Begin typing your search above and press return to search.

ఏపీలో మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు.. ముహూర్తం అప్పుడేనా?

ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి భారీ విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   10 Jun 2024 6:04 AM GMT
ఏపీలో మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు.. ముహూర్తం  అప్పుడేనా?
X

ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి భారీ విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో కూటమి భారీ విక్టరీలో కీ రోల్ పోషించింది “సూపర్ సిక్స్” అనేది నిర్వివాదాంశం. ఇదే సమయంలో ఇటీవల కాలంలో రాజకీయాల్లో సక్సెస్ ఫుల్ హామీగా నిలిచిన "మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం" అనే అంశం మరింత హాట్ టాపిక్ గా మారింది.

కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఈ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనే హామీ.. వారు అధికారంలో రావడంలో కీలక భూమిక పోషించింది. ఇదే సమయంలో కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆ హామీని అమలు చేశారు. ఇదే సమయంలో తెలంగాణలోనూ ఆ హామీ ఆ పార్టీ అధికారంలోకి రావడానికి బలంగానే సహకరించింది.

ఇదే సమయంలో ఏపీలో టీడీపీ కూటమి కూడా తమ ఎన్నికల హామీల్లో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీని ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే... ఈ హామిని అమలు చేయడానికి కసరత్తులు మొదలుపెట్టారని అంటున్నారు. ఇందులో భాగంగా ఆర్టీసీ ఎండీకి ఈ మేరకు సాధ్యాసాధ్యాలపై వివరణ ఇవ్వాలని.. ప్రభుత్వంపై ఏ మేరకు భారం పడుతుందనే విషయాలను తెలపాలని కోరారని అంటున్నారు!

అయితే... ఈ హామీని కేవలం పల్లె వెలుగు బస్సులకు మాత్రమే అమలు చేయాలా.. లేక, రాష్ట్రం మొత్తం అమలుచేయాలా.. అదీగాకపోతే జిల్లా పరిధిలో మాత్రమే అమలు చేయాలా అనే విషయాలపై చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలో లక్షల సంఖ్యలో ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు ఉన్న పరిస్థితి. ఈ సమయంలో వారి ఉపాదికి ఏమాత్రం ఇబ్బంది కగలకుండా ఈ పథకాన్ని ఎలా అమలుచేయాలనే విషయాలపైనా చర్చిస్తున్నారని అంటున్నారు.

ఇదే సమయంలో ఇప్పటికే ఈ పథకం అమలులో ఉన్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని అధికారులతో కూడా చర్చించే అవకాశం ఉందని.. ఈ పథకం వల్ల ఆర్టీసీకి ఎంత ఆదాయం తగ్గుతుంది, ఎంత అదనపు భారం పడుతుందనే విషయాలను పరిగణలోకి తీసుకుని.. ఈ పథకం అమలుపై ఒక క్లారిటీకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

అయితే... ట్యాక్సీలు, ఆటోల డ్రైవర్లు ఇబ్బంది పడకుండా... మరో రెండు నుంచి మూడు నెలల్లో ఈ హామీని అమలుచేయబోతున్నారని అంటున్నారు. మరోపక్క దసరా కానుకగా ఈ పథకం అమలు మొదలుపెట్టే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఏది ఏమైనా... మరో రెండు మూడు నెలల్లో ఏపీలో మహిళలకు కూడా ఆర్టీసీ బస్సులో ఆధార్ కార్డు మాత్రం చూపించి ఉచితంగా ప్రయాణించే రోజులు రాబోతున్నాయని తెలుస్తుంది.