంగా రైతులకు భూమి కంటే మించినది లేదు. భూమితోనే అంతా అనుకుంటాడు. అలాంటి రైతు భూమి పోతోంది అంటే ఊరుకుంటాడా. ఇపుడు ఆ సెంటిమెంట్ నే పట్టుకుని టీడీపీ కూటమి వైసీపీ మీద విరుచుకుపడుతోంది. ఒక విధంగా పోలింగ్ కి దగ్గర చేసి అతి పెద్ద బ్రహ్మాస్త్రాన్ని ఎక్కు పెట్టింది అనుకోవాలి.

ఏపీలో ఇపుడు కరెక్ట్ గా చెప్పాలంటే పొలిటికల్ ట్రెండ్ గా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది ఉంది. ఇదే అంశం ఇపుడు ప్రజలలో పెద్ద ఎత్తున చర్చకు వస్తోంది. అది ఇప్పటికే అమలు అయినట్లుగా విపక్షాలు చెబుతూ వస్తున్నాయి. చంద్రబాబు అయితే ఎన్నికల సభలలో ఇదే టాపిక్ తో వస్తున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రతులను ఆయన నాటకీయ ఫక్కీలో చించేస్తూ జనాలకు ఇవ్వాల్సిన మేసేజ్ గట్టిగానే ఇస్తున్నారు.

ఇక తన మొదటి సంతకాన్ని కూడా చంద్రబాబు మార్చుకున్నారు. తాను సీఎ అయితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేస్తూ తొలి సంతకం పెడతానని సభలలో తెగ ఊదరగొడుతున్నారు. దీనికి వైసీపీని నుంచి నీరసంగా పేలవంగా కౌంటర్లు వస్తున్నాయి. సాక్ష్యాత్తు సీఎం జగన్ నెల్లూరు సభలో కౌంటర్ ఇచ్చినా అది ఏ మాత్రం సరిపోవడం లేదు.

ఇప్పటికే పల్లెలలో భూమి ఉన్న వారిలో భయాలు అనేక సందేహాలు వెళ్ళిపోయాయి. విపక్ష కూటమి చేస్తున్న ప్రచారం వల్ల తమ భూములు అన్నీ ప్రభుత్వం వద్ద ఉండిపోతున్నాయని తమ భూములు తమవి కావు అన్న బెంగ కంగారు అయితే జనాలలో ఉంది అంటున్నారు. దీని మీద గ్రామాలలో రచ్చ బండ వద్ద పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.

వైసీపీ ఇస్తున్న జవాబులు చూస్తే ఈ యాక్ట్ మంచిదని ఒకసారి అంటున్నారు. మరో సారి చూస్తే ఇంకా అమలు చేయలేదు అంటున్నారు. ఇంకో సారి చూస్తే ఈ యాక్ట్ వల్ల భూములు తీసుకోం మీ వద్దనే ఉంటాయని అంటున్నారు. ఇంత సీరియస్ గా ఈ విషయం మీద డిస్కషన్ జరుగుతూంటే రెవిన్యూ మంత్రిగా ఉన్న ధర్మాన ప్రసాదరావు ఎక్కడా నోరు విప్పకపోవడం చర్చకు తావిస్తోంది.

ఆయన ఈ చట్టం గురించి జనాలకు చెప్పి వారిని సమాధానం పరచాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఆయన పూర్తిగా మిన్నకున్నారు. మరో సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ చట్టం గురించి చెప్పిన దాని కంటే టీడీపీ కూటమి నేతల మీద విమర్శలు చేస్తూ పోవడం మీద దృష్టి పెట్టారు. ఇక జగన్ కూడా తన ప్రతీ సభలో ఈ అంశాన్ని టేకప్ చేసి జనాలకు ఏమి చేస్తామో చెప్పాల్సింది ఉంది. కానీ ఆయన కూడా తన చానల్ కి మీడియాకు వదిలేసి మిగిలిన విషయాలు టచ్ చేస్తున్నారు.

అసలు ఈ యాక్ట్ ఎవరు తీసుకుని రమ్మన్నారు అన్నది చెప్పాల్సి ఉంది. బీజేపీ ఆధ్వర్యంలో ఈ యాక్ట్ ని కేంద్రమే రాష్ట్రాలని అమలు చేయమంది అని చెప్పి బీజేపీని ఇందులో ఇన్వాల్వ్ చేసి ఉంటే పొలిటికల్ గా కూటమి కార్నర్ అయ్యేది. అలాగే ఈ చట్టాన్ని అమలు చేయలేదు అని గట్టిగా చెప్పాల్సింది కూడా చెప్పడం లేదు. దీని మీద వైసీపీ నేతలకే ఎక్కడా క్లారిటీ లేదు. ఒక మాటలో చెప్పాలంటే ఈ భూమి భయాలు వైసీపీలోనూ ఉన్నాయని అంటున్నారు.

మొదట్లో ఈ విషయాన్ని లైట్ తీసుకున్న వైసీపీ ఆనక లేట్ గా రియాక్ట్ అయినా అది కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేంతంగా లేకపోవడంతో విపక్ష కూటమికే మేలు జరుగుతోంది అని అంటున్నారు. ఇక ఈ విషయాన్ని వైసీపీ సీరియస్ గా తీసుకోవడం లేదు కానీ ఏపీ ఎన్నికలో ఇదే బిగ్గెస్ట్ ఇష్యూగా మారి టోటల్ ఎన్నికల్లోనే గేమ్ చేంజర్ గా మారే ప్రమాదం ఉంది అని అంటున్నారు. ఏది ఏమైనా వైసీపీలో గట్టిగా కౌంటర్ చేసే వారు లేరు అన్న లోటు ఎన్నికల వేళ మరోసారి రుజువు అయింది దీని ఫలితాలు పర్యవసానాలు ఎలా ఉంటాయో చూడాల్సిందే అని అంటున్నారు.