Begin typing your search above and press return to search.

టీటీడీపీ ప్రెసిడెంట్ గా అరవింద్ కుమార్ గౌడ్ ?

తెలంగాణలో తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకుని వెళ్లాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆలోచిస్తున్నారు.

By:  Tupaki Desk   |   3 Aug 2024 3:43 AM GMT
టీటీడీపీ ప్రెసిడెంట్ గా అరవింద్ కుమార్ గౌడ్ ?
X

తెలంగాణలో తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకుని వెళ్లాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆలోచిస్తున్నారు. ఏపీలో బ్రహ్మాండమైన మెజారిటీతో కూటమి అధికారంలోకి వచ్చింది. ఒక విధంగా చెప్పాలీ అంటే అసలు ప్రతిపక్షమే లేదు. దాంతో పాటుగా కేంద్రంలో ఎన్డీయే లో కీలకంగా టీడీపీ ఉంది.

ఇక తెలంగాణలో చూస్తే బీఆర్ఎస్ ఓటమి తరువాత నానాటికీ గ్రాఫ్ తగ్గిపోతోంది. టీడీపీని నష్టపరచి బీఆర్ఎస్ ఎదిగింది. ఇపుడు బీఆర్ఎస్ రేసులో వెనక్కి వెళ్లడంతో టీడీపీకి మంచి రోజులు వచ్చినట్లే అని అంటున్నారు.

ఈ పరిణామాల నేపధ్యంలో చంద్రబాబు తెలంగాణలో టీడీపీని గేర్ మార్చి స్పీడ్ పెంచాలని చూస్తున్నారు అని అంటున్నారు. టీడీపీకి పూర్వ వైభవం తీసుకుని రావాలని ఆయన ఆలోచిస్తున్నారు. ఇప్పటికీ గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి,నల్గొండ, ఖమ్మం వంటి చోట్ల టీడీపీకి బలం ఉంది. దాంతో పార్టీని పట్టాలెక్కిస్తే రానున్న స్థానిక సంస్థలలో ధీటుగా తలపడి మంచి ఫలితాలు అందుకుంటుందని బాబు ఆలోచిస్తున్నారుట.

ఈ నేపధ్యంలో పార్టీ పగ్గాలను బీసీ నేతకు అప్పగించాలని బాబు నిర్ణయించారు. తెలంగాణా టీడీపీలో మొదటి నుంచి ఉంటూ పార్టీని నమ్ముకున్న వారికే ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన భావిస్తున్నారు. మధ్యలో వచ్చి పార్టీలో చేరి హడావుడి చేసిన కాసాని జ్ఞానేశ్వర్ మధ్యలోనే వెళ్ళిపోయారు. దాంతో బాబు పార్టీలో దశాబ్దాలుగా ఉంటూ వచ్చిన బీసీ నేత అరవింద్ కుమార్ గౌడ్ కి పార్టీ పగ్గాలు అప్పగిస్తారు అని అంటున్నారు.

ఆయన ఎవరో కాదు మాజీ హోం మంత్రి ఉమ్మడి ఏపీలో టీడీపీలో చక్రం తిప్పిన దేవేందర్ గౌడ్ కి స్వయాన మేనల్లుడే. బలమైన బీసీ నేతగా బాబుకు వీర విధేయుడుగా ముద్ర పడిన అరవింద్ కుమార్ కి పార్టీ బాధ్యతలు అప్పగిస్తే తెలంగాణాలో సైకిల్ దూసుకుపోతుందని బాబు భావిస్తున్నారుట.

తాజాగా అరవింద్ కుమార్ గౌడ్ అమరావతి వచ్చి చంద్రబాబుని కలిశారు. దాంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరుంది. శ్రావణ మాసంలో మంచి ముహూర్తం చూసి అరవింద్ పేరుని బాబు ప్రకటిస్తారని ఆ మీదట ఆయన అధ్యక్ష బాధ్యతలు కూడా ఘనంగా నిర్వహించేలా చూస్తారని అంటున్నారు.

ఇక ఏపీలో అధికారం ఉంది కాబట్టి తెలంగాణా నేతలకు టీటీడీ బోర్డులో మెంబర్స్ గానూ అలాగే రాజ్యసభ సీట్లలో అవకాశాలను ఇవ్వడం ద్వారా అధికారానికి కూడా దగ్గర చేయాలని చూస్తున్నారుట. మొత్తానికి తెలంగాణలో బీజేపీ ఇపుడు సెకండ్ ప్లేస్ కోసం పోటీ పడుతోంది. ఆ పార్టీకి జనసేనతో పొత్తు ఉంది. టీడీపీ కూడా బలపడితే అపుడు ఎన్డీయే కూటమిగా తెలంగాణాలోనూ మూడు పార్టీలూ పోటీ చేస్తాయా అన్న చర్చ కూడా సాగుతోంది.