Begin typing your search above and press return to search.

అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యల వివాదం... చంద్రబాబు అభిప్రాయం అడిగిన కేజ్రీవాల్!

రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసినట్లు చెబుతున్న వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి.

By:  Tupaki Desk   |   19 Dec 2024 9:19 AM GMT
అంబేద్కర్  పై అమిత్  షా వ్యాఖ్యల వివాదం... చంద్రబాబు అభిప్రాయం అడిగిన కేజ్రీవాల్!
X

రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసినట్లు చెబుతున్న వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. ఇందులో భాగంగా.. లోక్ సభ, రాజ్యసభ, పార్లమెంటు ఆవరణలోనూ కాంగ్రెస్ పార్టీతో పాటు విపక్ష పార్టీలు.. అమిత్ షా క్షమపణలు చెప్పాలంటూ గళమెత్తాయి. ఈ విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

అటు ఉభయ సభల్లోనూ, ఇటు బయటా కూడా ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఈ సందర్భంగా... అమిత్ షా రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసింది. అలాకానిపక్షంలో.. ప్రధాని నరేంద్ర మోడీ ఆయనను తొలగించాలని డిమాండ్ చేసింది. మరోపక్క దేశవ్యాప్తంగా విపక్షాలు ఆందోళనలు నిర్వహిస్తున్నాయి.

ఇలా లోక్ సభ లోనూ, రాజ్యసభలోను, పార్లమెంట్ ఆవరణలోనూ నిరసనలు గురువారం తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఈ సందర్భంగా స్పందించిన మల్లికార్జున ఖర్గే... తనలాంటి కోట్ల మంది ప్రజలకు అంబేద్కర్ దేవుడనే విషయాన్ని మంత్రులు, మోడీ ప్రభుత్వం గుర్తెరగాలని.. ఆయన దేవుడి కంటే తక్కువేమీ కాదని.. అంబేద్కర్ మహాపురుషుడని తెలిపారు.

ఇదే విషయంపై స్పందించిన రాహుల్ గాంధీ... రాజ్యాంగ నిర్మాతను అవమానించిన అమిత్ షా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బాబాసాహెబ్ సిద్ధాంతాలకు బీజేపీ వ్యతిరేకమని విమర్శించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానించడాన్ని దేశం క్షమించదని స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో స్పందించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా... తన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ వక్రీకరించిందని.. తమ పార్టీ ఏనాడు అంబేద్కర్ ను అవమానించలేదని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో... రాజ్యాంగ నిర్మాతను సంపూర్ణంగ గౌరవించేది తామేనని ప్రధాని పోస్ట్ చేశారు.

చంద్రబాబుకు కేజ్రీవాల్ లేఖ:!

ఇలా రాజ్యాగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై అమిత్ షా అవమానకరంగా మాట్లాడారంటూ రేగిన వివాదం తీవ్రస్థాయిలో చర్చనీయాంశం అయిన వేళ ఓ ఆసక్తికర పరిణామం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... అమిత్ షా వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏమిటో చెప్పాలంటూ చంద్రబాబుకు కేజ్రీవాల్ లేఖ రాశారు. దాన్ని ఎక్స్ లో పోస్ట్ చేశారు.

అవును... బాబాసాహెబ్ ను అమిత్ షా అవమానించారు.. ఈ అవమానానికి మీ మద్దతు ఉందా..? మీ నుంచి సమాధానం కోసం యావత్ దేశం ఎదురు చూస్తోంది! అంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లేఖ రాశారు. ఇదే సమయంలో.. బీహార్ సీఎం నితీశ్ కు లేఖ రాశారు.

ఇదే సమయంలో... అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలు సమర్థనీయం కాదని.. కోట్లాది మంది మనోభావాలు దెబ్బ తిన్నాయని.. అమిత్ షా కనీసం క్షమాపణలు కూడా చెప్పడం లేదని.. ప్రధాని మోదీ కూడా షా నే సమర్థిస్తున్నారని.. ఈ సమయంలో బీజేపీ మద్దతుపై పునరాలోచించుకోవాలని కేజ్రీవాల్ లేఖలో కోరారు.

దీంతో... ఈ లేఖపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తారా.. లేక సైలంట్ గా ఉంటారా అనేది వేచి చూడాలి!

కాగా.. అంబేద్కర్ పేరు జపించడం కాంగ్రెస్ పార్టీ నేతలకు ఫ్యాషన్ గా మారిపోయిందని.. అన్ని సార్లు దేవుడి పేరు జపిస్తే ఏడు జన్మలకు సరిపడా పుణ్యం వచ్చి, స్వర్గానికి వెళ్లేవారని అమిత్ షా ఆక్షేపించారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తో పాటు విపక్షాలు అమిత్ షా, మోడీ, బీజేపీ పై విరుచుకుపడుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే ఇలాంటి వ్యాఖ్యలు చేసి, రాజ్యాంగ నిర్మాతను అవమాన పరిచారని.. దీనిపై బీజేపీకి మద్దతు ఇస్తున్న మీ మీ అభిప్రాయాలు చెప్పాలంటూ చంద్రబాబు, నితీశ్ లకు అరవింద్ కేజ్రీవాల్ లేఖలు రాశారు. మరి దీనిపై రియాక్షన్ వస్తుందా లేదా అనే విషయంపై ఆసక్తికర చర్చ నడుస్తుంది.