‘గవర్నర్..రాష్ట్రపతి’..చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నే టార్గెట్ చేసిన కేజ్రీ
బుధవారం పోలింగ్ జరగనున్న ఢిల్లీలో సోమవారంతో ప్రచారం ముగిసింది. చివరి రోజు ప్రచారం మరింత హోరెత్తింది.
By: Tupaki Desk | 4 Feb 2025 9:00 AM GMTఅనేక పెద్ద రాష్టాలు.. చిన్న రాష్ట్రాలనూ తేలికగా గెలిచేసిన బీజేపీకి.. కేంద్రంలోనూ మూడుసార్లు అధికారం దక్కిన బీజేపీకి.. పదేళ్లుగా ఏమాత్రం కొరుకుడుపడలేదు ‘ఢిల్లీ’. 72 సీట్లున్న చిన్న ప్రాంతంలోని ప్రజల మనసు చూరగొనలేకపోయింది. అలాంటి చోట మళ్లీ ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి.
బుధవారం పోలింగ్ జరగనున్న ఢిల్లీలో సోమవారంతో ప్రచారం ముగిసింది. చివరి రోజు ప్రచారం మరింత హోరెత్తింది. తెలుగు రాష్ట్రాల సీఎంల నుంచి ప్రధాని మోదీ వరకు ఎందరో ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాగా, భారత్ వంటి అతిపెద్ద దేశంలో అతిపెద్ద టాస్క్ అయిన ఎన్నికలను నిర్వహించేది కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ). ఇటీవలి కాలంలో జమ్మూ కశ్మీర్ వంటి రాష్ట్రంలోనూ ఎన్నికలను సమర్థంగా నిర్వహించిన చరిత్ర ఉన్న సీఈసీని ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ తీవ్రంగా టార్గెట్ చేశారు.
దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడూ చేయనట్లుగా ప్రధాన ఎన్నికల కమిషనర్ ను కేజ్రీ టార్గెట్ చేశారు. అయితే, దేశంలో సీఈసీపై ఇప్పటివరకు తీవ్రమైన ఆరోపణ వచ్చింది లేదు. కానీ, వ్యక్తిగత ప్రయోజనాల కోసం సీఈసీ ప్రజాస్వామ్యాన్ని పణంగా పెడుతున్నారంటూ కేజ్రీ మండిపడ్డారు. ఈ నెలాఖరులో పదవీ విరమణ చేయబోతున్న రాజీవ్ కుమార్ బీజేపీకి సాగిలపడుతున్నారని పేర్కొన్నారు.
కేంద్ర ఎన్నికల కమిషన్ దేశంలో అసలు ఎన్నికల కమిషన్ లేదన్నట్లు బీజేపీకి దాసోహమైందని కేజ్రీ వ్యాఖ్యానించారు. పదవీ విరమణ తర్వాత రాజీవ్ కుమార్ కు పదవిని ఇస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారని.. ‘‘గవర్నర్ పదవా? ఏకంగా రాష్ట్రపతి పదవినే ఇస్తున్నారా?’’ అని కేజ్రీ వ్యాఖ్యానించారు.
ఈవీఎంల ద్వారా బీజేపీ పది శాతం ఓట్లను రిగ్గింగ్ చేయొచ్చని.. ఢిల్లీ ప్రజలు తమకు 15 శాతం అధికంగా ఓట్లు వచ్చేలా చూడాలని కోరారు. రాజీవ్ కుమార్ కు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నానని.. మీ విధి మీరు నిర్వర్తించాలని.. ఇంకా పదవులు చేపట్టాలనే దురాశ ఉంటే వదిలేసుకోవాలని కోరారు. ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయొద్దంటూ మండిపడ్డారు. రాజీవ్ కుమార్ తన బాధ్యతలను నైతిక నిష్ఠతో నిర్వహించాలని విన్నవించారు. ప్రజాస్వామ్యాన్ని పణంగా పెట్టి వ్యక్తిగత ఆకాంక్షలను నెరవేర్చుకోవద్దని హితవు పలికారు.
ప్రజలంతా ఓటింగ్ కు పెద్దఎత్తున తరలివచ్చి ప్రతి ఓటూ తమ గుర్తు చీపురుకట్టకే వేయాలని కేజ్రీ కోరారు. 15 శాతం ఓట్ల అధిక్యం వస్తేనే.. వాళ్లు ఎన్ని అక్రమాలు చేసినా ఆప్ నకు విజయ దక్కుతుందని పేర్కొన్నారు. కాగా, కేజ్రీవాల్ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఏకంగా కేంద్ర ఎన్నికల సంఘం ఉనికే ప్రశ్నిస్తున్న ఆయన వ్యాఖ్యల పట్ల సీఈసీ స్పందిస్తుందా? లేదా? పోలింగ్ ముంగిట ఏం చర్యలు తీసుకుంటుంది..? అనేది చూడాలి. అన్నిటికిమించి ఢిల్లీ ఓటర్లు ఎలా స్పందిస్తారు? అనేది చర్చనీయాంశంగా మారింది.