Begin typing your search above and press return to search.

ఇదేందయ్యా.. ఇది అస్సలు ఊహించల!

ఆంధ్రప్రదేశ్‌ లో వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాక వలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   17 Jun 2024 9:32 AM GMT
ఇదేందయ్యా.. ఇది అస్సలు ఊహించల!
X

ఆంధ్రప్రదేశ్‌ లో వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాక వలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ చొప్పున రాష్ట్రంలో దాదాపు 2.60 లక్షల మంది వలంటీర్లను నియమించారు. తమ గెలుపులో వలంటీర్ల వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందని జగన్‌ పెద్ద కలలే కన్నారు.

ఎన్నికల ముందు కొంత మంది వలంటీర్లు తమ ఉద్యోగానికి రాజీనామాలు చేసి మరీ వైసీపీ అభ్యర్థుల ప్రచారంలో పాలుపంచుకున్నారు. వారికి తలలో నాలుకలా వలంటీర్లు వ్యవహరించారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 1,08,000 మందికి పైగా వలంటీర్లు రాజీనామాలు చేసి వైసీపీ నేతల ప్రచారంలో తిరిగారు.

తాము గెలవగానే తిరిగి వలంటీర్లుగా నియమిస్తామని వైసీపీ నేతలు హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఎన్నికలు జరిగిన ఆ రెండు నెలలు కూడా వలంటీర్లకు జీతం మొత్తం వైసీపీ నేతలు చెల్లించారు. మరికొంత అదనపు మొత్తం కూడా ఇవ్వడంతో వలంటీర్లు వైసీపీ నేతలు చెప్పినట్టు చేశారు. మరికొంతమంది పార్టీపై అభిమానంతో రాజీనామా చేసి నేతలకు సహకరించారు.

సీన్‌ కట్‌ చేస్తే.. వైసీపీ ఘోర పరాజయం పాలైంది. దీంతో వలంటీర్లుగా రాజీనామా చేసినవారు ఇప్పుడు కుయ్యో మొర్రో అంటున్నారు. వైసీపీ నేతలు తమను బెదిరించి రాజీనామాలు చేయించారని వాపోతున్నారు. ఎన్నికల్లో తమకు సహకారం అందించకపోతే వలంటీర్‌ ఉద్యోగాల నుంచి తొలగిస్తామని బెదిరించారని ఆరోపిస్తున్నారు. రాజీనామా చేసి ఎన్నికల్లో సహకరిస్తే తిరిగి తాము గెలవగానే తీసుకుంటామని హామీ ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు పట్టించుకోవడం లేదని.. తద్వారా తమ పొట్ట కొట్టారని మండిపడుతున్నారు.

తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని రాజీనామాలు చేసిన వలంటీర్లు గత కొద్ది రోజులుగా కూటమి ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. అందులోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ముందు వలంటీర్ల సేవలు కొనసాగిస్తామని.. అంతేకాకుండా వారికి నెలకు రూ.10 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో రాజీనామాలు చేసిన వలంటీర్లు తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కూటమి ఎమ్మెల్యేలను కలిసి అభ్యర్థిస్తున్నారు.

ఇదంతా ఒక ఎత్తయితే ఇప్పుడు ఏకంగా వలంటీర్లు వైసీపీ నేతలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల ముందు ఆకస్మాత్తుగా సమావేశమంటూ పిలిస్తే వెళ్లామని.. వెళ్లాక రాజీనామాలు చేసి తమకు సహకరించాలని కోరారని పోలీసులకు తెలిపారు. తర్వాత కూడా మన ప్రభుత్వమే వస్తుందని.. ఇప్పుడు వలంటీర్‌ ఉద్యోగాలకు రాజీనామా చేసి ఎన్నికల్లో తమకు సహకరించకపోతే అంతుచూస్తామని బెదిరించారని ఫిర్యాదు చేశారు. అధికారం అడ్డు పెట్టుకుని వైసీపీ నేతలు చేసిన బెదిరింపులు, హెచ్చరికలతో వలంటీర్‌ ఉద్యోగాలకు రాజీనామా చేశామని వారంతా పోలీసుల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ మేరకు నెల్లూరులో రాజీనామా చేసిన వలంటీర్లు వైసీపీ నేతలపై ఏకంగా పోలీసులకే ఫిర్యాదు చేశారు. తమతో బెదిరించి రాజీనామాలు చేయించి తమను ఎన్నికల్లో వాడుకున్నారని.. ఇప్పుడు ఎన్నికల్లో ఓడిపోవడంతో తమను పట్టించుకోవడం లేదని వాపోయారు. తమను మోసం చేసి రోడ్డున పడేసిన వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని వలంటీర్లు పోలీసులను కోరారు. ఈ మేరకు నెల్లూరు 41వ డివిజన్, 21వ డివిజన్‌ కార్పొరేటర్లు, తదితర నాయకులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు అందించారు.