Begin typing your search above and press return to search.

న్యాయమూర్తిని వింత కోరిక కోరిన ముఖ్యమంత్రి!

ఢిల్లీ మద్యం కుంభకోణంకు సంబంధించి ఆప్‌ అధినేత, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ను ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   27 Jun 2024 11:30 AM GMT
న్యాయమూర్తిని వింత కోరిక కోరిన ముఖ్యమంత్రి!
X

ఢిల్లీ మద్యం కుంభకోణంకు సంబంధించి ఆప్‌ అధినేత, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ను ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆయన ఢిల్లీలోని తీహార్‌ జైలులో ఉన్నారు. కాగా కొద్ది రోజుల క్రితం ఢిల్లీలోని రౌజ్‌ అవెన్యూ కోర్టు ఆయనకు బెయిల్‌ మంజూరు చేయగా ఢిల్లీ హైకోర్టు ఆ తీర్పుపై స్టే ఇచ్చింది. ఆ తర్వాత ఆ తీర్పును రద్దు చేసింది. దీంతో అరవింద్‌ కేజ్రీవాల్‌ జైలు నుంచి విడుదల కాలేదు.

మరోవైపు ఢిల్లీ మద్యం కుంభకోణం మనీలాండరింగ్‌ అంశంతో ముడిపడి ఉందంటూ సీబీఐ రంగంలోకి దిగింది. ఈ వ్యవహారంలోనూ కేజ్రీవాల్‌ ను అరెస్టు చేసేందుకు సీబీఐ కోర్టు అనుమతిని కోరగా న్యాయస్థానం ఇందుకు అంగీకరించింది. దీంతో సీబీఐ అధికారులు కేజ్రీవాల్‌ ను అరెస్టు చేశారు. తీహార్‌ జైలు నుంచి తీసుకొచ్చి కోర్టు ముందు ఆయనను సీబీఐ అధికారులు హాజరుపరిచారు. ఆయనను ఐదు రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని కోరగా.. కోర్టు కేజ్రీవాల్‌ ను మూడు రోజుల సీబీఐ కస్టడీకి అప్పగించింది.

ఈ సందర్భంగా న్యాయమూర్తిని కేజ్రీవాల్‌ ఒక వింత కోరిక కోరారు. తన బెల్టును జైలు అధికారులు తీసేసుకున్నారని.. దీంతో తన ప్యాంటు జారిపోతోందని కేజ్రీవాల్‌ న్యాయమూర్తికి నివేదించారు, దీంతో ప్యాంటు జారిపోకుండా తాను చేత్తో ప్యాంటును పట్టుకోవాల్సి వస్తుందని తెలిపారు. జైలు నుంచి కోర్టుకు వచ్చేటప్పుడు, తిరిగి వెళ్లేటప్పుడు ఇది తనకు ఇబ్బందిగా మారిందన్నారు. ఈ నేపథ్యంలో తనకు బెల్టు ఇచ్చేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు.

ఈ నేపథ్యంలో ఢిల్లీలోని రౌజ్‌ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్‌ కు కళ్లద్దాలు, మందులు, ఇంటి భోజనం, భగవద్గీత కాపీని అందించాలని ఆదేశించింది. అలాగే ఆయనకు ప్యాంటు బెల్టును కూడా ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే తన సతీమణి సునీత, ఇతర బంధువులు రోజూ కేజ్రీవాల్‌ ను కలవడానికి అనుమతి మంజూరు చేసింది. రోజూ గంటపాటు వీరు కలవవచ్చని తెలిపింది.

సీబీఐ అధికారులు తనను కోర్టులో ప్రవేశపెట్టిన సందర్భంగా కేజ్రీవాల్‌ స్వయంగా వాదనలు వినిపించుకున్నారు. తాను నిర్దోషినని తెలిపారు. మద్యం కుంభకోణం తప్పిదమంతా ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియాదేనని తాను అన్నట్టుగా వచ్చిన వార్తలను ఖండించారు. అలాంటి వాంగూల్మం ఏదీ తాను ఇవ్వలేదన్నారు. తమను అప్రతిష్టపాలు చేయడానికి ఇదంతా సీబీఐ చేస్తున్న కుట్ర అని మండిపడ్డారు.

కాగా మూడు రోజుల సీబీఐ కస్టడి ముగిసిన అనంతరం కేజ్రీవాల్‌ ను జూన్‌ 29 సాయంత్రం 7 గంటలకు సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరుస్తారు. సీబీఐ అరెస్ట్‌ నేపథ్యంలో సుప్రీం కోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ ను కేజ్రీవాల్‌ వెనక్కి తీసుకున్నారు. సీబీఐ అరెస్టు నేపథ్యంలో మళ్లీ కొత్త పిటిషన్‌ దాఖలు చేసే ఉద్దేశంతో ఉన్నారు.