కేసీఆర్, జగన్ మాజీ ముఖ్యమంత్రులు కాదా..?
అందుకని వారి స్థైర్యం సడలకుండా మాజీ సీఎం అనే ప్రస్తావించం లేదు. అందులోనూ ‘సీఎం’ అనే పదంలో ఉన్న అధికార దర్పం ‘మాజీ సీఎం’లో ఉండదు కదా..?
By: Tupaki Desk | 29 Jun 2024 12:30 AM GMTతెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసి 7 నెలలు దాటింది. కొత్త ప్రభుత్వం ఏర్పడి కూడా ఏడు నెలలవుతోంది. ఏపీలో ఎన్నికలు పూర్తయి నెలన్నర అవుతోంది. ఫలితాలు వచ్చి 25 రోజులు.. కొత్త ప్రభుత్వం ఏర్పడి రెండు వారాలు దాటుతోంది. ఇక్కడ అందరూ గమనించాల్సిన పరిణామం ఏమంటే.. రెండు రాష్ట్రాల్లోనూ అధికార మార్పిడి జరగడం. తెలంగాణలో అప్రతిహతంగా దాదాపు పదేళ్లు పాలించిన కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్, ఏపీలో వై నాట్ 175 అంటూ బరిలో దూకిన వైఎస్సార్సీపీ రెండూ పరాజయం పాలయ్యాయి. దీంతో తెలంగాణలో కాంగ్రెస్, ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాయి.
పార్టీ అధినేతలుగానే..
తెలంగాణలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎంతో నమ్మకంతో ఎన్నికలకు వెళ్లారు. 90 శాతంపైగా పాత అభ్యర్థులనే మళ్లీ నిలిపి భంగపడ్డారు. ఈ ఎన్నికల్లో గనుక బీఆర్ఎస్ గెలిచి ఉంటే ఎలా ఉండేదో కానీ.. ఓటమి చాలా దెబ్బకొడుతోంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా వెళ్లిపోతున్నారు. లోక్ సభ ఎన్నికల్లో ఒక్క సీటూ నెగ్గలేదు. కాగా, కేసీఆర్ తొలిసారి సీఎం అయిన 2014 అనంతరం నమస్తే తెలంగాణ పత్రికను సొంతం చేసుకున్నారు. బీఆర్ఎస్ పత్రికగా పదేళ్ల పాటు నమస్తే హవా సాగింది. కేసీఆర్ సీఎంగా ఉన్నన్నాళ్లూ ఆయనను సీఎంగానే రాసింది. అయితే, ఓటమి తర్వాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత అంటూ పేర్కొంటోంది. మాజీ సీఎం కేసీఆర్ అని మాత్రం ప్రస్తావించడం లేదు.
ఏపీలో అలా..
2019 నుంచి ఐదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ పథకాల వెల్లువతో ప్రజల్లో ఓ రకమైన ఇమేజ్ సొంతం చేసుకున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. మరోసారి ఆయనదే అధికారం అనేంతటి వాతావరణం కనిపించింది. ఇటీవలి ఎన్నికల్లో మాత్రం ఫలితాలు చాలా భిన్నంగా వచ్చాయి. కాగా, సీఎంగా వైఎస్ జగన్ పథకాలు, కార్యక్రమాలకు ఆయన సొంత మీడియా సాక్షిలో తీవ్ర స్థాయిలో ప్రచారం లభించింది. అప్పట్లో సీఎం జగన్ అంటూ రాసుకొచ్చిన ఆ మీడియాలో ఇప్పుడు మాత్రం మాజీ సీఎం జగన్ అని రాయడం లేదు. కేవలం వైసీపీ అధినేతగా లేదా వైఎస్సార్సీపీ అధ్యక్షుడిగానే ప్రస్తావిస్తున్నారు.
పరాభవం.. శ్రేణులకు అభయం
కేసీఆర్, వైఎస్ జగన్ ఇద్దరూ సొంతంగా ప్రాంతీయ పార్టీలను పెట్టుకుని అధికారంలోకి వచ్చారు. పార్టీపై వీరి నియంత్రణ చాలా ఎక్కువ. వారికి తెలియకుండా చీమ కూడా కదలదు. అలాంటి స్థితిలో వీరు పార్టీ కేడర్ కు సర్వస్వం. అందుకని వారి స్థైర్యం సడలకుండా మాజీ సీఎం అనే ప్రస్తావించం లేదు. అందులోనూ ‘సీఎం’ అనే పదంలో ఉన్న అధికార దర్పం ‘మాజీ సీఎం’లో ఉండదు కదా..?