పుతిన్..నెతన్యాహు..యుద్ధ ప్రభువులు..అంతర్జాతీయ అరెస్ట్ వారెంట్లు
అయితే.. రష్యా అధినేత పుతిన్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ వీరిద్దరు మాత్రం వార్తల్లో వ్యక్తులుగా మిగిలిపోయారు.
By: Tupaki Desk | 22 Nov 2024 3:30 PM GMTప్రపంచంలో రెండు యుద్ధాలు జరుగుతున్నాయ్.. ఒకటి రష్యా-ఉక్రెయిన్ మధ్యన.. మరోటి ఇజ్రాయెల్-హమాస్ మధ్యన.. అయితే.. రష్యా అధినేత పుతిన్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ వీరిద్దరు మాత్రం వార్తల్లో వ్యక్తులుగా మిగిలిపోయారు. తమ లక్ష్యాలను చేరేందుకు రెండున్నరేళ్లుగా పుతిన్, 13 నెలలుగా నెతన్యాహూ యుద్ధాన్ని నడిపిస్తున్నారు. మరి వీరిని ఏ కోర్టులూ ఆపలేవా..? అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు-ఐసీసీ) ఒకటి ఉందని తెలుసా?
అప్పట్లోనే పుతిన్ కు వారెంటు
పుతిన్ ఉక్రెయిన్ మీద యుద్ధం మొదలుపెట్టిన మొదట్లోనే కొత్తలోనే తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నారు. అయితే, రెండున్నరేళ్ల తర్వాత ఉక్రెయిన్ లో నేరాలను గాను ఈ ఏడాది ఆగస్టులో ఐసీసీ వారెంట్ జారీ చేసింది. ఓ దశలో పుతిన్ సెప్టెంబరులో మంగోలియాకు వెళ్తారని అక్కడ ఆయనను అరెస్టు చేస్తారనే కథనాలు వచ్చాయి. కానీ, అదేమీ జరగలేదు. కాగా, ఉక్రెయిన్ లోని ఆక్రమిత ప్రాంతాల నుంచి పిల్లలను రష్యాకు చట్టవిరుద్ధంగా తరలించడం వంటి యుద్ధ నేరాలను ఐసీసీ పుతిన్ పై మోపింది. ఆయన అరెస్ట్ పై 2023లోనూ కథనాలు వచ్చాయి. పుతిన్ పై పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించాయి.
ఇప్పుడు నెతన్యాహూకూ..
గత ఏడాది అక్టోబరు 7న గాజా నుంచి వచ్చిన హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ పై దాడికి దిగి మారణకాండకు కారణమయ్యారు. అప్పటినుంచి హమాస్ ను లక్ష్యంగా చేసుకుని గాజాపై విరుచుకుపడుతూనే ఉంది ఇజ్రాయెల్. కానీ, ఎంతకూ ఈ యుద్ధం తెమలడం లేదు. పైగా హెజ్బొల్లా, ఇరాన్ కూడా ప్రవేశించాయి. హెజ్బొల్లాలను అణచివేసేందుకు లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. తాజాగా నెతన్యాహు పైనా అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. గాజాలో యుద్ధ నేరాలు, అమానుష చర్యలే దీనికి కారణమని పేర్కొంది. ఇజ్రాయెల్ రక్షణ శాఖ మాజీ మంత్రి యోవ్ గ్యాలంట్, హమాస్ నేతలు మహ్మద్ డెయిఫ్, యాహ్యా సిన్వర్, ఇస్మాయిల్ హనియేల పైనా అరెస్ట్ వారెంట్లు జారీ అవడం గమనార్హం. నెతన్యాహు, గ్యాలంట్.. గాజాలో హత్యలు, హింస, అమానవీయ చర్యలతో పాటు ఆకలిచావుల వంటి యుద్ధ నేరాలకు పాల్పడినట్లు ఐసీసీ ఆరోపించింది. అయితే, హమాస్ నేతలు సిన్వర్, హనియేలను ఇప్పటికే ఇజ్రాయెల్ హతమార్చిన సంగతి తెలిసిందే.
బైడెన్ అభ్యంతరం
రష్యా, అమెరికా రెండూ యుద్ధం చేస్తున్న దేశాలే. అయితే, పుతిన్ పై ఐసీసీ అరెస్టు వారెంట్ జారీ అయిన సమయంలో లేని అభ్యంతరాన్ని నెతన్యాహూ విషయంలో లేవనెత్తారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. ఇజ్రాయెల్, హమాస్ లను సమంగా చూడడాన్ని ఆయన వ్యతిరేకిస్తున్నారు. తమది ఇజ్రాయెల్ పక్షమేనని చెప్పారు. మరోవైపు నెతన్యాహూ ఐసీసీ చర్యను తీవ్రంగా ఖండించారు. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు తప్పుడు, అసంబద్ధ ఆరోపణలను తిరస్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. అది పక్షపాత, వివక్షాపూరిత రాజకీయ సంస్థ అని అభివర్ణించారు.