Begin typing your search above and press return to search.

బంగ్లాదేశ్ : పద్దెనిమిదేళ్ళు సైనిక పాలనలోనే !

ఎంతో విశిష్టమైన చరిత్ర కలిగి శతాబ్దాల సాంస్కృతిక వారసత్వం కలిగిన బంగ్లాదేశ్ మరోసారి ప్రపంచ వార్తలలోకి ఎక్కింది.

By:  Tupaki Desk   |   6 Aug 2024 3:41 AM GMT
బంగ్లాదేశ్ : పద్దెనిమిదేళ్ళు సైనిక పాలనలోనే !
X

ఎంతో విశిష్టమైన చరిత్ర కలిగి శతాబ్దాల సాంస్కృతిక వారసత్వం కలిగిన బంగ్లాదేశ్ మరోసారి ప్రపంచ వార్తలలోకి ఎక్కింది. ఆ దేశం సైనిక పాలనలోకి వెళ్ళిపోయింది. ప్రజాస్వామ్య స్పూర్తిగా కొనసాగుతున్న ప్రభుత్వం కుప్ప కూలింది. బంగ్లాదేశ్ బ్రిటిష్ వారి కాలంలో ఒక్కప్పటి పూర్ణ బంగ్లా ప్రాంతం.

అయితే మత ప్రాతిపదికన 1947లో దేశం విడిపోయినపుడు తూర్పు బంగ్లాదేశ్ అంతా వేరు అయి పాకిస్తాన్ లో విలీనం అయింది. అయితే పాకిస్థాన్ తో ఉన్నా తన విలక్షణతను చాటుకుంటూ తూర్పు బంగ్లాదేశ్ 1947 నుంచి అనేక పోరాటాలు పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసింది. ఆర్థిక, సాంస్కృతిక వివాదాలు కూడా దానికి మరో కారణం అని చెప్పాలి. దానికి నాయకత్వం వహించిన వారు ముజిబుర్ రెహమన్.

పాకిస్థాన్ పాలనా పగ్గాలు తూర్పు పాకిస్తాన్ వారికి కూడా దక్కాలన్న కోరికతో అక్కడి వారు అంతా రహమాన్ నేతృత్వంలో పనిచేసారు. అలా పాకిస్థాన్ పాలకుల కంటిలో నలుసుగా మారిన రహమాన్ ని ఎన్నో సార్లు జైలు గోడల మధ్య బంధించారు. ఆయన బెంగాలీ ప్రజలకు నాయకత్వం వహిస్తూ అవామీ లీగ్ పార్టీని స్థాపించారు.

ఆ పార్టీయే పాకిస్థాన్ ఎన్నికల్లో 1970లో పోటీ చేస్తే అఖండ మెజారిటీ దక్కింది. అయినా రెహమాన్ కి పాక్ పాలనా పగ్గాలు పాకిస్థాన్ పెద్దలు ఇవ్వడానికి అంగీకరించలేదు. పైగా రహమాన్ ని మరోసారి జైలులో పెట్టారు. ఆ తరువాత ఆయన పాకిస్థాన్ పాలకుల మీద పోరాటంతో పాటు బంగ్లా దేశ్ కి సొంత అస్తిత్వం దేశం కోసం చేసిన ఉద్యమం తో పాకిస్తాన్ తో యుద్ధం వచ్చింది.

అలా తూర్పు పాకిస్థాన్ ని అణచివేసేందుకు పాక్ పాలకులు చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. మరో వైపు తూర్పు పాకిస్తాన్ కి భారత్ అండగా నిలిచింది. ఆ సమయంలో భారత ప్రధాని శ్రేమతి ఇందిరా గాంధీ తూర్పు పాకిథాన్ కి మద్దతుగా నిలిచి పాక్ తో నేరుగా తలపడింది. అలా బంగ్లాదేశ్ ఆవిర్భావానికి భారత్ కారణం అయింది.

అలా 1971 డిసెంబరు 16న స్వతంత్ర బంగ్లాదేశ్ అవతరించింది. 1973లో బంగ్లాదేశ్ కి జరిగిన తొలి ఎన్నికల్లో అవామీ లీగ్ విజయం సాధించింది. దాని నాయకుడు ముజిబుర్ రహమాన్ ప్రధాని అయ్యారు. అయితే ఆయనను 1975లో మిడ్- లెవల్ మిలటరీ అధికారులు కాల్చివేశారు. ఆ విధంగా బంగ్లాదేశ్ మిలటరీ పరం అయింది. 1975 నవంబరు 7లో దేశంలో సైనికాధికారం వచ్చింది. అది ఏకంగా పదహారేళ్ల పాటు అంటే 1991 దాకా కొనసాగింది.

ఈ మధ్యలో అనేక మంది సైనిక అధికారులే బంగ్లాదేశ్ ని పాలించారు. బంగ్లాదేశ్ రాజకీయ పార్టీలన్నీ సమైక్యంగా ప్రజల అండతో తిరుగుబాటు చేస్తే చివరి సైనిక అధ్యక్షుడు హొస్సైన్ మొహనద్ ఎర్షద్ రాజీనామా చేశారు. అలా 1991లో జరిగిన ఎన్నికలో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ గెలిచింది. 1996లో అవామీ లీగ్ పార్టీకి ముజిబుర్ రహమాన్ కుమార్తె షేక్ హసీనా నాయకత్వం వహించి గెలిచి అధికారం అందుకున్నారు. 2001లో మళ్లీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ గెలిచింది.

ఇలా ప్రజా పాలన సాగుతూండగా 2007లో మళ్లీ సైనికుల ఆధీనంలోకి బంగ్లా వెళ్ళింది. అలా రెండేళ్ల పాటు సాగిన రాజకీయ సంక్షోభం అనంతరం 2009లో జరిగిన ఎన్నికల్లో అవామీ లీగ్ గెలిచింది. అలా షేక్ హసీనా నాటి నుంచి నేటి వరకూ ఏకంగా 15 ఏళ్ల పాటు మూడు సార్లు ఎన్నికల్లో గెలిచి ప్రధానిగా ఉంటున్నారు. అయితే ఆమె పాలన పట్ల వ్యతిరేకతతో మళ్లీ సైనికులు పంజా విసిరారు. దాంతో బంగ్లా దేశ్ మళ్లీ సైనిక పాలన లోకి వెళ్లిపోయింది.