జైలు నుంచే కేజ్రీవాల్ పాలన... న్యాయనిపుణుల అభిప్రాయాలివే!
మరోపక్క తమ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అనంతరం ఆయన భద్రతపై ఆం ఆద్మీ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
By: Tupaki Desk | 22 March 2024 9:17 AM GMTదేశరాజధానిలో మద్యంపాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆం ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశం దేశవ్యాప్తంగా సంచలన సృష్టించింది. గురువారం రాత్రి సీఎం నివాసంలో సోదాలు నిర్వహించిన అధికారులు ఆయనను ప్రశ్నించిన అనంతరం అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం కేజ్రీవాల్ ను లాకప్ లో ఉంచినట్లు చెబుతున్నారు. దీనిపై నేడు అత్యవసర విచారణ చేపట్టే అవకాశముంది.
మరోపక్క తమ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అనంతరం ఆయన భద్రతపై ఆం ఆద్మీ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా... ఆయనకు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉందని, ఈడీ కస్టడీలో ఇప్పుడు కేంద్రం తగిన రక్షణ కల్పిస్తుందా అని ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో... జైలు నుంచే పాలన సాగిస్తారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో... ప్రాక్టికల్ గా అది సాధ్యమేనా.. ఆ వెసులుబాటు ఉందా.. అనే విషయాలపై న్యాయనిపుణులు స్పందిస్తున్నారు.
అరెస్టై ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్.. జైలు నుంచే పాలన సాగిస్తారనే విషయంపై న్యాయనిపుణులు స్పందిస్తున్నారు. ఇందులో భాగంగా... చట్టప్రకారం అరవింద్ కేజ్రీవాల్ తన సీఎం పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదని.. ముఖ్యమంత్రిగా జైలు నుంచి కూడా తన ప్రభుత్వాన్ని నడపగలడని చెబుతున్నారు. ఇదే సమయంలో కోర్టు అనుమతి తీసుకుని క్యాబినెట్ సమావేశాలూ నిర్వహించవచ్చని అంటున్నారు.
ఇదే సమయంలో... ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి కేవలం నిందితుడు అయినప్పటికీ... జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపకుండా అతడిని నిరోధించలేమని అంటున్నారు. జైలు నిబంధనలను అనుసరించి ఆయన క్యాబినెట్ సమావేశాలకు హాజరవుతు, ఫైళ్లపై సంతకాలు కూడా చేయవచ్చని.. అయితే అది ప్రతీసారి అందుబాటులో ఉండదని.. కోర్టు నుంచి ముందస్తు అనుమతి తర్వాతే అని అంటున్నారు.
ఇక భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ - 361 ప్రకారం క్రిమినల్ లేదా సివిల్ ప్రొసీడింగ్ ల నుంచి భారత రాష్ట్రపతి, రాష్ట్రాల గవర్నర్ లకు మాత్రమే రెసిస్టెన్సీ పవర్ ఉంటుందని.. అది వారికి మాత్రమే వర్తిస్తుందని.. అయితే... నేరం రుజువైనప్పుడు మాత్రమే ముఖ్యమంత్రి అనర్హుడిగా తొలగించబడతారని మరో న్యాయనిపుణులు చెబుతున్నారు. అప్పటివరకూ ఆయన పాలన సాగించడం అనేది ఆయన వ్యక్తిగత నిర్ణయం అని చెబుతున్నారు!
ఇదే క్రమంలో... ఒక ముఖ్యమంత్రి జైలు నుంచి పరిపాలన కొనసాగించడానికి అనుమతించడం వల నైతిక, ఆచరణాత్మక సమస్యలు తలెత్తవచ్చనే అభిప్రాయాన్ని మరో న్యాయనిపుణులు వెల్లడించారు. న్యాయపాలన, జవాబుదారీ తనం, ప్రభుత్వంపై ప్రజలకున్న నమ్మకాన్ని సదరు నిర్ణయం దెబ్బతీయవచ్చనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇలా... జైలు నుంచే పరిపాలన విషయంలో చట్ట ప్రకారం అన్ని అవకాశాలున్నాయని చెబుతున్నా.. కొంతమంది మాత్రం నైతికత అనే అంశాన్ని తెరపైకి తెస్తున్నారు!!