తెలంగాణ యువకుడికి అమెజాన్ భారీ ఆఫర్... బ్యాక్ గ్రౌండ్ ఇదే!
తెలంగాణలోని వికారాబాద్ జిల్లాకు చెందిన ఓ యువకుడికి అద్భుతమైన అవకాశం దక్కింది.
By: Tupaki Desk | 9 Dec 2024 2:30 PM GMTతెలంగాణలోని వికారాబాద్ జిల్లాకు చెందిన ఓ యువకుడికి అద్భుతమైన అవకాశం దక్కింది. ఇందులో భాగంగా... ప్రఖ్యాత ఐటీ కంపెనీ అమెజాన్ లో రూ.2 కోట్ల వార్షిక వేతనం ప్యాకేజీతో ప్రతిష్టాత్మకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. వికారాబాద్ జిల్లా బోంరాస్ పేట మండలం తుంకిమెట్ల గ్రామానికి చెందిన అర్బాజ్ ఖురేషికి ఈ అరుదైన అవకాశం దక్కింది.
అవును... వికారాబాద్ జిల్లాకు చెందిన అర్బాజ్ ఖురేషి ప్రముఖ ఐటీ కంపెనీలో రెండు కోట్ల రూపాయల వార్షిక వేతనంతో అప్లైడ్ సైంటిస్ట్ గా ఎంపికయ్యారు. నేడు (సోమవారం) అమెజాన్ లో జాయినింగ్. ఖురేషి తండ్రి ప్రస్తుతం ఎక్సైజ్ శాఖలో జాయింట్ కమిషనర్ గా పనిచేస్తున్నారు.
ఇక.. 2019లో ఐఐటీ పాట్నా నుంచి కంప్యూటర్ సైన్స్ లో బీటెక్ పూర్తి చేసిన అర్భాజ్ ఖురేషి మూడో సంవత్సరంలో ఫ్రాన్స్ కు చెందిన ప్రముఖ మెషిన్ లెర్నింగ్ నిపుణుడు గేల్ డయాస్ తో మూడు నెలల పాటు శిక్షణ పొందాడు. ఆ తర్వాత బెంగళూరులోని మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ లో రెండేళ్లు పనిచేశారు.
ఈ క్రమంలోనే 2023లో అమెరికాలోని యూనివర్శిటీ ఆఫ్ మసాచుసెట్స్ యూనివర్సిటీ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ లో మాస్టర్స్ డిగ్రీని పోందాడు. ఈ సమయంలో... గూగుల్ లో ఇంటర్న్ చేసే అవకాశం కూడా లభించిందని చెబుతున్నారు. తాజాగా అమెజాన్ లో ప్రతిష్టాత్మకమైన పోస్టుకి ఎంపికయ్యారు!