Begin typing your search above and press return to search.

యూఎస్ వీసా కోసం వెయిటింగ్? భారతీయులకు స్వీట్ న్యూస్

వీసా స్లాట్ల పెంపుపై భారత్ లోని అమెరికా రాయబార కార్యాలయం తాజాగా సోషల్ మీడియాలో ప్రకటన విడుదల చేసింది.

By:  Tupaki Desk   |   30 Sep 2024 6:45 PM GMT
యూఎస్ వీసా కోసం వెయిటింగ్? భారతీయులకు స్వీట్ న్యూస్
X

అగ్రరాజ్యం అమెరికా వీసా కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్త వచ్చేసింది. ఇప్పుడున్నకోటాకు అదనంగా రెండున్నర లక్షల వీసా అపాయింట్ మెంట్లను అందుబాటులో ఉంచుతున్నట్లుగా పేర్కొంది. టూరిస్టులు.. నైపుణ్యం కలిగిన కార్మికులతో పాటు విద్యార్థులకు ఈ వీసాలు సాయంగా ఉండనున్నాయి. వీసా స్లాట్ల పెంపుపై భారత్ లోని అమెరికా రాయబార కార్యాలయం తాజాగా సోషల్ మీడియాలో ప్రకటన విడుదల చేసింది.

తాజాగా పెంచుతూ నిర్ణయం తీసుకున్న వీసా స్లాట్లతో వేలాది మంది భారతీయ దరఖాస్తుదారులు సకాలంలో ఇంటర్వూలు పొందేందుకు దోహదం చేస్తాయని అమెరికా రాయబార కార్యాలయం పేర్కొంది. అమెరికా - భారత్ సంబంధాలు మరింత బలోపేతం చేయటంలో సాయం చేస్తుందని పేర్కొంది. అంతేకాదు.. కీలక ప్రయాణాన్ని సులువు చేస్తుందని పేర్కొంది.

వరుసగా రెండో ఏడాది కూడా పది లక్షలకు పైగా నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా అపాయింట్ మెంట్లను చేపట్టినట్లు యూఎస్ ఎంబసీ పేర్కొంది. ప్రస్తుతం బిజినెస్.. టూరిస్టులపై ఫోకస్ చేసినట్లుగా వెల్లడించింది. గత ఏడాది మాదిరే ఈ ఏడాది కూడా భారీ సంఖ్యలో విద్యార్థి వీసాలు జారీ చేసినట్లుగా చెప్పింది. భారత విద్యార్థులకు భారీగా వీసాలు జారీ చేయటంలో ఇది నాలుగో ఏడాది కావటం గమనార్హం. అయితే.. ఇప్పటివరకు ఎన్ని వీసాలు జారీ అయ్యాయి? అన్న దానిపై రాయబార కార్యాలయం స్పష్టత ఇవ్వలేదు. గత ఏడాది మాత్రం 1.4 లక్షల మంది భారతీయ విద్యార్థులకు యూఎస్ వీసాలు ఇచ్చిన విషయం తెలిసిందే.