మీ వల్ల పార్టీ పరువు పోయింది.. : ఎమ్మెల్యేపై చంద్రబాబు సీరియస్?
ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా సొంత పార్టీకే చెందిన ఓ ఎమ్మెల్యేపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
By: Tupaki Desk | 8 March 2025 10:46 AM ISTఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా సొంత పార్టీకే చెందిన ఓ ఎమ్మెల్యేపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ``మీ వల్ల పార్టీ పరువు పోయింది. సంజాయిషీ ఇవ్వండి`` అని తన ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ ఆదేశాలను పార్టీ రాష్ట్ర చీఫ్‌పల్లా శ్రీనివాసరావు ద్వారా.. సదరు ఎమ్మెల్యేకు పంపించాలని చంద్రబాబు తేల్చి చెప్పారు. అంతేకాదు.. ఇలాంటి ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చి తప్పు చేశానా? అని కూడా చంద్రబాబు వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ వ్యవహారంపై ముందుగా మంత్రివర్గంలో చర్చించిన ఆయన.. సదరు ఎమ్మెల్యే విషయంలో తీవ్రంగా స్పందించకపోతే.. మున్ముందు ఎవరినీ కట్టడి చేయలేని పరిస్థితి నెలకొంటుందన్నారు.
విషయం ఇదీ..
గుంటూరు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యేగా చదలవాడ అరవిందబాబు వ్యవహరిస్తున్నారు. గతంలో వైసీపీలో పనిచేసిన ఆయన గత ఏడాది ఎన్నికలకు ఆరు మాసాల ముందు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలోనే నరసరావుపేట ఎమ్మెల్యే టికెట్‌ను పొంది.. విజయం దక్కించుకున్నారు. వాస్తవానికి సౌమ్యుడిగా పేరున్న అరవింద బాబు.. తాజాగా నియోజకవర్గంలో రచ్చ చేశారన్న విమర్శలు వస్తున్నాయి. తన నియోజకవర్గం పరిధిలో మద్యం ఉత్పత్తి చేసే ఐఎంఎల్ కంపెనీలో తాను చెప్పిన వారికి ఉద్యోగాలు ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. వాస్తవానికి ఇలాంటి డిమాండ్లు చాలా నియోజకవర్గాల్లో ఉన్నాయి. అక్కడ నాయకులు సౌమ్యంగా మాట్లాడి పనులు చేయించుకుంటున్నారు.
అంటే.. వైసీపీ హయాంలో నియమితులైన ఔట్ సోర్సింగ్ సిబ్బందిని తొలగించి.. తమ వారికి అవకాశం కల్పించాలన్నది ఎమ్మెల్యే అరవిందబాబు డిమాండ్. అయితే.. ఈక్రమంలో ఆయన ఒక పద్ధతి ప్రకారం వ్యవహరించకుండా.. జిల్లా ఎక్సైజ్ కమిషనర్ ఆసుపత్రికి వెళ్లి రభస సృష్టించారన్నది చంద్రబాబు కు అందిన సమాచారం. గురువారం మధ్యాహ్నం 1గంటకు అధికారి ఆఫీసుకు వెల్లిన చదలవాడ.. గంటలోనే తాను చెప్పిన వారికి ఔట్ సోర్సింగ్ పోస్టులు ఇవ్వాలని.. అదేవిధంగా ప్రస్తుతం ఉన్నవారిని తొలగించాలని డిమాండ్ చేశారు. దీనిపై ఎక్సైజ్ కమిషనర్.. పరిశీలిస్తానని చెప్పారు.
తిరిగి మధ్యాహ్నం 3 గంటల సమయంలో కమిషనర్ ఆఫీసుకు వచ్చిన ఎమ్మెల్యే.. తాను చెప్పినట్టు ఔట్ సోర్సింగ్ సిబ్బందిని నియమించారా?(కేవలం రెండు గంటల వ్యవధిలో) అని సిబ్బందిని గద్దించారు. అయితే.. ఆ సమయంలో కమిషనర్ లేరని, వచ్చాక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఉన్నతాధికారులు చెప్పారు. దీనిని వినిపించుకోని అరవిందబాబు.. అక్కడ దారుణంగా వ్యవహరించారు అని అంటున్నారు. నేలపై పడుకుని.. కమిషనర్ చాంబర్‌లోకి వెళ్లి.. ఇలా.. అరుపులు కేకలతో రచ్చ చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో పార్టీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు.. అరవిందబాబు నుంచి సంజాయిషీ కోరడం గమనార్హం.