బీజేపీతో ఉంటేనే సుఖమా...కారు పార్టీ స్టాండ్ ...!?
తెలంగాణాలో బీఆర్ఎస్ ఓడిపోవడంతో ఆ పార్టీ ఆశలు అన్నీ గల్లంతు అయ్యాయి.
By: Tupaki Desk | 26 Dec 2023 1:30 AM GMTకేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. ఇపుడున్న సర్వేలు చూస్తే కనుక మరోసారి కేంద్రంలో మోడీ అధికారంలోకి రావడం ఖాయమని అంటున్నారు. హ్యాట్రిక్ పీఎం గా మోడీ రికార్డుని క్రియేట్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక తెలంగాణాలో బీఆర్ఎస్ కి అయిదేళ్ల దాకా అధికారం దక్కే సూచనలు అయితే లేవు.
అదే బీజేపీతో కలసి ఉంటే ఏమైనా అద్భుతం జరగవచ్చు. ప్రస్తుతం బీఆర్ఎస్ నేతలు ఇదే ఆలోచిస్తున్నారా అంటే ప్రచారం అయితే అలా సాగుతోంది. తెలంగాణాలో బీఆర్ఎస్ ఓడిపోవడంతో ఆ పార్టీ ఆశలు అన్నీ గల్లంతు అయ్యాయి. అధికార వియోగం అంటే తట్టుకోలేని వ్యవహారం.
వెనక్కి తిరిగి చూస్తే 2014 ముందు వరకూ టీఆర్ఎస్ గా ఉన్న ఉద్యమ పార్టీ వ్యవహారమే వేరు. తెలంగాణా కోసం పోరాడుతున్న ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ వెంట అంతా ఉండేవారు. ఆ విధంగా చేతిలో అధికారం లేకపోయినా నాడు రాజకీయాల్లో అగ్రభాగాన టీఆర్ఎస్ నిలిచింది.
ఇపుడు అలాంటి పరిస్థితి అయితే లేదు అని అంటున్నారు. బీఆర్ఎస్ గా మారిన తరువాత మరీ ఇబ్బందిగా ఉంది. ఇటు జాతీయ పార్టీ అని చెప్పుకోలేక అలాగే ప్రాంతీయ పార్టీగా మనుగడకు సెంటిమెంట్ అయిన టీ అన్న అక్షరం పోయి ఇక్కట్లు మొదలయ్యాయి.
ఈ నేపధ్యంలో కాంగ్రెస్ తెలివిగా రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవిని అప్పగించింది. ఆయన దూకుడు రాజకీయ నేత. ఏమైనా చేయగలిగే సమర్ధుడు. బీఆర్ఎస్ కి ఒకటికి పది జవాబు చెప్పగలవాడు. ఆయనకు గ్లామర్ ఉంది. దాంతో బీఆర్ఎస్ కి నెల రోజులలో తెలంగాణాలో పొలిటికల్ సీన్ ఏంటో అర్ధం అయిపోయింది అని అంటున్నారు.
దాంతో ఏదో ఊతం కావల్సి వస్తోంది అని అంటున్నారు. లెక్కలు చూస్తే బీజేపీతో కూడితే సుఖమూ పరమూ అని చెబుతున్నాయట. ఎలా అంటే కేంద్రంలో మూడవసారి బీజేపీకి అధికారం వస్తే ఆ పార్టీతో స్నేహం చేసి మిత్రపక్షంగా మారితే రేపటి రోజున బీఆర్ఎస్ ఎంపీలు గెలిచినా అధికారంలో భాగస్వాములు అవుతారు.
కేసీఆర్ స్వయంగా ఎంపీకి పోటీ చేస్తారు అని అంటున్నారు. అలా ఆయన కేంద్ర మంత్రిగా వెళ్లే చాన్స్ ఉంటుంది. అంటే కేంద్రంలో అధికారం ఉంచుకుని తెలంగాణాలో చక్రం తిప్పవచ్చు. కాంగ్రెస్ ని కట్టడి చేయవచ్చు. ఇక బీజేపీ అండ ఉంటే ఎన్నికల తరువాత కాంగ్రెస్ సర్కార్ ని కెలికి వీలైతే ఆ పార్టీలోని అసమ్మతి అసంతృప్తి ఏమైనా ఉంటే ఎగోదోసి మరోసారి అధికారం అందుకోవచ్చు. బీజేపీ బీఆర్ఎస్ కలిస్తే ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. అయితే దానికి కావాల్సింది మరో పదమూడు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. అది మరో ఆరు నెలలలో కేంద్రంలో కాంగ్రెస్ కి అధికారం దక్కకపోతే కంప్లీట్ గా పొలిటికల్ సీన్ మారుతుంది అని బీఆర్ ఎస్ అంచనా కడుతోంది.
ఈ లెక్కలతోనే ఇపుడు బీఆర్ ఎస్ ఉంది అని అంటున్నారు. ఇటీవల కవిత కూడా హిందూత్వకు అనుకూలంగా మాట్లాడుతున్నారు అని అంటున్నారు. ఉత్తరాది వారి మీద దారుణంగా విమర్శలు చేసిన డీఎంకే మీద కవిత విరుచుకుపడ్డారు. ఇండియా కూటమిలో ఉన్న డీఎంకేని ఈ విషయంలో కట్టడి చేయాల్సిన బాధ్యత రాహుల్ గాంధీకి లేదా అని ఆమె అంటున్నారు. కాంగ్రెస్ సైతం సనాతన ధర్మం కించపరచే విధంగా వ్యవహరిస్తోందని కూడా కవిత అంటున్నారు. సో బీఆర్ఎస్ టోన్ లో ఈ మార్పు చూస్తే ఏదో జరగబోతోంది అని అంటున్నారు అంతా.