అప్పట్లో ఉద్యోగులు.. ఇప్పుడు వలంటీర్లు.. అదేసెగ..!
త్వరలోనే విజయవాడలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించాలని వలంటీర్లు భావిస్తున్నారు. తద్వారా.. వారు తమ డిమాండ్లను సర్కారు ముందు ఉంచనున్నారు.
By: Tupaki Desk | 24 Aug 2024 6:30 AM GMTకూటమి సర్కారుకు పెద్ద చిక్కే ఎదురు కానున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వలంటీర్ల వ్యవహారం.. రాజకీ యంగా ఎలా ఉన్నా.. నిరుద్యోగుల పరంగా మాత్రం ఇబ్బందిగానే ఉంది. తమను పట్టించుకోకపోవడం.. తమకు ఇచ్చిన హామీ మేరకు వేతనాలు ఇవ్వకపోగా.. అసలు విధుల నుంచి పక్కన పెట్టడాన్నివారు సహించలేక పోతున్నారు. కూటమి సర్కారు ఏర్పడి మూడు మాసాలు అవుతున్న నేపథ్యంలో ఇప్పటి వరకు వలంటీర్ల గురించి ఎక్కడా ప్రస్తావించలేదు.
నిజానికి ఎన్నికలకు ముందు మాత్రం వలంటీర్లను తీసేసేది లేదన్నారు. అంతేకాదు.. వారికి రూ.10 వేల చోప్పున గౌరవ వేతనం కూడా ఇస్తామని చంద్రబాబు పదే పదే చెప్పారు. దీంతో తమ జీవితాలు మారతా యని వలంటీర్లు భావించారు. దీంతో అప్పటి వరకు వైసీపీకి అనుకూలంగా చాలా మంది వలంటీర్లు.. అనూహ్యంగా కూటమి వైపు పయనం చేశారు. క్షేత్రస్థాయిలో కూటమి నాయకులు చెప్పింది విన్నారు. వారు చెప్పినట్టే చేశారు. దీంతో కూటమి ఘన విజయం దక్కించుకుంది.
కానీ, ప్రభుత్వం ఏర్పడి మూడు మాసాలు చేరువ అవుతున్నా..ఇప్పటి వరకు వలంటీర్ల గురించి పట్టిం చుకున్న పాపాన పోలేదు. ఇది వారిని తీవ్రంగా బాధిస్తోంది. దీంతో ఇప్పటి వరకు మౌనంగా ఉన్న వలంటీర్లు.. గత రెండు రోజులు రాష్ట్ర స్థాయిలో సంఘాలను ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటికే జిల్లాల స్థాయిలో భేటీ అవుతూ.. సర్కారుపై వత్తిడి పెంచే దిశగా ఆలోచన చేస్తున్నారు. ఈ క్రమంలో నిరసనలకు పిలుపునివ్వాలని వలంటీర్ల నాయకులు భావిస్తున్నారు.
త్వరలోనే విజయవాడలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించాలని వలంటీర్లు భావిస్తున్నారు. తద్వారా.. వారు తమ డిమాండ్లను సర్కారు ముందు ఉంచనున్నారు.న ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని.. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని వారు కోరుతున్నారు. అదేవిధంగా గత రెండు మాసాలు గా నిలిపేసిన వేతనాలను కూడా తక్షణం చెల్లించాలన్నది వారి ప్రధాన డిమాండ్‌గా ఉంది. ఈ నేపథ్యం లో గతంలో వైసీపీ సర్కారుకు ఉద్యోగుల నుంచి ఎదురైన సమస్యే ఇప్పుడు వలంటీర్ల రూపంలో కూటమి సర్కారుకు కూడా ఎదురు కానుందని అంటున్నారు పరిశీలకులు.