ఎన్నికల టైంలో ఇవేం మాటలు అర్వింద్!
నిజామాబాద్ ఎంపీ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న ఆయన.. తాజాగా ఒక ఇష్యూలో తీవ్రమైన ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు.
By: Tupaki Desk | 8 April 2024 6:30 AM GMTకాలం మారింది. గతంలో మాదిరి కాదు. ఏళ్లకు ఏళ్లు బాగుండి.. చిన్న విషయంలో తేడాగా మాట్లాడినా.. దాని కారణంగా జరిగే డ్యామేజ్ ఎంత భారీగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీడియా స్థానే సోషల్ మీడియా రావటం.. ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ కెమేరాతో ఎక్కడ ఏ చిన్న అంశం జరిగినా వెంటనే ప్రపంచానికి తెలిసిపోయే పరిస్థితి. దీంతో.. ప్రముఖులు.. రాజకీయనేతలు జర జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మిగిలిన వారికి నేతలకు ఒక ఇబ్బంది ఉంటుంది. విడి రోజుల్లో ఫర్లేదు కానీ ఎన్నికల టైంలో ప్రతి అంశం చాలా సున్నితంగా ఉంటుంది. ఏ అంశం ఎలా ట్రిగ్గర్ అవుతుందో చెప్పలేని పరిస్థితి. సరిగ్గా.. ఇప్పుడు ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో చిక్కుకున్నారు బీజేపీ ఎంపీ కం ఫైర్ బ్రాండ్ ధర్మపురి అర్వింద్.
నిజామాబాద్ ఎంపీ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న ఆయన.. తాజాగా ఒక ఇష్యూలో తీవ్రమైన ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు. స్వామి (ఆంజేయస్వామి) మాలలో ఉన్న ఒక ప్రముఖ టీవీ చానల్ రిపోర్టర్ మైకు పట్టుకొని ఆయన వద్ద బైట్ తీసుకునేందుకు వెళ్లారు. నిజామాబాద్ రాజకీయ పరిణామాలపై ఆయన్ను ప్రశ్నించబోతుండగా.. ‘‘మీకు చరిత్ర అంతా చెప్పాలా?’’ అంటూ విసురుగా మాట్లాడటంతో సదరు రిపోర్టు ఇబ్బందికి గురయ్యారు. ఆ వెంటనే.. మీకు ఇంట్రస్టు లేకుంటే నో ప్రాబ్లం అంటూ స్మూత్ గా పక్కకు వచ్చేశారు.
దీనికి సంబంధించిన చిట్టి వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఒక స్వామి మాల వేసుకున్న వ్యక్తిని అలా తక్కువ చేసి మాట్లాడతావా? నోరు తెరిస్తే హిందువు.. హిందుత్వ అంటూ పెద్ద మాటలు చెప్పే అర్వింద్.. సాటి మనిషితో గౌరవంగా మాట్లాడాలన్న కనీస బాధ్యత లేకుండా వ్యవహరించటమా? అంటూ మండిపడుతున్న పరిస్థితి. ఇప్పటికే తన నోటి మాట తీరుతో తరచూ వివాదాల్లోకి వెళుతున్న ఆయన.. కీలకమైన ఎన్నికల వేళలో అయినా కాస్తంత సంయమనంతో వ్యవహరించాలన్న విషయాన్ని ఎందుకు మిస్ అవుతున్నారు? అన్నది ప్రశ్నగా మారింది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతదన్న పాయింట్ ను మిస్ కావటం ఏమిటి భయ్యా? అంటూ కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.