రంగంలోకి ఆర్మీ.. బాబు ఇక కాస్త రెస్టు తీసుకోవచ్చు !
విజయవాడలో సంభవించిన ఘోర విపత్తు నేపథ్యంలో చంద్రబాబుకు నాలుగు రోజులుగా కంటిపై కునుకు లేకుండా పోయింది.
By: Tupaki Desk | 6 Sep 2024 5:22 AM GMTవిజయవాడలో సంభవించిన ఘోర విపత్తు నేపథ్యంలో చంద్రబాబుకు నాలుగు రోజులుగా కంటిపై కునుకు లేకుండా పోయింది. ఉదయం 6 గంటల నుంచి అర్థరాత్రి 3 గంటల వరకు ఆయన బాధితుల కోసమే పనిచేస్తున్నారు. తొలి రెండు రోజులు ఆదివారం, సోమవారం అయితే.. చంద్రబాబు అసలు కంటిపై కునుకే లేకుండా పనిచేశారు. బాధిత ప్రాంతాల్లో అర్థరాత్రి కూడా పర్యటించి.. వారి సమస్యలు విన్నారు. ఆహారం, తాగునీటిని సరఫరా చేశారు. అంతేకాదు.. అధికారులకు వార్నింగులు, పార్టీ నాయకులకు హెచ్చరికలకు.. మంత్రులకు దిశానిర్దేశాలు ఇలా.. అన్ని విధాలా చంద్రబాబు తన పనితనాన్ని చూపించారు.
అయితే.... అలా తగ్గినట్టే తగ్గిన బుడమేరు.. మళ్లీ గురువారం సాయంత్రం నుంచి గంట గంటకు పెరిగింది. దీంతో మరింత విపత్తు ఖాయమని అందరూ అనుకున్నారు. దీంతో మరోసారి చంద్రబాబు రంగంలోకి దిగారు. బుడమేరు వరదను మళ్లించేందుకు చేయాల్సిన పనులు, గండ్లు పూడ్చేందుకు చేయాల్సిన కార్యాచరణపై అధికారులతో ఆయన చర్చించారు. ఇంతలోనే కేంద్ర నుంచి మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ వచ్చారు. ఆయన కూడా బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. అనంతరం.. ఆర్మీని రంగంలోకి దింపాలని చంద్రబాబు కోరారు. దీనికి చౌహాన్ సమ్మతించారు.
అనంతరం.. రెండు గంటల వ్యవధిలోనే ఆర్మీరంగ ప్రవేశం చేసింది. విశాఖ తూర్పు తీరానికి చెందిన దళం.. (త్రివిధ దళాల్లో ఒక భాగం) విజయవాడకు చేరుకుంది. ప్రత్యేక విమానంలో 50 మంది అప్పటికప్పుడు చేరుకున్నారు. ఆ వెంటనే.. వారు కార్యరంగంలోకి దిగారు. భారీ ఫ్లడ్ లైట్లు, తాళ్లు సహా.. అన్ని ఎక్విప్‌మెంట్లతోనూ సైన్యం రంగంలోకి వచ్చింది. గురువారం రాత్రికి రాత్రి వారితో బుడమేరు గండ్లు పూడ్డి వేత పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని కూడా.. చంద్రబాబు పర్యవేక్షించారు. అంతేకాదు.. సీనియర్ అదికారులను పర్యవేక్షకులుగా నియమించారు. మొత్తానికి ఆర్మీ రంగంలోకి దిగడం.. సీనియర్ అధికారులు పర్యవేక్షించడంతో చంద్రబాబు కొంత మేరకు ఊపిరి పీల్చుకున్నారు.