ఆల్ట్ మన్, బ్రాక్ మన్ @ మైక్రోసాఫ్ట్... సత్యనాదేళ్ల కీలక వ్యాఖ్యలు!
అవును... ఆల్ట్ మన్, బ్రాక్ మన్ కలిసి మైక్రోసాఫ్ట్ ఏఐ టీం కు నేతృత్వం వహించనున్నట్లు సత్య నాదెళ్ల పేర్కొన్నారు
By: Tupaki Desk | 20 Nov 2023 12:23 PM GMTఓపెన్ ఏఐ నుంచి ఉద్వాసనకు గురైన శాం ఆల్ట్ మన్, ఆయనతో పాటు ఓపెన్ ఏఐ నుంచి బయటకు వచ్చిన గ్రెగ్ బ్రాక్ మన్ లపై మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల కీలక ప్రకటన చేశారు. ఇందులో భాగంగా... ఆల్ట్ మన్ తమ కంపెనీ కొత్త కృత్రిమ మేధ పరిశోధన బృందంలో చేరనున్నారని వెల్లడించారు. అదేవిధంగా... గ్రెగ్ బ్రాక్ మన్ సైతం మైక్రోసాఫ్ట్ తో కలిసి పనిచేయనున్నట్లు తెలిపారు. దీంతో ఈ అంశం టెక్ బిజినెస్ వర్గాల్లో ఆసక్తిగా మారింది.
అవును... ఆల్ట్ మన్, బ్రాక్ మన్ కలిసి మైక్రోసాఫ్ట్ ఏఐ టీం కు నేతృత్వం వహించనున్నట్లు సత్య నాదెళ్ల పేర్కొన్నారు. ఈ సందర్భంగా... వారి సక్సెస్ కి కావాల్సిన వనరులు సమకూర్చేందుకు తాము వేగంగా చర్యలు చేపడతామని ఆన్ లైన్ వేదికగా వెల్లడించారు. దీంతో... ఓపెన్ ఏఐ లో అతిపెద్ద వాటాదారుగా ఉన్న మైక్రోసాఫ్ట్... అదే సంస్థ నుంచి ఉద్వాసనకు గురైన వారినికి అవకాశం ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఈ పరిణామాల నేపథ్యంలో ఓపెన్ ఏఐ సీఈఓగా శాం ఆల్ట్ మన్ స్థానంలో ట్విచ్ సహ వ్యవస్థాపకుడు ఎమ్మెట్ షియర్ ను నియమించినట్లు తెలుస్తుంది. దీంతో... ఎమ్మెట్ షియర్ సహా ఓపెన్ ఏఐ కొత్త నాయకత్వంతో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సత్య నాదెళ్ల ప్రకటించారు. ఓపెన్ ఏఐతో తమ భాగస్వామ్యం కొనసాగుతుందని క్లారిటీ ఇచ్చారు.
మరోవైపు వీడియో స్ట్రీమింగ్ సైట్ ట్విచ్ సహ వ్యవస్థాపకుడు ఎమ్మెట్ షియర్ ను కొత్త సీఈఓగా ఓపెన్ ఏఐ బోర్డు నియమించడానికి ముందు... ఆల్ట్ మన్ ను తొలగించిన వెంటనే మిరా మురాటిని నియమించిన సంగతి తెలిసిందే. అయితే, ఆమె కూడా ఆల్ట్ మన్ కు మద్దతు ప్రకటించడంతో తక్షణమే ఎమ్మెట్ షియర్ ను ఆ పదవిలోకి తీసుకురావడం ఓపెన్ ఏఐకి అనివార్యమైంది!
ఈ నేపథ్యంలో ఓపెన్ ఏఐ సీఈఓగా శాం ఆల్ట్ మన్ ను తిరిగి తీసుకొచ్చేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు స్పష్టమైందనే భావించాలి. వాస్తవానికి ఆల్ట్ మన్ ఓపెన్ ఏఐ లోకి తిరిగి రావడానికి సిద్ధంగానే ఉన్నానంటూనే.. కండిషన్స్ అప్లై అని అన్నారని కథనాలొచ్చాయి. దీంతో ఆ కండిషన్స్ కి కొంతమంది బోర్డు సభ్యులు అంగీకరించలేదని.. దీంతో ఆల్ట్ మన్ పునరాగమనం అనే టాపిక్ క్లోజ్ అయిపోయిందని అంటున్నారు!