విడాకులకు ఉంగరాలు... “డివోర్స్ రింగ్స్” ట్రెండ్ గురించి తెలుసా?
దీంతో... ఈ విడాకుల ఉంగరాల ట్రెండ్ పై నెట్టింట ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
By: Tupaki Desk | 13 April 2024 5:30 PM GMTమనసులు కలిసిన, జీవితాన్ని కలిసి పంచుకోవాలనుకుంటున్న ఇద్దరు మనుషులు ఎంగేజ్మెంట్ రింగ్స్ ఒకరికి ఒకరు పెట్టుకోవడం తెలిసిందే! చేతికి ఆ ఉంగరం ఉంటే... ఎంగేజ్మెంట్ అయిపోయిందని, వారి జీవితంలో మరొకరికి ప్రవేశం లేదని చెప్పడానికి సంకేతంగా ఉంటుంది! ఈ సమయంలో తాజాగా తెరపైకి డివోర్స్ రింగ్స్ వచ్చాయి. దీంతో... ఈ విడాకుల ఉంగరాల ట్రెండ్ పై నెట్టింట ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
అవును... ప్రస్తుతం విడాకుల ఉంగరాలు ట్రెండ్ గా మారుతోందని అంటున్నారు. అమెరికన్ మోడల్ ఎమిలీ రతాజ్ కోవ్ స్కీ తాజాగా "డివోర్స్ రింగ్స్" ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ విడాకులను ప్రకటించారు. దీంతో ఈ విషయం వైరల్ గా మారింది. విడిపోయిన జంటలు ఇటీవల బ్రేక్ అప్ పార్టీలు చేసుకోవడం సర్వసాదారణం అయిపోయిందని అంటున్న నేపథ్యంలో... ఇప్పుడు కొత్తగా విడాకుల ఉంగరాలు తెరపైకి వచ్చాయి!
అమెరికన్ మోడల్, నటి ఎమిలీ రతాజ్ కోవ్ స్కీ తన విడాకుల ఉంగరాల ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో పంచుకోవడంతో ఈ ట్రెండ్ ను తెరపైకి తెచ్చింది. ఆమె తన టోయ్-ఎట్-మోయి స్టైల్ ఎంగేజ్మెంట్ రింగ్ ని రెండు వేర్వేరు రింగులుగా మార్చుకుంది. ఈ సందర్భంగా... మీరు మీ భాగస్వామి నుండి విడిపోయిన తర్వాత మీ వివాహ ఉంగరాన్ని మీ ఆభరణాల పెట్టెలో ఉంచకూడదనుకుంటే, దానిని విడాకుల రింగ్ గా మార్చడం పరిగణించదగిన ఎంపిక అని ఆమె వెల్లడించింది!
వాస్తవానికి ఈ తరహాలో వెస్ట్రన్ కంట్రీస్ లో ఇవి పాపులర్ గానే ఉన్నాయి! న్యూయార్క్ లోని జ్యూవెలరీ షాపులు 3 ఏళ్లుగా డివోర్స్ రింగ్స్, బ్రేకప్ రింగ్స్ తయారు చేస్తున్నాయి. అయితే... రతాజ్ కోవ్ స్కీ తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం వైరల్ గా మారింది. ఇప్పుడు ఇది సరికొత్త ట్రెండ్ గా మరింత ఎక్కువగా మారుతుందని అంటున్నారు.
తాజాగా ఈ విషయాలపై స్పందించిన కౌన్సెలింగ్ సైకాలజిస్ట్ లు స్పందిస్తూ... ప్రజలు విడాకులను కొత్త కోణంలో చూడటం ప్రారంభించారని.. ఒకరకంగా అది గొప్ప విషయమే అని అంటున్నారు. భాగస్వామికి అవలక్షణాలు ఉన్నప్పటికీ చాలా సార్లు వ్యక్తులు వివాహం లేదా సంబంధానికి కట్టుబడి ఉంటారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారుతున్నాయని చెబుతున్నారు. అది కాస్తా ఇప్పుడు సెలబ్రేట్ చేసుకునేవరకూ వెళ్లిందని అంటున్నారు!