జనసేనతో పొత్తుండదా ?
పోటీనుండి తప్పుకుని, జనసేనకు మద్దతివ్వక మరి తమ్ముళ్ళు ఏమిచేస్తారు ? ఎవరికి మద్దతుగా నిలబడతారనేది ఇపుడు ఆసక్తిగా మారింది.
By: Tupaki Desk | 30 Oct 2023 3:30 PM GMTతెలంగాణా రాజకీయ పరిణామాలను చూసిన తర్వాత ఈ విషయం అందరికీ అర్ధమైపోయింది. రాబోయే ఎన్నికల్లో బీజేపీ-జనసేన కలిసి పోటీచేయాలని డిసైడ్ అయ్యింది. సీట్ల సంఖ్య, నియోజకవర్గాలు మాత్రమే ఫైనల్ కావాల్సుంది. రాజకీయ పరిణామాల్లో ఇది ఒక అంశం అయితే ఎన్నికలకు దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయించటం మరో ఎత్తు. టీడీపీ నిర్ణయంతో రాజకీయ సమీకరణలు మారిపోయే అవకాశాలు కనబడుతున్నాయి. మిగిలిన సమీకరణలు ఎలాగున్నా తెలంగాణాలో జనసేనకు టీడీపీ మద్దతుండదనే విషయం స్పష్టమైపోయింది.
ఏపీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీచేయాలని నిర్ణయించుకున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెండుపార్టీలు ఐక్య కార్యాచరణను రెడీ చేసుకుంటున్నాయి. ఇక్కడ కూడా రెండుపార్టీల మధ్య సీట్ల షేరింగ్ ఒక్కటే తేలాల్సుంది. ఏపీలో రెండుపార్టీలమధ్య పొత్తు కుదిరిన తర్వాత తెలంగాణాలో బీజేపీ-జనసేన మధ్య పొత్తు కుదిరింది. తెలంగాణాలో కూడా జనసేన, టీడీపీ కలిసి పోటీచేస్తాయన్నట్లు మొదట్లో ప్రచారం జరిగింది. అయితే తాజా పరిణామాల్లో బీజేపీ-జనసేనలు పొత్తు పెట్టుకున్నాయి.
ఈ రెండుపార్టీల పొత్తు కారణంగా టీడీపీది ఒంటరిపోరాటమే అనే ప్రచారం మొదలైపోయింది. తీరాచూస్తే ఇపుడు టీడీపీ పోటీనుండి తప్పుకున్నది. దాంతో జనసేనకు టీడీపీ మద్దతు ఉండదనే విషయమై క్లారిటి వచ్చేసింది. పోటీనుండి తప్పుకుని, జనసేనకు మద్దతివ్వక మరి తమ్ముళ్ళు ఏమిచేస్తారు ? ఎవరికి మద్దతుగా నిలబడతారనేది ఇపుడు ఆసక్తిగా మారింది. పార్టీకి 119 నియోజకవర్గాల్లో కొన్ని చోట్ల ఇంకా ఓటుబ్యాంకు మిగిలే ఉంది. తమ్ముళ్ళ అంచనా ప్రకారం చాలా నియోజకవర్గాల్లో తక్కువలో తక్కువ 5 వేల ఓట్లున్నాయట.
మరీ ఓట్లన్నీ ఎవరికి పోలవుతాయి ? ఏ రూపంలో పోలవుతాయనే విషయంలో అయోమయం పెరిగిపోతోంది. ఇక్కడ టీడీపీకి కొంచెం ఇబ్బందికరమైన విషయం ఉంది. అదేమిటంటే తెలంగాణాలో జనసేనతో పొత్తులేకపోయినా ఏపీలో మాత్రం ఉంది. పార్టీ నేతలను కన్వీన్స్ చేయగలిగినా మామూలు జనాలను కన్వీన్స్ చేయటం అంత సులభంకాదు. అయితే ఈ విషయాలను చంద్రబాబునాయుడు అండ్ కో ఆలోచించకుండా ఉండరు. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాల్సిందే.