Begin typing your search above and press return to search.

ఐదున్నర దశాబ్ధాల నాటి ప్రమాదం... ఇప్పుడు లభ్యమైన అవశేషాలు!

అవును.. సుమారు ఐదున్నర దశాబ్ధాల క్రితం భారత వాయుసేన విమాన ప్రమాదానికి సంబంధించిన సెర్చ్ ఆపరేషన్ లో కీలక పురోగతి చోటు చేసుకుంది.

By:  Tupaki Desk   |   1 Oct 2024 5:30 AM GMT
ఐదున్నర దశాబ్ధాల నాటి ప్రమాదం...  ఇప్పుడు లభ్యమైన అవశేషాలు!
X

ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు రెస్క్యూ టీమ్ వెంటనే అక్కడకు చేరుకొవడం.. క్షతగాత్రులను హాస్పత్రికి, మృతదేహాలను మార్చురీకి చేస్తుంటారనే సంగతి తెలిసిందే. అయితే 1968లో జరిగిన విమాన ప్రమాదానికి సంబంధించిన సెర్చ్ ఆపరేషన్ లో ఇప్పుడు కీలక పురోగతి చోటు చేసుకున్న అరుదైన ఘటన భారత్ లో జరిగింది.

అవును.. సుమారు ఐదున్నర దశాబ్ధాల క్రితం భారత వాయుసేన విమాన ప్రమాదానికి సంబంధించిన సెర్చ్ ఆపరేషన్ లో కీలక పురోగతి చోటు చేసుకుంది. నాడు ఆ ప్రమాదంలో అదృశ్యమైన వారిలో నలుగురి అవశేషాలను గుర్తించినట్లు సైన్యం వెల్లడించింది. మిగతావారి కోసం సెర్చ్ ఆపరేషన్ కంటిన్యూ అవుతుందని తెలిపింది.

వివరాళ్లోకి వెళ్తే... 1968 ఫిబ్రవరి 7న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన రవాణా విమానం చండీగఢ్ నుంచి లేహ్ కు బయలుదేరింది. ఈ క్రమంలో... హిమాచల్ ప్రదేశ్ లోని రోగ్ తంగ్ పాస్ లో కుప్పకూలిపోయింది. ఆ సమయంలో ఆ విమానంలో 102 మంది ఉన్నారు. ఆ ప్రమాదంలో వారందరికీ ఆచూకీ లేకుండా పోయింది.

ఆఖరికి విమాన శకలాలు కూడా లభించలేదు. ఈ సమయంలో పలుమార్లు సెర్చ్ ఆపరేషన్ చేపట్టినప్పటికీ.. ఆ ప్రాంతంలోని అత్యంత ప్రతికూల పరిస్థితుల కారణంగా ఎలాంటి ఫలితం దక్కలేదు! ఈ క్రమంలో... 2003లో హిమాలయన్ మౌంటెనీరింగ్ ఇనిస్టిట్యూట్ కు చెందిన ట్రెక్కింగ్ బృందానికి ఓ మృతదేహం అవశేషాలు కనిపించాయి.

అలా 2003లో ఓ మృతదేహం అవశేషాలు కనిపించగా.. అనంతరం 2007లో మరో మూడు మృతదేహాలు ఆర్మీ స్పెషల్ టీమ్స్ గుర్తించాయి. అయితే తాజాగా ఇండియన్ ఆర్మీకి చెందిన తిరంగ మౌంటెయిన్, డోఘ్రా స్కౌంట్స్ రెస్క్యూ బృందాలు నిర్వహించిన ఆపరేషన్ లో మరో నలుగురి అవశేషాలు లభ్యమయ్యాయి.

దీంతో... ఈ ఆపరేషన్ కంటిన్యూ అవుతుందని.. ఈ సెర్చ్ కొనసాగుతుందని చెబుతున్నారు. దీంతో... మిగతా బాధిత కుటుంబాల్లో ఆశలు చిగురిస్తున్నాయి. తమవారి అవశేషాలు కూడా లభిస్తాయేమోనని చూస్తున్నారని అంటున్నారు.