జోగితో బోణీ.. అరెస్టుల లిస్ట్ పెద్దదేనట ?
By: Tupaki Desk | 13 Aug 2024 11:30 PM GMTటీడీపీ కూటమి ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం వైసీపీ నేతలను టార్గెట్ చేస్తోంది. ఏ మాత్రం తొందరపడడంలేదు. పకడ్బంధీగా కేసులను ఫైల్ చేస్తోంది. శాఖాపరంగా ఎలాంటి పొరపాట్లూ తప్పులు లేకుండా రాకుండా జాగ్రత్త పడుతోంది. వైసీపీ ప్రభుత్వానికి టీడీపీ కూటమి ప్రభుతానికి తేడా ఏమిటి అంటే వైసీపీ హడావుడిగా అరెస్టులు చేస్తూ పోయింది.
ముందు అరెస్ట్ చేసి తరువాత వారి మీద బలమైన ఆధారాలు కోసం యత్నించేది. మరి కొన్నిసార్లు కేసులు బలంగా పెట్టాలనుకున్నా హడావుడి వల్ల ఇబ్బందులు వచ్చేవి. ఇక వైసీపీ కేసులు పెట్టినపుడు అవన్నీ రాజకీయ కక్ష సాధింపు కేసులుగా టీడీపీ సహా ప్రతిపక్షాలు విమర్శలు చేసేవి. అలా కొట్టొచ్చినట్లుగా బయటపడేవి. విషయం ఉన్నా లేకపోయినా అరెస్టులు చేస్తున్నారు అన్న పేరుని వైసీపీ అనవసరంగా పొందినట్లు అయింది.
అయితే ఇక్కడ టీడీపీ కూటమి ప్రభుత్వం మాత్రం చాలా చాకచక్యంగా వ్యవహరిస్తోంది అని అంటున్నారు. వైసీపీ నేతలను అరెస్ట్ చేయాలీ అంటే ముందుగా ఒక భారీ కసరత్తు చేస్తూ ఆయా అంశాలలో వారి పాత్రను గట్టిగా ఎస్టాబ్లిష్ చేసే ఆధారాలను సమీకరించుకుని మరీ అరెస్టులు చేస్తున్నారు అని అంటున్నారు.
ఈ క్రమంలోనే మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ అరెస్ట్ జరిగింది అని అంటున్నారు. ఇది అనూహ్యమైన అరెస్ట్ అని కూడా అంటున్నారు. జోగిని అరెస్ట్ చేయకుండా కుమారుడిని చేయడం ద్వారా కూటమి బిగ్ ట్విస్ట్ ఇచ్చింది అని అంటున్నారు. మరో వైపు చూస్తే అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ ను మంగళవారం సడెన్ గా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. జోగి రాజీవ్ తో పాటు జోగి రమేష్ బాబాయిని కూడా ఈ కేసుల్లో నిందితులుగా పేర్కొన్నారు. అగ్రిగోల్డ్ భూములను అక్రమంగా రిజిస్టర్ చేయించుకున్నారన్న ఆరోపణలతో జోగి రాజీవ్ ను అరెస్ట్ చేశారు.
మరో వైపు చూస్తే చంద్రబాబు ఇంటిపై దాడి కేసులోనూ జోగి రమేష్ కు తాడేపల్లి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇదిలా ఉంటే జోగి రమేష్ కుటుంబానికి అగ్రిగోల్డ్ భూముల వ్యవహారం ఉచ్చు గట్టిగానే బిగుస్తోందని అంటున్నారు. జోగి రమేష్ ఫ్యామిలీది ఈ విధంగా తొలి బోణీ అని అంటున్నారు. దీంతో మరిన్ని అరెస్టులకు తెర తీస్తారని అంటున్నారు.
మరి ఆ లిస్ట్ ఏంటి అంటే పెద్దదే అని జవాబు వస్తోంది. క్రిష్ణా జిల్లాలోనే మరో బిగ్ షాట్ గా ఉన్న వైసీపీ నేత అరెస్ట్ తో కధ కొత్త మలుపు తిరుగుతుందని అంటున్నారు. నిజానికి ఉమ్మడి క్రిష్ణా జిల్లాలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో తొలి అరెస్ట్ మొదలు కావాలని కానీ ఆయన కోసం అన్వేషణ సాగుతున్న క్రమంలో జోగి రమేష్ వైపు వ్యవహారం తిరిగిందని అంటున్నారు.
ఇపుడు ఇదే క్రిష్ణా జిల్లా నుంచి మాజీ మంత్రి కొడాలి నాని పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. తరువాత టార్గెట్ ఆయనే అని అంటున్నారు. ఆయనకు సంబంధించిన కేసు కూడా గట్టిగానే పెడతారని అంటున్నారు. ఆ తరువాత వరసలో మాజీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేరు ఉందని కూడా ప్రచారం సాగుతోంది.
ఆయన ఫైర్ బ్రాండ్ గా మారి చంద్రబాబుతో పాటు ఇతర నేతల మీద ఘాటైన విమర్శలు చేస్తూ వచ్చారు. టీడీపీని ఇబ్బందులు పెట్టారని అంటున్నారు. ఇలా ఉమ్మడి క్రిష్ణా జిల్లాలో కీలక నేతల మీదనే ఫోకస్ పెట్టారని అంటున్నారు. దీని తరువాత ఇతర జిల్లాల నేతలను బిగ్ షాట్స్ ని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం అవుతుంది.
మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే అక్రమ బియ్యం రవాణా వ్యవహారంలో తొందరలో అరెస్టులు ఉంటాయని హెచ్చరించారు. దాంతో ఎవరా బిగ్ షాట్స్ అని కూడా చర్చ మొదలైంది. మొత్తానికి వైసీపీ నేతలు రెడ్ బూక్ రాజ్యాంగం ఇదంతా అని టీడీపీ కూటమి మీద విమర్శలు చేస్తూంటే తప్పులు చేసిన వారి మీద చట్టపరమైన చర్యలు తప్పవని కూటమి నేతలు బదులిస్తున్నారు.