Begin typing your search above and press return to search.

'మంట' పెట్టిన చిచ్చు.. యువ నేతల మధ్య మాటల యుద్ధం!

ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం రాజమండ్రిలో జరిగిన ఘటన ఇద్దరు యువ నేతల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది

By:  Tupaki Desk   |   5 July 2024 9:59 AM GMT
మంట పెట్టిన చిచ్చు.. యువ నేతల మధ్య మాటల యుద్ధం!
X

ఆంధ్రప్రదేశ్‌ లో వైసీపీ ఘోరంగా పరాజయం పాలయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార మత్తులో టీడీపీ నేతలు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా తమపై దాడులు చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వైసీపీ కార్యకర్తలపై దాడులు చేయడం, వైఎస్సార్‌ విగ్రహాలు ధ్వంసం చేయడం, వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన వివిధ శిలా ఫలకాలను పగులకొట్టడం చేస్తున్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు.

ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం రాజమండ్రిలో జరిగిన ఘటన ఇద్దరు యువ నేతల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. రాజమండ్రిలో వీఎల్‌ పురంలోని మార్గాని ఎస్టేట్స్‌ కార్యాలయంలో వైసీపీ యువ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌ ప్రచార వాహనానికి ఎవరో నిప్పుపెట్టారు. అది మంటల్లో పూర్తిగా ధగ్ధమైంది.

ఈ నేపథ్యంలో టీడీపీ వాళ్లే తన ప్రచార రథాన్ని తగులబెట్టారని మార్గాని భరత్‌ సంచలన ఆరోపణలు చేశారు. రాజమండ్రిలో అంతకుముందు ఇలాంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదన్నారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి పనులు చేయలేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా తమ శ్రేణులపై టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

మరోవైపు మార్గాని భరత్‌ ఆరోపణలను రాజమండ్రి సిటీ టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తీవ్రంగా ఖండించారు. ఆకతాయిలను పెంచి పోషించింది వైసీపీయేనని మండిపడ్డారు. ప్రచార రథం తగలబడిన ఘటనపై తానే జిల్లా ఎస్పీకి ఫోన్‌ చేసి తప్పు చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరానని గుర్తు చేశారు. తమకు చాలా అంశాలు ఉన్నాయని.. ఇలాంటి పనులు చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు.

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మార్గాని భరత్‌.. రాజమండ్రి సిటీ నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు చేతిలో ఓడిపోయారు. ఎన్నికల ప్రచారం సందర్భంగానూ ఈ ఇద్దరు యువ నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఆదిరెడ్డి వాసు స్వయానా దివంగత మాజీ కేంద్ర మంత్రి ఎర్రన్నాయుడుకు అల్లుడు. ప్రస్తుత కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడుకు స్వయానా బావ.

కాగా ఇద్దరు యువ నేతల మధ్య మాటల యుద్ధానికి దారితీసిన ప్రచార రథానికి సంబంధించి వ్యవహారాన్ని పోలీసులు చేధించారు. నిందితుడిని అరెస్టు చేశారు. రాజమండ్రి వీఎల్‌ పురానికి చెందిన దంగేటి శివాజీ ప్రచార రథాన్ని తగులబెట్టాడని వెల్లడైంది. శివాజీ వైసీపీ కార్యకర్త. అంతేకాకుండా మార్గాని భరత్‌ తండ్రికి ముఖ్య అనుచరుడిగా ఉన్నాడని పోలీసులు తెలిపారు.

ఎన్నికల్లో ఓడిపోయాక భరత్‌ కు ప్రజల్లో సానుభూతి రావాలనే తాను ఆయన ప్రచార రథాన్ని తగులబెట్టినట్టు దంగేటి శివాజీ పోలీసులకు వెల్లడించినట్టు సమాచారం. తానే తగులబెట్టి టీడీపీ వాళ్లు తగులబెట్టారని వారి మీదకు నెట్టేందుకు కుట్రపన్నాడు. సీసీ పుటేజీ ఆధారంగా నిందితుడిని పట్టుకున్నామని పోలీసులు తెలిపారు.

ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మరోసారి మండిపడ్డారు. వైసీపీ నీచ రాజకీయాలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. వారే వాళ్ల ప్రచార రథాన్ని తగులబెట్టుకుని తమపై నిందలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఇలాంటి నీచ రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు.