Begin typing your search above and press return to search.

వైసీపీ టీడీపీ ఫుల్ హ్యాపీ !

ఏపీలో సాగుతున్న పోలింగ్ సరళిని అటు అధికార వైసీపీ ఇటు విపక్ష టీడీపీ రెండూ ఫుల్ జోష్ తో ఆస్వాదిస్తున్నాయి

By:  Tupaki Desk   |   13 May 2024 6:58 AM GMT
వైసీపీ టీడీపీ ఫుల్ హ్యాపీ !
X

ఏపీలో సాగుతున్న పోలింగ్ సరళిని అటు అధికార వైసీపీ ఇటు విపక్ష టీడీపీ రెండూ ఫుల్ జోష్ తో ఆస్వాదిస్తున్నాయి. పోలింగ్ బాగా జరుగుతోంది అని రెండు వైపుల నుంచి నేతలు పూర్తి సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎక్కువగా జనాలు బారులు తీరి ఉండడం, ఉదయం నుంచే క్యూ లైన్లు పెద్దవిగా ఉండడంతో ఇదంతా తమకే పాజిటివ్ అని రెండు పార్టీల నేతలు చెప్పుకుని వస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అయితే విదేశాల నుంచి కూడా వచ్చి ఏపీలో ఓటేసేందుకు పోటెత్తిన వారిని చూస్తూంటే మార్పు కోసం మంచి కోసం అంతా కలసి వస్తున్నారు అని అంటున్నారు. అదే విధంగా ఏపీ ప్రగతిపథంలో నడవాలని చెప్పి ఓటర్లు తమ బాధ్యతను గుర్తెరిగి ఓట్లేసేందుకు భారీగా తరలిరావడం మంచి పరిణామం అని బాబు అన్నారు.

ఇక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అయితే ఓటర్లు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఓట్లు వేయాలని ట్వీట్ చేశారు. సీనియర్ మంత్రులు బొత్స సత్యనారాయణ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రజలు భారీగా పోలింగ్ కేంద్రాలకు రావడం అంటే అది తమకు సానుకూల పరిణామం అని అన్నారు.

మాజీ మంత్రులు పేర్ని నాని అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఓటర్లలో ఇంతటి చైతన్యం వెల్లి విరియడం శుభ పరిణామంగా అభివర్ణించారు. ఏపీలో తాము చేసిన మంచిని చూసే ఓటు వేయాలని వారు కోరారు. మరోసారి ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని వారు అన్నారు.

మంత్రి నగరి ఎమ్మెల్యే అభ్యర్ధి ఆర్కే రోజా మాట్లాడుతూ మహిళా ఓటర్లు ఎక్కువగా పోలింగ్ బూతులలో ఉంటున్నారని అలాగే గ్రామీణ ప్రాంతాలలోనే పెద్ద ఎత్తున ఓటింగ్ జరుగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయని అన్నారు. ఇవన్నీ కూడా వైసీపీకి మేలు చేసేవిగా తాము అంచనాకు వస్తున్నామని అన్నారు.

మొత్తం మీద చూస్తే ఓటర్లు బారులు తీరడాన్ని ఎవరికి వారు తమకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. పెద్ద ఎత్తున జనాలు క్యూలు కట్టడం ఏపీలో జరుగుతోంది. అదే సమయంలో ఓటర్లు గుంభనంగా ఉన్నారు. వారు ఎవరికి ఓటు వేసింది బయటకు చెప్పరు. కనీసం ఆ తరహా సంకేతాలు కూడా లేవు. దాంతో ఓటర్లు రాక అంతా తమ కోసమే అని నేతలు భావిస్తున్నారు.

ఎవరు ఓటేసినా అది ఈవీఎంలలో నిక్షిప్తం అయి ఉంటుంది. అసలు గుట్టు విప్పేది జూన్ 4వ తేదీన మాత్రమే. ఏది ఏమైనా ఏపీలో చూస్తే కనుక మే 13వ తేదీ ఒక పండుగ వాతావరణం గానే ఉంది. జనాలతో జాతరగా ఎక్కడ చూసినా కనిపిస్తోంది. పెద్ద ఎత్తున ఓటర్లు బూతులకు రావడం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని మేధావులు అంటున్నారు.