రాహుల్ ను నేను పెళ్లాడలే..మోదీ కంటే కేజ్రీ కన్నింగ్..ఢిల్లీలో మంటలు
ప్రతిపక్ష ఇండియా కూటమిలో భాగస్వాములైన కాంగ్రెస్, ఆప్.. ఢిల్లీ ఎన్నికల్లో విడివిడిగా పోటీ పడుతున్నాయి.
By: Tupaki Desk | 31 Jan 2025 10:02 AM GMTచిక్కటి చలికాలంలోనూ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు వేడి రగిలిస్తున్నాయి.. ఓవైపు ప్రధాని మోదీ.. ఓ సాధారణ అభ్యర్థి కాళ్లు మొక్కడం సంచలనంగా మారితే, మరోవైపు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ, ఆప్ అధినేత కేజ్రీవాల్ పరస్పరం చేసుకుంటున్న విమర్శలు తీవ్ర చర్చనీయం అవుతున్నాయి. వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని ఆప్.. ఢిల్లీ గద్దె దక్కినా, ఢిల్లీని గెలవలేకపోతున్న బాధలో బీజేపీ, పరువు దక్కించుకోవాలని కాంగ్రెస్.. ఇలా ఎవరికి వారు తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. దీంతో మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్న దేశ రాజధానిలో వాతావరణం బాగా వేడెక్కింది. మాటల తూటాలూ అంతే స్థాయిలో పేలుతున్నాయి.
‘ఇండియా’లో కలిసి.. ఢిల్లీలో విడివిడి
ప్రతిపక్ష ఇండియా కూటమిలో భాగస్వాములైన కాంగ్రెస్, ఆప్.. ఢిల్లీ ఎన్నికల్లో విడివిడిగా పోటీ పడుతున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో కలిసి బరిలో దిగిన ఈ పార్టీలు 8 నెలల్లోనే వేరు దారి పట్టాయి. వాస్తవానికి విడిగా పోటీ చేయడం వెనుక.. బీజేపీకి టార్గెట్ కాకూడదనే ఆలోచన ఉందనేది విశ్లేషకుల మాట. ఫలితాల తర్వాత కలిసే చాన్స్ ఉందనేది వారి అభిప్రాయం. ఎన్నికల రణ క్షేత్రంలో మాత్రం రాహుల్, కేజ్రీ తీవ్రంగా విమర్శించుకుంటున్నారు. వీరిద్దరి ఉమ్మడి శత్రువు అయిన ప్రధాని మోదీ కూడా ఈ స్థాయిలో విమర్శించకపోవడం గమనార్హం.
నా భవిష్యత నా భార్యతోనే..
ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్, ఆప్ పరిస్థితి ఏమిటి? అంటూ మీడియా కేజ్రీని అడగ్గా ఆయన తీవ్ర వ్యంగ్యంగా స్పందించారు. తానేమీ రాహుల్ ను పెళ్లి చేసుకోలేదంటూ వెటకారం ఆడారు. తన భవిష్యత్ తన భార్యతోనే అని సమాధానం చెప్పారు. ప్రచారంలో తనపై రాహుల్ బీజేపీ భాష వాడుతున్నారని.. దీనివెనుక ఎవరి ఒత్తిడి ఉందోనని కేజ్రీ విమర్శించారు.
కేజ్రీ అబద్ధాల కోరు..
కేజ్రీపై రాహుల్ సైతం తీవ్ర విమర్శలకు దిగుతున్నారు. మోదీ లాగానే కేజ్రీ కూడా అబద్ధాల కోరు అని వ్యాఖ్యానించారు. వారిద్దరి మధ్య తేడాలేమీ లేవని.. ఒకవిధంగా మోదీ కంటే కేజ్రీనే కన్నింగ్ అని అన్నారు. ఐదేళ్లలో యమునా నది నీళ్లను తాగేందుకు అనువుగా మారుస్తానన్న హామీ ఏమైదని నిలదీశారు. తాము గెలిస్తే కర్ణాటక, తెలంగాణ తరహాలో హామీలు అమలు చేస్తామని చెప్పారు.